ఆచంట బరిలో ఉత్కంఠ పోరు !

By KTV Telugu On 29 January, 2024
image

KTV TELUGU :-

గోదావరి జిల్లాల్లో ప్రతీ నియోజకవర్గం ప్రత్యేకంగా కనిపిస్తూనే ఉంటుంది. ప్రతి నియోజకవర్గంలో తమదైన ముద్ర వేసిన నేతలు ఉన్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో సైలెంట్ గా ఉంటూ  తన ప్రభావాన్ని గోదావరి జిల్లా మొత్తం చూపే నేతల్లో ఒకరు పితాని సత్యనారాయణ. ఇప్పుడు ఆచంట నుంచి మరోసారి పోటీ చేసి పూర్వ వైభవం పొందాలనుకుంటున్నారు. వైసీపీ తరపున మాజీ మంత్రి రంగనాథరాజు గత ఎన్నికల్లో అనూహ్యంగా  గెలిచారు. మరోసారి అలా గెలిచేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. మరి వీరిద్దరిలో ఎవరు ముందంజలో ఉన్నారు?  జనసేన పాత్ర ఎలా ఉండబోతోంది ?

తూర్పుగోదావరి జిల్లాలోని ఆచంట నియోజకవర్గం  పూర్తిగా వ్యవసాయాధారిత ప్రాంతం. పైగా అక్కడ పండించేది పూర్తిగా వరే.  ఆంధ్రప్రదేశ్‌ ధాన్యాగారం అని పిలుచుకునే ఈ నియోజకవర్గం పోరాటాల కోట. ఒకప్పుడు ఇది కమ్యూనిస్టుల కంచుకోట. అందుకే ఉద్యమాలకు పుట్టినిల్లుగా చెబుతుంటారు. ఏ ప్రజాపోరాటం జరిగినా ఇక్కడి వాసులు ముందుంటారు. పాలకొల్లు నియోజకవర్గం నుంచి విడిపడి 1962లో ఆచంట నియోజకవర్గం ఏర్పడింది. 2004 వరకూ ఇది ఎస్సీ రిజర్వుడుగా ఉన్న నియోజకవర్గం.. పునర్విభజనలో 2009లో జనరల్‌ నియోజకవర్గంగా మారింది. ఈ నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో చెరుకువాడ శ్రీరంగనాథ రాజు ప్రత్యర్థి పితాని సత్యనారాయణపై 12 వేలకు పైగా ఓట్ల మెఎజారిటీతో గెలుపొందారు. అయితే ప్రస్తుతం  రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి.

గత ఎన్నికల్లో వైసీపీకి 48 శాతం ఓట్లు వస్తే .. టీడీపీ 37 శాతం దగ్గర ఆగిపోయింది. జనసేనకు పది శాతం ఓట్లు వచ్చాయి. అంటే రెండు పార్టీలు కలిసినా వైసీపీకి ఒక శాతం ఎక్కువే ఉన్నాయన్నమాట. ఐదేళ్లలో శ్రీరంగనాథరాజు కొంత కాలం మంత్రిగా చేశారు.  కానీ ఆయన వ్యవహారశైలి మాత్రం భిన్నంగా ఉంటుంది.   2019 ఎన్నికల హామీలను పూర్తిగా నేరవేర్చకపోవడం వల్ల ఆయనపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. ప్రజలతో ఆయన తాను రాజు మీరంతా సేవకలు అన్నట్లు వ్యవహరిస్తూంటారు. పైగా పార్టీలో గ్రూపులు, గొడవలు ఉన్నాయి.  అదే సమయంలో కీలకమైన హామీగా మిగిలిపోియన లంక గ్రామాలను కనెక్ట్ చేసే ఫ్లైఓవర్ పనులను ఒక్క శాతం కూడా ముందుకు తీసుకెళ్లలేకపోయారు.

టీడీపీ తరపున రేసులో ఉన్న పితాని సత్యనారాయణ  బీసీ వర్గం నేత. ఆయనకు నియోజకవర్గంలో పట్టు ఉంది. కులాలకు అతీతంగా ఆయనకు మద్దతు ఉంటుంది. వైఎస్ హయాంలో మంత్రిగా చేసిన ఆయన ఆ తర్వాత వైసీపీలోకి వెళ్లకుండా టీడీపీలోకి వచ్చారు. టీడీపీ హయాంలోనూ ఓ సారి గెలిచి మంత్రి అయ్యారు. అధికారంతో సంబంధం లేకుండా ప్రజలతో ఆయన ఎప్పుడూ ఒకే విధంగా ఉంటారు.  ఆయనపై.. ఆయన కుమారుడిపై కేసుల భయంతో బెదిరింపులకు పాల్పడినా పార్టీ మారలేదు. గత ఎన్నికల్లో ఓడినా యాక్టివ్‌గా ఉంటూ..  ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ రాజకీయాలు చేస్తున్నారు. నియోజకవర్గంలో ఎక్కువ జనాభా ఉన్న శెట్టి బలిజ సామాజిక వర్గ వ్యక్తి కావడంతో ఆయనకు అడ్వాంటేజ్ కనిపిస్తోంది. శెట్టిబలిజ వర్గానికి ఈ నియోజకవర్గంలో 29 శాతం ఓట్లు ఉంటాయి.

జనసేన పార్టీకి పది  శాతం వరకూ ఓట్లు ఉన్నాయి. ఇక్కడ ఆ పార్టీకి లీడర్ ఎవరంటే.. చేగొండి హరిరామజోగయ్య కుమారుడు. పేరుకు లీడరే కానీ ఎప్పుడూ బయటకు వచ్చి కార్యక్రమాలు చేపట్టింది లేదు. అందుకే ఈ స్థానం టీడీపీకే కేటాయిస్తారు. ప్రభుత్వ వ్యతిరేకత, ఎమ్మెల్యేపై వ్యతిరేకత కలిసి.. మొత్తంగా వైసీపీకి మైనస్ గా మారే సూచనలు కనిపిస్తున్నాయి.  రాజకీయ సమీకరణాలు, జనసేనతో పొత్తు కారణంగా గతంలో కంటే పరిస్థితులు మారే అవకాశం ఉందన్న అభఇప్రాయం వినిపిస్తోంది. శెట్టిబలిజ సామాజికవర్గంలో టీడీపీ , జనసేన పార్టీకి ఏఅకపక్షంగా మద్దతు లభిస్తోంది. జనసేన మద్దతు వల్ల కాపు ఓటర్లలోనూ కూటమికే అత్యధికంగా మద్దతు పలకనున్నారు. దళితులు, రెడ్డి ఓటర్లలో వైసీపీకి మద్దతు ఉంది.  ఈ సారి క్షత్రియ ఓటర్లలో స్పష్టమైన  చీలిక కనిపిస్తోంది. రంగనాథ రాజు బరిలోకి దిగినా ఆయనకు పూర్తి స్థాయిలో మద్దతుగా ఉండటం కష్టమని భావిస్తున్నారు. దానికి సీఎం జగన్ అనుసరించిన విధానాలే కారణం.

ఎలా చూసినా  ఆచంటలో టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే రెండు పార్టీలు సమన్వయంతో వ్యవహరించాల్సి ఉంది. హరిరామజోగయ్య వ్యవహారం కాస్త భిన్నంగా ఉంటుంది.  రెండు పార్టీలు సమన్వయంతో వ్యవహరించి ఓట్ల బదిలీకి ప్రయత్నాలు చేసుకోకపోతే.. మొదటికే మోసం వస్తుంది…

 

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి