తిరుపతి లడ్డులో రోజాకు వాటాలు

By KTV Telugu On 1 October, 2024
image

KTV TELUGU :-

తిరుపతి లడ్డూ వివాదం నానాటికీ తీవ్రమవుతోంది. కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారం కావడంతో గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి ఒక్కరూ రియాక్ట్ అవుతున్నారు. ప్రధానంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. స్వామి వారికి అపచారం జరిగిందని, దీనికి ప్రాయశ్చిత్తం జరగాల్సిందేనని పవన్ అంటున్నారు. దీనిలో భాగంగా 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షకు దిగారు జనసేనాని. దీనిపై వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు .

లడ్డూ వివాదం తెరపైకి వచ్చిన వెంటనే బాధ్యులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ధార్మిక పద్ధతులు, ఇతర సమస్యలను పరిష్కరించేందుకు జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డుని ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి కోరారు. ఆ వెంటనే అపచారానికి ప్రాయశ్చిత్తంగా పవన్ 11 రోజుల దీక్షను ప్రారంభించారు. 11 రోజుల దీక్ష అనంతరం అక్టోబర్ 1న తిరుపతి నుంచి అలిపిరి మెట్ల మార్గంలో తిరుమలకు కాలినడకన వెళ్లనున్నారు. 2న ఉదయం శ్రీవారిని దర్శించుకుని ఆ వెంటనే దీక్ష విరమించనున్నారు.

ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. మెట్లను స్వయంగా కడిగిన పవన్.. పసుపు రాసి కుంకుమ బోట్లు పెట్టారు. మరోవైపు.. పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్ధతు పెరుగుతోంది. ఆయన దీక్షకు మద్ధతుగా సెప్టెంబర్ 24న గుంటూరు నగరంలోని గోరంట్లలో ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో 111 మంది జనసేన నేతలు దీక్ష చేపడతారని ఆ పార్టీ నేతలు తెలిపారు.

అయితే పవన్ కళ్యాణ్ దీక్షపై వైసీపీ నేత , మాజీ మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు 100 రోజుల పాలనలో జరిగిన దారుణాలు, వైసీపీ నేతలపై దాడులు వంటి వాటి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే వెంకటేశ్వర స్వామిని రాజకీయం చేస్తున్నారని రోజా ఆరోపించారు. తప్పు చేసినవాళ్లే ప్రాయశ్చిత్త దీక్ష చేశారని.. చంద్రబాబు తప్పులు తనకు ఎక్కడ చుట్టుకుంటుందోనని పవన్ దీక్ష చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏం చేసినా పవన్‌ను దేవుడు క్షమించడని.. ఆయన చేస్తున్న 11 రోజుల దీక్ష పవన్‌కే పనికొస్తుందని రోజా దుయ్యబట్టారు.

రోజా చేసిన వ్యాఖ్యలకు జబర్దస్త్ నటుడు కిరాక్ ఆర్పీ ఘాటుగా కౌంటరిచ్చారు. రోజా ప్రతిసారి తిరుమలకు ఎందుకు వెళ్లింది.. దేవుడి విషయంలో వైసీపీ నేతలు చేసింది క్షమించరాని తప్పని ఆర్పీ మండిపడ్డారు. తిరుమలలో వైసీపీ నేతలు చేయని దారుణాలు లేవని.. కానీ వాటన్నింటికీ మించి జంతువుల కొవ్వు తీసుకొచ్చి దేవుడికి నైవేద్యంగా పెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తప్పు చేసిన వైసీపీ పశువుల కొవ్వుని భగవంతుడు తీయబోతున్నాడని ఆర్పీ హెచ్చరించారు. డబ్బు కోసం రోజా అమ్ముడుపోయిందని.. జగన్ పంపించిన పేపర్‌లో ఏది ఉంటే అది వాగేసిన రోజా చెప్పుతో కొట్టుకోవాలని మండిపడ్డారు. లడ్డూ ప్రసాదంలో రోజాకు 15 శాతం వాటాలున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. నాతో డిబేట్‌కు రావాలని రోజాకు ఆర్పీ సవాల్ విసిరారు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి