నిన్నటి అధికార పార్టీ వైసీపీ ఖాళీ అవుతుందనే చెప్పాలి. ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. పదకొండు మంది ఎమ్మెల్యేలకు పరిమితమై దెబ్బతిన్న వైసీపీలో ఉండేందుకు ఎవరూ ఇష్టపడటం లేదు. సేఫ్ జోన్లోకి వెళ్లిపోయేందుకే నేతలు ఇష్టపడుతున్నారు. పార్టీకి, వైఎస్ కుటుంబానికి వీర విధేయులు కూడా వెళ్లిపోయేందుకే మొగ్గుచూపుతున్నారంటే పార్టీలో ఎంత మేర ఉక్కపోత ఉందో అర్థం చేసుకోవచ్చు…
వైసీపీని వరుసగా సీనియర్లు వీడుతున్నారు. పరాజయం ఎదురు కావడంతో పార్టీకి భవిష్యత్తు లేదని భావిస్తున్న నేతలు ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వరుసగా పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఎప్పటికీ ఐదుగురు మాజీ ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. ఇప్పుడు బాలినేని, సామినేని ఉదయభాను పేరు వినిపిస్తోంది. ఒకరు వైయస్ కుటుంబానికి బంధువు కాగా, మరొకరు వీర విధేయుడు. కానీ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు విడిచిపెట్టి వెళ్లిపోతుండడంపై రకరకాల ప్రచారం నడుస్తోంది. బాలినేని ఇటీవల పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డిని కలుసుకుని వైసీపీలో ఉండలేనని ప్రకటించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఎన్నికల ముందు చాలా రోజుల నుంచి బాలినేని అసంతృప్తిగానే ఉన్నారు. తను అనుకున్నది జరగడం లేదని ఆయన ఆగ్రహం చెందేవారు. తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లి మరీ ఒకటి రెండు సార్లు వాదన పెట్టుకుని వచ్చారు. పైగా తన జిల్లాకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇంచార్జీగా ప్రకటించడం కూడా ఆయనకు నచ్చలేదు. చివరకు బాలినేని, చెవిరెడ్డి ఇద్దరూ ఓడిపోయారు. ఎన్నికలు ముగిసిన దగ్గర నుంచి పక్క చూపులు చూస్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డి.. ఇప్పుడు జనసేన వైపు పరిగెడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ప్రాథమికంగా చర్చలు కూడా జరిగాయి..
ఇక మరో నేత పరిస్థితి కూడా వైసీపీలో ఏం బాగోలేదు. సామినేని ఉదయభాను మాజీ నియోజకవర్గం జగ్గయ్యపేటలో మున్సిపల్ చైర్మన్ తో సహా 18 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. దీంతో సామినేని వైసీపీని వీడతారనే ప్రచారం బలంగా పెరిగింది. అయితే ఆయనలో ఈ స్థాయిలో అసంతృప్తి ఉందని ఎవరికీ తెలియదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో విప్ గా పనిచేశారు. ఎంతో నమ్మకంతో ఉన్న జగన్ తనను నమ్మలేదని.. మంత్రి పదవి కేటాయించలేదని ఆయనలో అసంతృప్తి మిగిలిపోయింది.ఉదయభాను వైయస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత విధేయత కలిగిన నేత. 1999లో రాజశేఖర్ రెడ్డి చొరవతో కాంగ్రెస్ పార్టీ టికెట్ లభించింది. ఆ ఎన్నికల్లో గెలిచారు కూడా. వైయస్సార్ తో ఉన్న అనుబంధం కారణంగానే ఆయన జగన్ వెంట అడుగులు వేశారు. వైసీపీ అధికారంలోకి రావడంతోమంత్రి అవుతానని ధీమాతో ఉండేవారు. కానీ రకరకాల సమీకరణలతో జగన్ మంత్రి పదవి ఇవ్వలేదు. పోనీ విస్తరణలోనైనా ఛాన్స్ ఇస్తారని భావించారు. కానీ పరిగణలోకి తీసుకోలేదు. దీంతో మంత్రి అవుతానన్న ఆశ తీరలేదు. అప్పటినుంచి ఓ రకమైన అసంతృప్తితో ఉండేవారు.ఈ ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేయాలని ఆయన భావించలేదు.ఎన్నికలకు ముందు జనసేనలో చేరేందుకు ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి.ఇప్పుడు వైసీపీ ఓటమితో పార్టీలో ఉంటే భవిష్యత్తు ఉండదని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. సాధారణంగా పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా సామినేని ఉదయభాను మాట చెల్లుబాటు అయ్యేది. ఇప్పుడలా లేదు. అందుకే ఆయన పార్టీని వదిలి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని జగ్గయ్యపేట నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. వ్యక్తిగతంగా సామినేని ఉదయభాను కు మంచి పేరు ఉండడంతో పవన్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే సమయంలో చిరంజీవితో సైతం మంచి సంబంధాలే ఉన్నాయి. అందుకే ఆయన జనసేనలో చేరే అవకాశం ఉందని ప్రచారం నడుస్తోంది.
ఏదేమైనా తాజా రాజకీయాలను మరో కోణంలో చూడాలి. ఎన్నికల తర్వాత వైసీపీని వీడే వారంతా టీడీపీ కంటే.. జనసేన బెటర్ అని భావిస్తున్నారు. టీడీపీలో గుంపులు పెరిగిపోయిన కారణంగా అక్కడకు వెళ్లినా తమకు ప్రాధాన్యం ఉండదని భావిస్తూ.. జనసేనలో అయితే అందలం ఎక్కిస్తారని ఎదురుచూస్తున్నారు. అదన్నమాట సంగతి….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…