అప్పటి సీఎం జగన్ రెడ్డిని ప్రసన్నం చేసుకునేందుకు అరాచకాలకు పాల్పడిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. వారి అరాచకాలు, అవినీతి చిట్టాను టీడీపీ ప్రభుత్వం సిద్ధం చేస్తోంది.ఏ క్షణాన్నయినా వారిపై చర్యలు తప్పవని వార్తలు వస్తున్న నేపథ్యంలో కొందరు అధికారులు టీడీపీతో కాళ్లబేరానికి వస్తున్నారు. ఏదో విధంగా తమ పదవులను కాపాడుకోవాలని, జైలుకు వెళ్లకుండా చూసుకోవాలని వాళ్లు నానా తాపత్రయం పడుతున్నారు. ఐదేళ్ల పాటు చేయకూడని పనులు చేసిన వాళ్లంతా…ఇప్పుడు వాటన్నింటినీ మరిచిపోయినట్లు నటిస్తూ అన్యధా శరణం నాస్తి అంటూ చంద్రబాబు పంచన చేరేందుకు ప్రయత్నిస్తున్నారు.. వారి విషయంలో ఎలాంటి పట్టు విడుపులు ఉండవని టీడీపీ తెగేసి చెబుతున్నా.. ఒక్క ఛాన్స్ ప్లీజ్, మా తప్పేం లేదు ఐనా వెరీ వెరీ సారీ అని మోకాళ్ల మీద నిల్చుని వేడుకునేందుకు వెనుకాడటం లేదు.
సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు నిఘా విభాగం చీఫ్ గా ఉండేవారు. ఐదేళ్లపాటు చేయకూడని పనులన్నీ చేశారు. ఇప్పుడు ఆయన పడుతున్న పాట్లు పోలీసుశాఖలో చర్చనీయాంశమయ్యాయి. మాజీ సీఎం జగన్ తాడేపల్లి ప్యాలెస్ లో ప్రత్యేకంగా ఒక గదిలో కూర్చుని నిన్నటిదాకా రాజకీయ సమస్యలు పరిష్కరించిన పీఎస్ఆర్ ఆంజనేయులు, ప్రభుత్వం మారడంతో హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి చుట్టూ ఇప్పుడు ప్రదక్షిణ చేస్తున్నారు.రాష్ట్ర పోలీసు శాఖనే తన గుప్పిట్లో పెట్టుకుని డీజీపీగా అధికారం చెలాయించాలని చూసిన సీనియర్ ఐపీఎస్ అధికారి….. రెండేళ్లు సర్వీసు ఉండగానే వీఆర్‌ఎస్ తీసుకోవడానికి సిద్ధమైనట్లు ఉన్నతస్థాయి వర్గాల్లో చర్చ జరుగుతోంది.
పీఎస్ఆర్ ఆంజనేయులు జిల్లాల్లో ఎస్పీగా ఎన్‌కౌంటర్లతో ఒక వెలుగు వెలిగారు. విజయవాడ పోలీస్ కమిషనర్‌గా మహిళా వైద్యురాలితో జరిపిన ఫోను సంభాషణతో అభాసుపాలై రాష్ట్రం వదిలి కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు.2019లో ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర సర్వీసుల్లోకి తిరిగొచ్చి జగన్‌కు కళ్లు, నోరు, చెవులు అన్నీ ఆయనే అయ్యారు. రాష్ట్రంలో నిఘా విభాగం అధిపతి పోస్టు ఆశించి వచ్చిన ఆయనకు…..మొదట్లో బ్రేక్ పడింది. రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్‌గా సర్దుకోవాల్సి వచ్చింది. పొరుగు రాష్ట్రం నుంచి స్టీఫెన్ రవీంద్రను తెచ్చుకునే ప్రయత్నం చేయడం, ఐజీ ర్యాంకులో ఉన్న మనీశ్‌కుమార్ సిన్హాకు నిఘా చీఫ్ బాధ్యతలు ఇవ్వడం ఆంజనేయులుకు నచ్చలేదు. దీంతో బుర్రకు పదును పెట్టి జగన్‌కు బాగా నచ్చే పనులపై దృష్టి సారించారు.ఆయన కళ్లలో పడి తాడేపల్లి ప్యాలెస్ కు చేరారు. తర్వాత ఇక తిరుగులేని ఐపీఎస్ గా పేరు పొందారు. జగన్ టీమ్ కు క్లోజ్ గా ఉంటూ టీడీపీపై కక్షసాధింపుకు దిగారు. విపరీతమైన స్వామి భక్తిని ప్రదర్శిస్తూ…టీడీపీ వారిని వేధించారు.ప్రభుత్వం మారిన తర్వాత పీఎస్ఆర్ కు సెగ తగిలింది. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన రోజే ఆయన్ను మీటింగు నుంచి పంపేశారు. దానితో తన పరిస్థితి ఏమిటో తెలుసుకున్న పీఎస్ఆర్…ఇప్పుడు బతిమాలుకుని చంద్రబాబు మెప్పుపొందాలని చూస్తున్నారు. చంద్రబాబు హైదరాబాద్ నివాసానికి వచ్చి కలిసేందుకు పీఎస్ఆర్ చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఆయన్ను గేటు దగ్గరే ఆపేశారు. అప్పాయింట్ మెంటు లేదని వెనక్కి పంపేశారు.చంద్రబాబు కనికరిస్తే స్వచ్ఛంద పదవీ విరమణ అంటే వీఆర్ఎస్ తీసుకుని వెళ్లిపోవాలని పీఎస్ఆర్ ప్రయత్నిస్తున్నారు. అయితే టీడీపీ వారి ఆలోచన వేరుగా ఉంది. చేసిన తప్పులకు శిక్ష అనుభవించకుండా ఎలా వెళతారన్నది వారి ప్రశ్న. చూడాలి మరి ఏం జరుగుతుందో..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…