ఏపీలో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. అసెంబ్లీ ఎన్నికలతో పాటే సార్వత్రిక ఎన్నికలు కూడా ముగిసాయి.ఈ ఎన్నికల్లో టిడిపి, బిజెపి తరపున బరిలో ఉన్న కొందరు అభ్యర్ధుల అసలు లక్ష్యం కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వస్తే కేంద్ర మంత్రి అయిపోవడమే. ఈ రేసులో అరడజనుకు పైగా నేతలు సర్వశక్తులూ ఒడ్డి ఎన్నికలు ఎదుర్కొన్నారు. అయితే వారిలో ఎందరు గెలిచి వస్తారు వారిలో ఎవరికి మంత్రి యోగం పడుతుందన్నది తేలాల్సి ఉంది. అది కూడా కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వస్తేనే. మొత్తం మీద ఈ నేతలు జూన్ 4 వరకు ఉత్కంఠతతో ఎదురు చూడక తప్పదు.
లోక్ సభ ఎన్నికల బరిలో బిజెపి తరపున పోటీ చేస్తున్న వారిలో సిఎం రమేష్, కిరణ్ కుమార్ రెడ్డి, దగ్గుబాటి పురందేశ్వరి కేంద్ర మంత్రి పదవిపైనే కన్నేశారు. ఇక టిడిపి తరపున లోక్ సభ ఎన్నికల బరిలో ఇద్దరు అపర కుబేరులు పోటీచేశారు. ఒకరు గుంటూరు అభ్యర్ధి పెమ్మసాని చంద్రశేఖ్‌ర్ కాగా, మరొకరు నెల్లూరు ఎంపీ అభ్యర్ధి వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి. ఏపీలోనూ కేంద్రంలోనూ కూటమి అధికారంలోకి వస్తే రెండు చోట్లా కూటమి పక్షాలు అధికారాన్ని పంచుకనే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఎంపీగా గెలిస్తే కేంద్ర మంత్రి అయిపోవచ్చునని ఈ అభ్యర్ధులు ఉవ్విళ్లూరుతున్నారు.
గుంటూరు నుండి పోటీ చేస్తోన్న పెమ్మసాని చంద్రశేఖర్ ఆస్తులు అఫిడవిట్ ప్రకారమే 5700కి పైగా కోట్లు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్న పెమ్మసాని డబ్బులను మంచి నీళ్లల్లా ఖర్చు చేస్తున్నారు. మాజీ ఎంపీ గల్లా జయదేవ్ ఈ ఎన్నికలకు దూరంగా ఉండడంతో ఎన్నారై అయిన పెమ్మసానికి చంద్రబాబు టికెట్ ఇచ్చారు. కోట్లు ఖర్చు చేయగల స్థోమత ఉండడమే పెమ్మసాని అర్హత. ఎన్నికల్లో గెలిస్తే కేంద్ర మంత్రి పదవిని కూడా కోట్లు విసిరి కొట్టేయచ్చని పెమ్మసాని భావిస్తున్నారట. అయితే ముందుగా ఆయన గుంటూరు నుండి గెలవాలి. దానికి తన వంతు ప్రయత్నం చేశానంటున్నారాయన. ఇక ఓటర్ల దయపై ఆయన భవిత ఆధార పడి ఉంది.
మరో కుబేరురు వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి. కొద్ది వారాల క్రితం వరకు వేమిరెడ్డి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయనకు గతంలో రాజ్యసభ సీటు ఇచ్చారు జగన్ మోహన్ రెడ్డి. ఈ ఎన్నికల్లో తాను చెప్పిన వారికి టికెట్ ఇవ్వలేదన్న కోపంతో ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పారు. వెంటనే టిడిపిలో చేరారు. నెల్లూరు లోక్ సభ స్థానం నుండి టికెట్ కొట్టారు. నాలుగైదు అసెంబ్లీ నియోజక వర్గాల్లో అభ్యర్ధుల ఎన్నికల ఖర్చును ఆయనే భరించేలా కండిషన్ పెట్టారు చంద్రబాబు. కోట్లకు పడగలెత్తిన వేమిరెడ్డి తన భార్యకు కోవూరు సీటు ఇప్పించుకున్నారు. అక్కడే వంద కోట్లకు పైగా ఖర్చు చేశారని అంటున్నారు. తాను పోటీచేసే స్థానంలో 300కోట్లకు పైగా ఖర్చు చేశారట. రేపు గెలిస్తే బాబునే పట్టుకుని కేంద్ర మంత్రి అవ్వాలని ఆయన అనుకుంటున్నారు.
మరో కుబేరుడు సి.ఎం. రమేష్. 2019 ఎన్నికల వరకు టిడిపి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సిఎం రమేష్ ఆ తర్వాత బిజెపిలో చేరారు. ఈ ఎన్నికల్లో అనకాపల్లి లోక్ సభ స్థానం నుండి పోటీ చేశారు. ప్రత్యర్ధి పార్టీ నేతలను కొనుగోలు చేయడానికే వందల కోట్లు కుమ్మరించారని ప్రచారం జరిగింది. మొత్తం మీద 300 నుండి 400 కోట్ల రూపాయల వరకు సిఎం రమేష్ ఖర్చు చేశారట. అయినా గెలుపు గ్యారంటీ లేదంటున్నారు. అక్కడ గెలిస్తే మాత్రం ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు అయితే చంద్రబాబు తో పైరవీ చేయించి మంత్రి అయిపోవచ్చని సిఎం రమేష్ ఆశిస్తున్నారట.
ఏపీ బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి చంద్రబాబుకు బంధువు కూడా. కూటమి కట్టడంలో బాబుకు బాగా సహకరించారు పురందేశ్వరి. ఈ సారి రాజమండ్రి నుండి గెలిచి ఎంపీ అయితే చంద్రబాబు తో చెప్పించుకుని మరో సారి కేంద్ర మంత్రి అయిపోవాలని ఆమె ముచ్చట పడుతున్నారు. మొత్తం మీద ఈ అభ్యర్ధులంతా కూడా ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. బాగా కష్టపడ్డారు. డబ్బులు విసిరారు. మరి ఓటరు దేవుళ్లు వీళ్లని ఆశీర్వదించారా లేదా అన్నది మాత్రం జూన్ 4నే తెలుస్తుంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…