ముగ్గురు మాజీ మంత్రులకు కష్టకాలం

By KTV Telugu On 2 September, 2023
image

KTV TELUGU :-

కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు. ఒక్కో సారి ఓడలు బళ్లు అవుతాయి. మరో సారి బళ్లే ఓడలు అవుతాయి. ఒకప్పుడు రాజ్యాలనేలిన వారు బంట్లు గా మారిపోవచ్చు. కాలం ఎదురు తిరిగితే ఏదీ అనుకున్నట్లు జరక్కపోవచ్చు. ఉత్తరాంధ్రలో  గత ప్రభుత్వంలో ఓ చక్రం తిప్పిన  ముగ్గురు సీనియర్ మంత్రులు ఇపుడు భవిష్యత్తు ఏంటా అని గందరగోళంలో ఉన్నారు. సొంత పార్టీలో తమకి వచ్చే ఎన్నికల్లో టికెట్లు దొరకడమే కష్టమన్న సంకేతాలు అందడంతో ఏం చేయాలో పాలు పోవడం లేదు. పులిమీద పుట్రలో జనసేనతో టిడిపి పొత్తు పెట్టుకుంటే జనసేన అడిగే స్థానాలు కూడా ఈ మంత్రుల నియోజక వర్గాలే కావడంతో వారు వణికిపోతున్నారు. అధినేతకు ఏం చెప్పుకోవాలో అర్ధం కావడం లేదు. పార్టీ మారదామంటే   వీరిని తీసుకోడానికి  పాలక పక్షం సిద్ధంగా ఉందో లేదో తెలీని పరిస్థితి.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి  ఉన్న అతి కొద్ది మంది నేతల్లో ఒకరైన చింతకాయల అయ్యన్న పాత్రుడు నర్సీపట్నం నియోజక వర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఎన్టీయార్ హయాం నుంచే మంత్రి పదవులు చేపట్టిన అయ్యన్న పాత్రుడు చంద్రబాబు కేబినెట్ లోనూ ఓ వెలుగు వెలిగారు.
మరో మంత్రి బండారు సత్యనారాయణ. చంద్రబాబు నాయుడి కేబినెట్ లో కీలక పదవులు అనుభవించిన  బండారు చంద్రబాబుకు సన్నిహితుడిగా పేరుంది. ఇక  మరో సీనియర్ మంత్రి గంటా శ్రీనివాస్. చంద్రబాబు నాయుడి కేబినెట్ లో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన గంటా శ్రీనివాసరావు వచ్చే ఎన్నికల్లో విశాఖ జిల్లా నుంచే బరిలో దిగాలనుకుంటున్నారు. అయితే ఈ ముగ్గురు మాజీ మంత్రులకూ ఇపుడు పరిస్థితి బాగా లేదంటున్నారు రాజకీయ పండితులు. వీరి వీరి నియోజక వర్గాల్లో వేరే వారికి టికెట్లు ఇవ్వాలని చంద్రబాబు డిసైడ్ అయిపోయారని ప్రచారం జరుగుతోంది.

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉత్తరాంధ్రలో గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ మూర్తి, అయ్యన్నపాత్రుడు చక్రం తిప్పారు. తమ అనుచరులకు ఎమ్మెల్యేలుగా సీట్లు ఇప్పించుకున్న చరిత్ర వారిది. కాని ఇప్పుడు అటువంటి నేతలు తమ రాజకీయ భవిష్యత్ ఏమిటో తెలియక గందరగోళానికి గురవుతున్నారు. గత ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు విశాఖ నార్త్ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. పోటీ చేసి గెలిచిన తరువాత పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చిన కార్యక్రమాల్లోనూ పాల్గొనలేదు. చివరకు చంద్రబాబు నాయుడు  ఉత్తరాంధ్ర పర్యటనకు వస్తే  గంటా తన ఇంటికే పరిమితం అయ్యారు.

ప్రతీ ఎన్నికలోనూ నియంజక వర్గాన్ని మార్చడం గంటాకు ఆనవాయితీ. గత ఎన్నికల్లో విశాఖ నార్త్ నుండి గెలిచిన గంటా  వచ్చే ఎన్నికల్లో  కొత్త నియోజక వర్గానికి మారాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు. గతంలో ఓసారి తాను గెలిచిన భీమిలి నియోజక వర్గం నుండి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు.అయితే తెలుగుదేశం-టిడిపి పొత్తు ఖరారైతే భీమిలి నియోజక వర్గాన్ని జనసేన పట్టుబట్టి తీసుకోవడం ఖాయం అంటున్నారు. ఎందుకంటే జిల్లాలో ప్రజారాజ్యం  గెలిచిన నియోజక వర్గాల్లో భీమిలో ఒకటి అయితే  రెండోది పెందుర్తి.

ఇప్పుడు సీటు కోసం గంటా పక్క జిల్లాల వైపు చూస్తున్నారు. విజయనగరం జిల్లా  నెల్లిమర్ల లేదా అనకాపల్లి జిల్లాలో చోడవరం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. మరొక మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిది కూడా అదే పరిస్థితి. గతంలో పెందుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బండారు ఈసారి నియోజకవర్గం వెతుక్కునే పరిస్థితి ఏర్పడింది. పెందుర్తి నియోజకవర్గం కోసం కూడా జనసేన గట్టిగా ప్రయత్నిస్తోంది. పెందుర్తి నుండి జనసేన పోటీ చేస్తే బండారు మరోసీటు వెతుక్కోవాల్సిందే. అందుకే బండారు అనకాపల్లి లోక్ సభ నియోజక వర్గం  లేదా మాడుగుల  అసెంబ్లీ నియోజకవర్గాలకు  వలస వెళ్తారనే ప్రచారం జరుగుతోంది.మరో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పరిస్థితి ఇంతకంటే దారుణంగా ఉంది. అయ్యన్నపాత్రుడు ఈసారి ఎలాగైనా తన కుమారుడు విజయ్‌తో రాజకీయ అరంగేట్రం చేయించాలనే పట్టుదలతో ఉన్నారు.

తన కుమారుడిని అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీలోకి   దించాలని అయ్యన్న పాత్రుడు  భావిస్తున్నారు. టిడిపి అధిష్టానం మాత్రం అనకాపల్లి ఎంపీ స్థానాన్ని అయ్యన్న కుమారుడికి ఇచ్చే అవకాశం లేదని… అయ్యన్న కుటుంబంలో ఒక్కరికే సీటు అని తేల్చేసింది. అదే సమయంలో నర్సీపట్నం ఎమ్మెల్యేగా పోటీ చేస్తే తన పరిస్థితి ఏమవుతుందో అయ్యన్నకే అర్థం కావడం లేదట.  ఎందుకంటే నర్సీపట్నంలో  అయ్యన్నకు టికెట్ ఇవ్వద్దని మరో ఇద్దరు నేతలు పట్టుబడుతున్నారు. ఒక వేళ అయ్యన్నకు టికెట్ ఇస్తే వారు సహకరించేది అనుమానమే అంటున్నారు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి