తెలంగాణ కేబినెట్ విస్తరణ మళ్లీ వాయిదా పడినట్లేనని వార్తలు వస్తున్నాయి. ఆరు పోస్టులకు అరవై మంది ఆశావహులు ఉంటడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కుల సమీకరణాల లెక్కలు చూసుకుని దీన్ని ఎలా పరిష్కరించాలో అర్థం కాక ఏఐసీసీ పెద్దలే గుండెలు బాదుకుంటున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే కొన్ని పేర్లు షార్ట్ లిస్టు చేసినా వాటిని మళ్లీ పెండింగ్లో పెట్టారు. మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడయ్యాక.. ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఇప్పుడు ఏఐసీసీ పెద్దలైతే తెలంగాణకో నమస్కారం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
ఏం చేయాలో అర్థం కాకే, ఒకరికి ఇస్తే మరోకరికి కోపం వస్తుందన్న అనుమానంతోనే… రేవంత్ కేబినెట్ విస్తరణ సుదీర్ఘంగా వాయిదా పడుతున్నట్లుగా చెబుతున్నారు. ఎలా లెక్కలు వేసుకున్నా సరే అన్ని వర్గాలకు న్యాయం చేయలేమని హైకమాండ్ డిసైడైంది. పైగా ఇప్పుడున్న మంత్రులు ప్రమాణ స్వీకారం చేసి ఇంకా ఏడాది కూడా కాకపోవడంతో వారిని కదిలించడం కరెక్టు కాదన్న భావన అధిష్టానంలో ఉంది. ఒక్క కొండా సురేఖ.. స్వయంకృతం తప్పితే ఏ మంత్రిపైనా పెద్దగా ఆరోపణలు లేవు. అందుకే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వరకు తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై మాట్లాడకూడదని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు..తెలంగాణ కేబినేట్ విస్తరణ అంశం బీజేపీకి అస్త్రంగా మారకూడదనేది ఏఐసీసీ ఆలోచనగా తెలుస్తోంది. క్యాస్ట్ ఈక్వేషన్ విషయంలో చిన్న చిన్న సమస్యలు ఉంటే, వాటిని హైలెట్ చేస్తూ మహారాష్ట్రలో బీజేపీ లాభం పొందాలని చూస్తోందనే అభిప్రాయం ఏఐసీసీలో ఉన్నది. దీంతోనే కొత్త మంత్రుల ప్రకటనను జాప్యం చేస్తున్నారు. హరియాణా ఎన్నికల్లో ఎదురుదెబ్బలు కూడా ఏఐసీసీ పెద్దలను ఆలోచనలో పడేశాయి. అందుకే కాస్త ఆలస్యమైనా ఫర్యాలేదన్న ఫీలింగులో ఉన్నారు…
ఆశావహుల విషయానికి వస్తే ఉమ్మడి రంగారెడ్డి నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి బెర్త్ కోసం పోటీ పడుతున్నారు. అయితే రెడ్డి సామాజిక వర్గానికి మరిన్ని మంత్రి పదవులు ఇవ్వొద్దని హైకమాండ్ భావిస్తే బీఆర్ఎస్ నుంచి వచ్చే ఎమ్మెల్యేలకు ఇచ్చే ఛాన్స్ ఉందనే టాక్ ఉన్నది. అయితే మల్ రెడ్డి రంగారెడ్డి మాత్రం తనకు బెర్త్ కన్ఫమ్ అయిందనే భరోసాతో ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇక ఉమ్మడి హైదరాబాద్ నుంచి ఒక మైనార్టీ నేతకు మంత్రి పదవి ఇవ్వాలని పార్టీ భావిస్తోంది. అయితే ఈ జిల్లా పరిధిలో మైనార్టీ నేతలు ఎవ్వరూ గెలవలేదు. దీంతో మైనార్టీ కి మంత్రి పదవి ఇవ్వాలంటే కచ్చితంగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఇవ్వాలి. ఇటీవల అసెంబ్లీ టిక్కెట్లు పొంది ఓడిపోయిన షబ్లీర్ అలీ, అజారుద్దీన్, ఫిరోజ్ ఖాన్ లకు ఇస్తారా? ఇతర నాయకులను ఎంపిక చేస్తారా? అనేది ఉత్కంఠగా మారింది. ఇక ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు కు దాదాపు కన్ఫమ్ అనే చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వంపై పోరాడి కాంగ్రెస్ ను నిలబెట్టిన నేతగా ఆయనకు మంచి పేరు ఉంది. పైగా రేవంత్ రెడ్డికి ఆయన సన్నిహితుడయ్యారు. నిజామాబాద్ నుంచి కూడా సుదర్శన్ రెడ్డికి పక్కా అని పార్టీ నేతలు చెప్తున్నారు. పెండింగ్ లోని నాలుగు ఉమ్మడి జిల్లాలకు మంత్రి పదవులు కేటాయించిన తర్వాత, మరో రెండు బెర్త్ లు ఖాళీగా ఉంటాయి. ఇప్పుడు ఈ రెండింటి కోసం పోటీ నెలకొన్నది. అయితే ఇందులో బీసీ సామాజిక వర్గ నేత వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఖాయమనే ప్రచారం జరుగుతుంది. కానీ ఈ సీటు కోసం ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య కూడా ట్రై చేస్తున్నారు. ఇక మరో బెర్త్ కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో హైకమాండ్ పై ఒత్తిడి తెస్తున్నారు. తనకు పార్టీలో చేరేటప్పుడే హామీ ఇచ్చారని, ఆ తర్వాత భువనగిరి ఎంపీని గెలిపించాల్సిన బాధ్యత అప్పగించిన సమయంలోనూ చెప్పారని ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు..
కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువ పదవులు ఉన్నాయి. ఇటు బీజేపీ, అటు బీఆర్ఎస్ ను లేచి నిల్చోకుండా కొట్టాలంటే పదవుల్లో బీసీలు, ఎస్సీలకు పెద్ద పీట వేయాలని అధిష్టానికి అర్థమైంది. పైగా బీజేపీకి దూరంగా ఉండే మైనార్టీలను కూడా సంతృప్తి పరచాలి. ఆ దిశగా అడుగులు వేయాలంటే తగినన్ని పదవులు ఖాళీగా లేవని హైకమాండ్ గుర్తించింది. అందుకే ఏమీ చేయలేక వాయిదా వేస్తూ వస్తోంది…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…