వారూ వీరూ సిద్ధమే – They Are Ready -Jagan – Chandra Babu – Pawan Kalyan

By KTV Telugu On 12 March, 2024
image

KTV TELUGU :-

ఆంధ్ర ప్రదేశ్ లో  పాలక వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సమాయత్తం కావడంతో మిగతా పార్టీలకన్నా ముందంజలో ఉంది. ఎన్నికలకు పార్టీ కార్యకర్తలను సంసిద్ధం చేసే ఉద్దేశంతో  నాలుగు సిద్ధం సభలను నిర్వహించారు జగన్ మోహన్ రెడ్డి. ఇక ఎన్నికల ప్రచారంలో దూసుకుపోవడమే మిగిలి ఉంది. అటు ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం కూడా గేర్ మార్చింది. ఇప్పటికే జనసేనతో పొత్తు ఖరారు చేసుకుని మొదటి జాబితా విడుదల చేసిన చంద్రబాబు నాయుడు ఢిల్లీ వేదికగా బిజెపితోనూ పొత్తు ఖరారు చేసేసుకున్నారు.  పొత్తులపై క్లారిటీ వచ్చేయడంతో ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి సభలతో అదరగొట్టాలని  కూటమి నేతలు భావిస్తున్నారు.

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి  ఎన్నికల సమరానికి సంసిద్ధంగా ఉంచారు పార్టీని. జనవరి 27న భీమిలిలో మొదటి సిద్ధం సభ నిర్వహించిన జగన్ మోహన్ రెడ్డి ఫిబ్రవరి 4న దెందులూరు లో రెండో సభను ఫిబ్రవరి 18న రాప్తాడులో మూడో సభను  మార్చ్ 10న   బాపట్ల జిల్లా మేదరమెట్లలో నాలుగోదీ చివరిదీ అయిన సిద్ధం సభను నిర్వహించి ఊపు మీద ఉన్నారు. ఈ సభలన్నింటికీ లక్షలాదిగా పార్టీ కార్యకర్తలు అభిమానులు తరలి వచ్చారు. ఇక   రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారాన్ని  హోరెత్తించాలని ఆయన భావిస్తున్నారు. ఎవ్వరితోనూ పొత్తులు లేకుండా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా  బరిలోకి దిగుతోంది. వై నాట్ 175 నినాదంతో జగన్ మోహన్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు.

సిద్ధం సభలు నిర్వహిస్తూనే  విడతల వారీగా అభ్యర్ధుల జాబితాలు కూడా విడుదల చేస్తూ వచ్చారు జగన్ మోహన్ రెడ్డి. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తో పోలిస్తే  కొంచెం ఆలస్యంగా ఈ ప్రక్రియను మొదలు పెట్టాయి విపక్షాలు. వైసీపీకి పొత్తులు లేవు కాబట్టి  ఎవరితోనూ సంప్రదించాల్సిన అవసరం లేదు కాబట్టి  జగన్ మోహన్ రెడ్డి అనుకున్నది అనుకున్నట్లు  చేసుకుపోగలుగుతున్నారు. అదే టిడిపి విషయానికి వస్తే  జనసేనతో ముందుగా పొత్తు ఖరారు చేసుకున్న చంద్రబాబు బిజెపితో పొత్తు  కోసం చాలా రోజుల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. అందుకే సీట్ల సర్దుబాటు పైనా ఒక నిర్ణయానికి రావడానికి సమయం పట్టింది. ఆ విషయంలో క్లారిటీ రావడంతోనే   బిజెపి-జనసేనలకు ఇచ్చే సీట్ల పై క్లారిటీ వచ్చింది.

మొదట్లో జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలు మూడు లోక్ సభ స్థానాలు కేటాయించారు చంద్రబాబు. బిజెపి పొత్తుకు ఒప్పుకోవడంతో..ఈ లెక్క మారింది. బిజెపి-జనసేనలకు కలిపి 30 అసెంబ్లీ స్థానాలు 8 లోక్ సభ స్థానాలు కేటాయించారు చంద్రబాబు. అందులో బిజెపి ఆరు లోక్ సభ, ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. అంటే  పవన్ కు ఇస్తానన్న 24 అసెంబ్లీ స్థానాల్లో రెండు సీట్లు తగ్గాయి. అదే విధంగా పవన్ కు ముందుగా ఇచ్చిన మూడు లోక్ సభ స్థానాల్లో ఒక సీటు ఎగిరిపోయింది. 2014లో జట్టు కట్టిన కూటమి మళ్లీ  ఒక్కటి కావడంతో ఏపీలో మూడు పార్టీల శ్రేణుల్లోనూ హుషారొచ్చింది. మూడు పార్టీలూ  కలిస్తే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించడం ఖాయమని కూటమి నేతలు భావిస్తున్నారు. వైసీపీ నేతలకు సవాళ్లు కూడా విసురుతున్నారు.

అయితే  వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా ధీమాగా ఉంది. టిడిపి-జనసేన-బిజెపిల పొత్తును  ప్రజలు ఆమోదించరని వారు అంటున్నారు. వాళ్లది అవకాశవాద  పొత్తు అని  ప్రజలు అనుకుంటున్నారని వారంటున్నారు. 2014 తో పోలిస్తే 2019లో వైసీపీ ఓటు బ్యాంకు పెరిగిందని.. ఈ అయిదేళ్లలో ఆ ఓటు బ్యాంకు మరింతగా పెరిగిందని వైసీపీ నేతలు అంటున్నారు. జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు వివిధ సామాజిక వర్గాలకు  పదవులు కట్టబెట్టడంతో  అట్టడుగు వర్గాల ప్రజలు  తమ వైపే ఉన్నారని వైసీపీ లెక్కలు వేసుకుంటోంది. అందుకే 2019 కన్నా ఈ సారి సీట్లు పెరుగుతాయని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అది మితిమీరిన విశ్వాసమా ? అన్నది ఎన్నికల ఫలితాలు వస్తేనే తెలుస్తుందంటున్నారు పరిశీలకులు.

2019 ఎన్నికలకు ముందు బిజెపి పాచిపోయిన లడ్డూలు ఇచ్చిందని సెటైర్ వేశారు పవన్ కల్యాణ్.పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడికి ఏటీఎం గా మారిందని నరేంద్ర మోదీ ఆరోపించారు.నరేంద్ర మోదీ దేశాన్ని సర్వనాశనం చేసేశారని..సొంత భార్యను చూసుకోలేని మోదీ దేశాన్ని ఏం చూసుకుంటారని చంద్రబాబు నిప్పులు చెరిగారు.

చంద్రబాబు నాయుడు, లోకేష్ లను మించిన  అవినీతి పరులు దేశంలోనే ఎక్కడా లేరని పవన్ మండి పడ్డారు. ఇలా ఆ ఎన్నికల ప్రచారంలో  ఒకరినొకరు దారుణంగా తిట్టుకున్న ఈ మూడు పార్టీలూ ఇపుడు జట్టు కట్టడం విశేసం. రాజకీయాల్లో శాస్వత శత్రువులూ ఉండరు మిత్రులూ ఉండరని రాజకీయ పండితులు అంటున్నారు. అయితే ఆ కూటమిని జనం ఆశీర్వదిస్తారా లేదా అన్నది ఎన్నికల తర్వాతనే తెలుస్తుంది.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి