ఒకప్పుడు తెలుగు వల్లభుడి మంత్రి వర్గంలో ఓ వెలుగు వెలిగారు. ఎర్ర బుగ్గ కారులో తిరుగుతూ దర్జాలు పోయారు. తెలుగుదేశం పార్టీలో అంతా తామే అయి చక్రాలు తిప్పారు. కాకపోతే కాల క్రమంలో రంగు వెలిసిపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీలోని ఈ సీనయర్లకు టికెట్లు ఇవ్వద్దని స్థానిక నేతలనుండి అధిష్ఠానంపై ఒత్తిడి పెరిగిపోతోంది. దీంతో సీనియర్ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తెలుగుదేశం పార్టీలో చాలా మంది సీనియర్లకు గడ్డుకాలం నడుస్తోంది. ఒకప్పుడు మంత్రి పదవులతో రాజభోగాలు అనుభవించిన సీనియర్ నేతలను పార్టీ నాయకత్వం పక్కన పెట్టేయడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్లలో ఎవ్వరికీ కూడా టికెట్ ఇవ్వరాదని ఆయా నియోజకవర్గాల్లో స్థానిక తమ్ముళ్లు పట్టుబడుతున్నారట. ఇప్పటికే పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి దృష్టికీ తమ మనసులో మాట విన్నవించుకున్నారట కూడా. తమ మాట కాదు కూడదని సీనియర్లకే టికెట్లు ఇస్తే తామే పనిగట్టుకుని వారిని ఓడిస్తామని కూడా వారు పార్టీ అధిష్ఠానానికి అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది.
ఒకప్పటి తన మంత్రి వర్గ సహచరులపై ఇంతటి వ్యతిరేకతను ఊహించని చంద్రబాబు నాయుడు కూడా స్థానిక నేతల ఆగ్రహాన్ని చూసి షాక్ తిన్నారట. ఇదే సమయంలో ఈ సీనియర్ల నియోజకవర్గాల్లో పాగా వేయడానికి కొత్త తరం నేతలు నారా లోకేష్ కోటాలో ప్రయత్నాలు మొదలు పెట్టేశారని అంటున్నారు. తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోన్న మాజీ మంత్రుల్లో అందరికన్నా ముఖ్యుడు విశాఖజిల్లా నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడే. తెలుగుదేశంపార్టీలో చంద్రబాబు కన్నా సీనియర్ అయ్యన్న పాత్రుడు. ఎన్టీయార్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన వెంటనే ఎన్టీయార్ పిలుపు మేరకు రాజకీయాల్లో అడుగు పెట్టిన వారిలో అయ్యన్న పాత్రుడు ఒకరు. ఎన్టీయార్ మంత్రి వర్గంలోనూ కీలక పదవులు అనుభవించిన అయ్యన్న పాత్రుడు చంద్రబాబు నాయుడి మంత్రి వర్గంలోనూ కీలక మంత్రి పదవులు అనుభవించారు. గత ఎన్నికల్లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ప్రభంజనంలో కొట్టుకుపోయిన అయ్యన్న పాత్రుడు అమాంతం మాజీ ఎమ్మెల్యే గా మిగిలారు. నాలుగేళ్లుగా మాజీగా ఉంటూనే పలు వివాదాల్లో కేంద్రబిందువుగా ఉన్నారు.
ప్రభుత్వ స్థలం కబ్జా కేసుతో పాటు ఫోర్జరీ ఆరోపణలపైనా ఆయనపై కేసులు ఉన్నాయి. ఆయన నోటి దురుసు తనంతో టిడిపి ప్రతిష్ఠ దారుణంగా దెబ్బతిందని స్థానిక టిడిప నేతలు భావిస్తున్నారు. అయ్యన్న పాత్రుడు నోటికొచ్చింది మాట్లాడుతూ పోతే పార్టీని చూసి జనం బూతులు తిట్టే పరిస్థితి వస్తుందని నర్సీపట్నం నేతలు హెచ్చరించడంతో చంద్రబాబు నాయుడే అయ్యన్నకు క్లాస్ తీసుకున్నారట. అప్పట్నుంచీ మౌనంగా ఉంటోన్న అయ్యన్న పాత్రుడికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వద్దని స్థానిక నేతలు పట్టుబడుతున్నారు. అయ్యన్న పాత్రుడికి ఇస్తే పార్టీ గెలవదని తాము కూడా అతన్ని ఓడించడానికే చూస్తామని వారు అల్టిమేటం జారీచేయడంతో చంద్రబాబు ఆలోచనలో పడ్డారట. ఓపిగ్గా ఉండండి సమయం వచ్చినపుడు చూద్దాం అని చంద్రబాబు వారిని వారించారని సమాచారం. ఇక ఇదే జిల్లా పరవాడకు చెందిన బండారు సత్యనారాయణ పైనా స్థానికంగా వ్యతిరేకత పెల్లుబుకుతోందట. ఆయనకు టికెట్ ఇవ్వద్దని ఆయన అనుచరులే అధినాయకత్వానికి ఆకాశరామన్నలేఖ రాశారట. దాంతో ఆయన స్థానంలో ఎవరిని నియమించాలా అని నాయకత్వం వెతుకులాట మొదలు పెట్టేసిందట కూడా.
ఉత్తరాంధ్రకే చెందిన పార్టీ మాజీ అధ్యక్షుడు కళా వెంకటరావు వైఖరిపైనా నిరసనలు వ్యక్తం అవుతున్నాయంటున్నారు. ఆయనకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వద్దని బాహాటంగానే చెబుతున్నారట తమ్ముళ్లు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పట్టించుకోని కళా వెంకటరావును పక్కన పెట్టేయాలన్న డిమాండ్ ఊపందుకుంటోందంటున్నారు. అలాగే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పైనా వ్యతిరేకత ఉంది. గత ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందిన తర్వాత నుంచి కొద్ది రోజుల క్రితం వరకు కూడా గంటా శ్రీనివాసరావు టిడిపిలో ఎలాంటి కార్యక్రమాల్లోనూ పాల్గొనలేదు. సాక్షాత్తూ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చినా కూడా గంటా తన ఇంటికే పరిమితమై బాబు కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేశారు. అంతే కాదు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆయన విశ్వ ప్రయత్నాలు చేశారని సమాచారం. ఇటీవల జనసేన టిడిపి మధ్య పొత్తు ఉండచ్చన్న వార్తలు వచ్చిన తర్వాతనే గంటా బయటకు వచ్చి తాను టిడిపిలోనే కొనసాగుతానని ఏ పార్టీలోకి మారడం లేదని చెప్పుకొచ్చారని పార్టీ వర్గాలే అంటున్నాయి. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవులు అనుభవించిన గంటా పార్టీ కష్టాల్లో ఉంటే ఇంట్లో ఏసీ గదికే పరిమితం అయ్యారని వారు మండిపడుతున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో గంటాకు టికెట్ ఇవ్వద్దన్న డిమాండ్ పెరుగుతోంది. అయితే నాయకత్వం మాత్రం ఆచి తూచి అడుగులు వేస్తోంది.
మాజీ స్పీకర్ ప్రతిభా భారతి విషయంలోనూ వ్యతిరేకత ఉంది. ముందు చూపుతో ఆమె తన కుమార్తెను రాజకీయ తెరపైకి తెచ్చారు. గత మహానాడులో చంద్రబాబు దృష్టిని ఆకర్షించేందుకు ప్రతిభా భారతి కూతురు గ్రీష్మ చాలా హల్ చల్ చేశారు. అయితే ఆ కుటుంబంలో ఎవ్వరికీ టికెట్ ఇవ్వద్దని పార్టీ కోసం మొదట్నుంచీ కష్టపడ్డ వారికే టికెట్ ఇవ్వాలని స్థానికులు అడుగుతున్నారు. కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి దేవినేని ఉమా సీటు కిందకూ ఎసరొచ్చేసింది. దేవినేనికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వద్దని చంద్రబాబు నాయుడికే నేరుగా విన్నవించుకున్నారు స్థానిక నేతలు. దేవినేని నియోజకవర్గంలో నారా లోకేష్ తనకు నమ్మకస్తులైన మరొకరిని ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం. దేవినేనికి టికెట్ ఇస్తే వచ్చే ఎన్నికల్లో కూడా ఓటమి తప్పదని వారు ప్రచారం చేస్తున్నారు. దేవినేని విషయంలో చంద్రబాబు కూడా అసంతృప్తితోనే ఉన్నారని అంటున్నారు.
