ఏపీలలో చీరాల నియోజకవర్గం ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉంటుంది. దిగ్గజ నేత రోశయ్య రాజకీయ కేంద్రం చీరాలే. ఆ తర్వాత ఆయన శిష్యుడు ఆమంచి రాజ్యమేలుతూ వచ్చారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. అంతా గందరగోళంగా మారింది. దానికి కారణంగా టీడీపీ నుంచి గెలిచిన కరణం వైసీపీలోకి వెళ్లడం. అక్కడ వైసీపీ తరపున పోటీ చేసిన ఆమంచి కృష్ణమోహన్ కు సీటు లేకుండా చేయడం. చీరాలను వదిలే ప్రశ్నే లేదంటున్న ఆమంచి తీసుకునే నిర్ణయమే ఇప్పుడు కరణం కుటుంబం రాజకీయాల్లో కొనసాగాలా.. రిటైరవ్వాలా అన్నది డిసైడ్ చేయనుంది.
ఏపీలోని కీలక నియోజకవర్గాల్లో చీరాల ఒకటి. ఇక్కడి టెక్స్ టైల్ ఇండస్ట్రీ కారణంగా దీన్ని మినీ ముంబైగా పిలుచుకుంటారు. ఉమ్మడి ఏపీకి సీఎంగా పని చేసిన కొణిజేటి రోశయ్య కూడా ఇదే సెగ్మెంట్‌కు చెందిన వారు. 1989, 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. తర్వాత ఆయన శిష్యుడు ఆమంచి కృష్ణమోహన్ రెండు సార్లు ు గెలిచారు. ఈ నియోజకవర్గంలో కాపుల ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది. దేవాంగ కమ్యూనిటీకి చెందిన జనాభా 19 శాతం ఉంటే.. 15 శాతం జనాభా పద్మశాలి వర్గానికి చెందిన వారు ఉన్నారు. ఇక్కడ రాజకీయంగా ఆమంచి బ్రదర్స్ వర్సెస్ కరణం బలరాం వర్గాల మధ్య వర్గపోరు నడుస్తుంటుంది. ఆమంచి కృష్ణమోహన్‌ను పక్కనే ఉన్న పరుచూరు నియోజకవర్గంలో పోటీ చేయాలని పంపించారు జగన్. అయితే కృష్ణమోహన్ మాత్రం విముఖంగా ఉన్నారు. అటు ఆమంచి సోదరుడు ఇటీవలే జనసేనలో చేరడంతో రాజకీయం రసవత్తరంగా మారిపోయింది.
2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన కరణం బలరాం చీరాలలో గెలిచారు. 53 శాతం ఓట్ షేర్ సాధించారు. అదే సమయంలో వైసీపీ నుంచి పోటీ చేసిన ఆమంచి కృష్ణమోహన్ 42 శాతం ఓట్లు సాధించారు. ఇతరులకు 5 శాతం ఓట్లు వచ్చాయి. నిజానికి ఆమంచి టీడీపీ తరపునే పోటీ చేయాల్సింది. కానీ చివరి క్షణంలో వైసీపీలో చేరిపోయారు. దాంతో టీడీపీలో టిక్కెట్ లేదనుకున్న కరణంకు చీరాల టిక్కెట్ దొరికింది. నియోజకవర్గం అనుకున్నంతగా అభివృద్ధి చెందకపోవడం, వరుసగా రెండుసార్లు గెలవడంతో మొదలైన సహజ వ్యతిరేకత గత పోల్స్‌లో స్పష్టంగా కనిపించింది. కరణం బలరాం ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఆయన వయసు రీత్యా .. కుమారుడు కరణం వెంకటేషే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని డిసైడయ్యారు.
తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గా కొండయ్య అనే నేతను చంద్రబాబు నియమించారు. చీరాలలో టీడీపీకి నాయకత్వ కొరత ఉంది. పద్మశాలీ వర్గానికి పోతుల సునీతను చంద్రబాబు చీరాలలో ప్రోత్సహించారు. కానీ ఆమె ఓ సారి ఓడిపోయినా ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా వైసీపీలో చేరిపోయారు. కరణం కూడా వైసీపీలో చేరిపోయారు. ఆమంచి కూడా టీడీపీ నుంచే వైసీపీకి వెళ్లిపోయారు. దీంతో పోటీ చేయదగ్గ నేతలంతా వైసీపీలో ఉండిపోయారు. చివరికి కొండయ్య అనే నేతను ఇంచార్జ్ గా చేశారు చంద్రబాబు. విద్యా సంస్థల అధినేత అయిన ఆయన.. నియోజకవర్గంలో చురుకుగా పని చేసుకుంటున్నారు. కానీ చివరికి ఆయనకు టిక్కెట్ ఖారారు చేస్తారా లేదా అన్నది స్పష్టత లేదు.
వైసీపీ పరిస్థితి గందరగోళంగా ఉంది. కరణం వెంకటేష్ కు టిక్కెట్ కన్ఫర్మ్ కాలేదు. రకరకాల నియోజకవర్గాల పేర్లు వినిపిస్తున్నాయి. చివరికి వారిని అద్దంకికి పంపినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది. వారిని అక్కడి నుంచి తప్పిస్తే… ఆమంచికి చీరాల టిక్కెట్ లభిస్తుంది. ఒక వేళ రాకపోయినా ఆమంచి తగ్గడం లేదు. తాను స్వతంత్ర అభ్యర్థిగా అయినా బరిలో ఉంటానంటున్నారు. ఆయన పోటీ చేయాలనుకుంటే.. టీడీపీ, జనసేన టిక్కెట్లు ఇవ్వడానికి రెడీగా ఉంటాయి. ఎందుకంటే చీరాలలో ఆమంచికి ఉన్న పట్టు అలాంటిది. ఇండిపెండెంట్ గా కూడా గెలిచిన రికార్డు ఉంది. ఒక వేళ కరణం వెంకటేషే చీరాల నుంచి పోటీ చేస్తే.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమంచి సహకరించరు. ఆమంచి సహకారం లేకపోతే వైసీపీకి అవకాశాలు దాదాపుగా ఉండవు. ఈ పరిస్థితుల్లో వైసీపీ ఓటు బ్యాంకు చీలడం వంటి పరిస్థితులతో వైసీపీ చీరాలలో వెనుకంజ వేసే అవకాశాలున్నట్లు కనిపిస్తోంది. అదే సమయంలో టీడీపీపై పాజిటివ్ ఇమేజ్ కలిసి వచ్చే అవకాశాలున్నాయి.
టీడీపీని దెబ్బకొట్టాడనికి ఆ పార్టీలోని నేతలందర్నీ వైసీపీలో చేర్చుకుకున్నారు. కానీ అదే ఆ పార్టీకి పెద్ద మైనస్ అవుతోంది. జనసేన మద్దతుతో టీడీపీ ఇక్కడ అడ్వాంటేజ్ సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…