కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమతో పాటు ఉత్తర తమిళనాడును తుపాను భయం వెంటాడుతోంది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నెల్లూరు నుంచి తూర్పు గోదావరి జిల్లాల వరకు జనజీవనం అతలాకుతలమైంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి దక్షిణ బంగాళాఖాతంలో ప్రవేశించి తీవ్ర అల్పపీడనంగా బలపడనుంది. ఆ తర్వాత రెండ్రోజుల్లో తమిళనాడు, దక్షిణ కోస్తా దిశగా వస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే ఈ అల్పపీడనం బుధవారానికి తుపాన్‌గా మారుతుందని… 17వ తేదీకల్లా మరింత బలపడి చెన్నైకు దక్షిణం వైపున తీరం దాటుతుందని, అనంతరం వాయుగుండంగా బలహీనపడి అరేబియా సముద్రంలో ప్రవేశిస్తుందని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. అరేబియా సముద్రంలో ప్రవేశించాక బలపడి తీవ్ర తుపాన్‌గా మారే క్రమంలో ఈనెల 23న ఒమన్‌లో తీరం దాటుతుందని విశ్లేషించారు. దీనికితోడు దక్షిణ కోస్తాకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో బంగాళాఖాతం నుంచి భారీగా తేమగాలులు రావడంతో ఆదివారం రాత్రి నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల, కోస్తాలో మిగిలినచోట్ల వర్షాలు కురిశాయి.
సోమవారం సాయంత్రం వరకు కొడవలూరులో 110.25, ఇసకపల్లిలో 108.0, కావలిలో 104.25, బుచ్చిరెడ్డిపాలెంలో 97.25, దగదర్తిలో 92.75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తుపాను ప్రభావంతో బుధవారం నుంచి రెండు రోజుల పాటు దాదాపు వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది నెల్లూరు జిల్లాలో సముద్రంలో వేటకు వెళ్లిన 161 బోట్లను వెనక్కు రప్పించారు. నెల్లూరు జిల్లా కావలి, కొడవలూరులోని కొన్ని ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జిల్లాలో రెండు రోజులు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. కలెక్టరేట్ లో కాల్ సెంటర్ ఏర్పాటు చేసి సహాయ చర్యలు కొనసాగించారు. సోమశిల రిజర్వాయర్‌లో 52 టీఎంసీలకు నీరు చేరడంతో నిపుణుల బృందం అక్కడ పర్యటించనుంది.తిరుపతి జిల్లాలోని భాగమైన గూడూరు, సూళ్లూరిపేట, తిరుపతి అర్బన్, శ్రీకాళహస్తిలో కూడా ప్రత్యేక కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వాటిని సైక్లోన్ కంట్రోల్ రూములని పిలిస్తున్నారు.
బాపట్ల జిల్లా యద్దనపూడి వద్ద పర్చూరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షాలు కురిసే జిల్లాలకు చంద్రబాబు ప్రభుత్వం వరద సహాయ నిధులను విడుదల చేసింది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాలకు కోటి చొప్పున అత్యవసర నిధులు విడుదలైంది.భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో రిలీఫ్ క్యాంపులు, రక్షిత తాగునీరు, ఆహారం, హెల్త్ క్యాంపులు, శానిటేషన్ కోసం అత్యవసర నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు అందాయి. వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రహదారులు భవనాలు, మున్సిపల్, పంచాయితీరాజ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల సహకారంతో రహదారులపై పడిపోయిన చెట్లు, అడ్డంకులు తొలగించాల్సిందిగా సూచించారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…