మరో మాజీ మంత్రి పత్తి పాటి పుల్లారావు అయితే గత ఎన్నికల్లో ఓటమి తర్వాత మూటా ముల్లె సద్దుకుని హైదరాబాద్ తరలిపోయారు. అక్కడే ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారు. తన నియోజకవర్గాన్ని పూర్తిగా మర్చిపోయారు. ఆరు నెలలకో ఏడాదికో మొక్కుబడిగా రావడం కొద్ది గంటలు ఉండి తిరిగి హైదరాబాద్ చెక్కేయడం చేస్తున్నారు. పత్తి పాటి పుల్లారావు ఇక తమకి అవసరం లేదని ఆయన కావాలనుకుంటే హైదరాబాద్ లోనే పోటీ చేసుకోవచ్చునని తెలుగు తమ్ముళ్లు సెటైర్లు వేస్తున్నారు. పత్తిపాటికి గతంలోనే చంద్రబాబు నాయుడు నియోజకవర్గాన్ని పట్టించుకోవలసిందిగా చెప్పినా పత్తిపాటి పుల్లారావు దాన్ని ఖాతరు చేయలేదు. ఇపుడు ఎన్నికల ఏడాది రావడంతో తన సీటుకు ఎసరు పెట్టేస్తున్నారని తేలడంతో పత్తి పాటి ఆందోళన చెందుతున్నారట. ఇక్కడ నందమూరి బాలయ్య వద్ద పిఏగా పనిచేసిన వ్యక్తికి టికెట్ ఇస్తే బాగుంటుందన్న ఆలోచన చేస్తున్నారట.
లేదంటే నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసినికి ఇచ్చినా ఇవ్వచ్చని అంటున్నారు. 2018 లో తెలంగాణా ఎన్నికల్లో కూకట్ పల్లి నుండి పోటీ చేసి ఓడిన సుహాసిని ఏపీ నుండి పోటీ చేయాలని తహ తహ లాడుతున్నారు. ఆమెకు బాలయ్య మద్దతు కూడా ఉంటుందంటున్నారు. అదే జరిగితే పత్తిపాటి టికెట్ కూడా హుళక్కే అంటున్నారు. మాజీమంత్రి యనమల రామకృష్ణుడు ఎన్నికల బరిలో దిగడం మానేసి చాలా ఏళ్లయ్యింది. పోటీ చేసి గెలిచే పరిస్థితి లేదని తెలుసుకున్న యనమల వచ్చే ఎన్నికల్లో తుని నియోజకవర్గం టికెట్ ను తన కూతురు దివ్యకు ఖరారు చేయించుకున్నారు. nఇక తూర్పు గోదావరి జిల్లాలో మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పకూ పరిస్థితులు బాగా లేవు. రాజప్పకు టికెట్ ఇవ్వదన్న డిమాండ్ రోజు రోజుకీ ఊపందుకుంటోంది. ఆయన స్థానంలో ఎన్నారైకి ఇస్తారని అంటున్నారు. అదే విధంగా గుడివాడ నియోజకవర్గంలోనూ సీనియర్ నేత రావిని పక్కన పెట్టి లోకేష్ కు సన్నిహితుడైన ఎన్నారైకి టికెట్ ఇస్తారని అంటున్నారు. మొత్తానికి చాలా మంది సీనియర్లు మాజీ మంత్రులు వచ్చే ఎన్నికల్లో టికెట్ లేకుండా ఇంట్లో కూర్చోక తప్పదని అంటున్నారు.