అన్నదాతలను మరోసారి భయపెడుతున్న తుఫాన్

By KTV Telugu On 28 November, 2024
image

KTV TELUGU :-

తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరాలను మరో తుఫాను భయపెడుతోంది. భారీ వర్షాలతో ముంచెత్తేందుకు సిద్ధమవుతోంది. పంటలు వేసుకున్న రైతులు, లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఈ తుఫానుకు భయపడుతున్నారు. ఈ వారం ఎలా గడుస్తుందోనని ఆందోళన చెందుతున్నారు..

నైరుతి బంగాళాఖాతం ఏర్పడిన వాయుగుండం ఇప్పుడు తీవ్ర వాయుగుండంగా బలపడింది. ఇది ప్రస్తుతం నాగపట్నానికి 520, చెన్నైకి 730 కిలోమీటర్ల దక్షిణ ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర వాయవ్యంగా పయనించి తుఫాన్‌గా బలపడనుంది. ఈ తుఫానుకు సౌదీ అరేబియా సూచించిన ‘ఫెంగల్‌’ అని పేరు పెట్టనున్నారు. ఇది ఈనెల 29 రాత్రి లేదా 30 తెల్లవారుజామున చెన్నై సమీపంలో తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలు, 28న నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి బాపట్ల, ప్రకాశం, సత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం తెలిపింది. ఈనెల 29 నుంచి వచ్చే నెల 1 వరకు కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది.

ఉమ్మడి నెల్లూరు నుంచి ఉమ్మడి కృష్ణా వరకు రానున్న నాలుగు రోజుల పాటు కోస్తా తీరం వెంబడి భారీ వర్షాలు కురుస్తాయి. ఆయా జిల్లాల్లో లక్షల ఎకరాలు వరి సాగు చేశారు. రబీ పనులు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలోనే తుపాను రావడం అందరినీ కలవరపెడుతోంది. పలు మండలాల్లో వరికోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. వరికోతలను వాయిదా వేయాలని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నా అన్నదాతలు పట్టించుకోవడం లేదు. వర్షం కురిస్తే పైరు నేలవాలిపోతుందని అప్పుడు భారీగా నష్టపోతామని రైతులు భయపడుతున్నారు. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తే పంటకు ఇబ్బందేనని రైతులు భయపడుతున్నారు.

నవంబర్ 29వ తేదీ వరకు ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లోని మత్స్యకారులు.. సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు తుఫాన్ ఫెంగల్ ప్రభావం తెలంగాణపై ఉండదని.. అక్కడక్కడ.. కొన్ని చోట్ల మోస్తరు వానలు పడే సూచనలు మాత్రమే ఉన్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి