ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ఓ రకంగా ఉండవు. అదేదో సినిమాలో బ్రహ్మానందం చెప్పినట్లు రక రకాలుగా ఉంటాయి. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి ప్రజాసమస్యలను అంది పుచ్చుకోవడం మాని ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకు షార్ట్ కట్స్ లో పోతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే కొద్ది రోజులుగా టిడిపి ప్రయత్నాలన్నీ కూడా బెడిసికొడుతున్నాయి. అయినా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వెనకడుగు వేయడం లేదు. దీనిపైనే పాలక వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెరుగుతోంది.
2019 ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీ ఘోరపరాజయాన్ని మూటకట్టుకుంది. పేరుకు ప్రధాన ప్రతిపక్షంగా మిగిలిందే కానీ 175 స్థానాల్లో కేవలం 23 స్థానాలకు మాత్రమే పరిమితమై పరువు పోగొట్టుకుంది. ఆ తర్వాత అయినా పార్టీ కోలుకుందా అంటే అదీ లేదు. నాలుగున్నరేళ్లలో ఏపీలో జరిగిన అన్ని రకాల ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ డిపాజిట్లు కోల్పోయింది. చాలా నియోజక వర్గాల్లో పార్టీకి అభ్యర్ధులు కూడా లేరని పార్టీ సమీక్షా సమావేశాల్లో ఆ పార్టీ నేతలే ఆందోళన వ్యక్తం చేస్తోన్న పరిస్థితి.
ఏపీలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని గాలికి వదిలేసిందంటూ చాలా నెలలుగా టిడిపి ఆరోపిస్తోంది. ఎక్కడ చూసినా అవినీతి తాండవిస్తోందని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తెలుగుదేశం పార్టీ ఎంపీలు, పార్టీకి సానుభూతి పరులైన కొందరు సర్పంచ్ లు ఢిల్లీ వెళ్లారు. కేంద్ర మంత్రి మొరేశ్వర్ పాటిల్ ను కలిశారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఉపాధి హామీ పథకం అమలు లో అడుగడుగునా అవకతవకలు జరిగిపోతున్నాయని ఫిర్యాదు చేశారు. టిడిపి నేతలు చెప్పేదంతా ఓపిగ్గా విన్నారు కేంద్ర మంత్రి పాటిల్ ఉపాధి హామీ పథకంలో చెల్లింపులన్నీ ఆన్ లైన్ లో జరుగుతున్నాయి కదా అన్నారు.మొత్తం పథకం అమలు అంతా పారదర్శకంగా జరుగుతోందని కితాబు నిచ్చారు.
కేంద్ర మంత్రి ఏపీ ప్రభుత్వానికి ఏమైనా వ్యాఖ్యలు చేస్తే వాటిని పట్టుకుని ఏపీలో హడావిడి చేయచ్చనుకున్న టిడిపి ప్రతినిథుల బృందానికి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లయ్యింది. తామొకటి తలిస్తే దైవం ఇంకోటి తలచిందన్నట్లు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పరువు తీద్దామని ఢిల్లీ వెళ్లిన టిడిపి నేతల బృందానికే భంగపాటు తప్పలేదు. కేంద్ర మంత్రి వైఖరితో టిడిపి నేతలు లోలోపలే కుత కుతలాడిపోయారు. మొహాలు మాడిపోగా వెను తిరిగారు.
కొద్ది రోజుల క్రితం పార్లమెంటు సాక్షిగానూ టిడిపి ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. కొద్ది రోజుల క్రితం తెలంగాణాకు చెందిన బి.ఆర్.ఎస్. ఎంపీ నామా నాగేశ్వరరావు లోక్ సభలో ఓ ప్రశ్న వేశారు. ఆంధ్ర ప్రదేశ్ లో అక్కడి ప్రభుత్వం చేసిన అప్పులు ఎన్ని ఉన్నాయి? అంటూ నామా నాగేశ్వరరావు ప్రశ్నించారు. చిత్రం ఏంటంటే ఆంధ్ర ప్రదేశ్ అప్పులకు తెలంగాణాకూ సంబంధం లేదు. ఏపీ అప్పులు ఎన్ని ఉన్నాయో తెలుసుకోవడం వల్ల తెలంగాణాకు ఒరిగేదీ ఉండదు. నామా నాగేశ్వరరావు గతంలో టిడిపి నాయకుడే. ఆ అనుబంధంతోనే చంద్రబాబు ఆదేశాల మేరకే నామా నాగేశ్వరరావు లోక్ సభలో తనకు సంబంధంలేని ఏపీ అప్పుల గురించి ఆరా తీసి ఉంటారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు
నామా నాగేశ్వరరావు తనకు అవసరం లేకపోయినా ఏపీ అప్పుల గురించి ప్రశ్నించగానే కేంద్ర ప్రభుత్వం దానికి వివరణ ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం పరిమితులకు లోబడే నిబంధనలకు అనుగుణంగానే అప్పులు చేసిందని కేంద్రం వివరణ ఇచ్చింది. దాంతో నామా నాగేశ్వరరావు నిరాశగా ఉండిపోయారు. కొద్ది రోజుల తర్వాత ఏపీకి చెందిన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు కూడా ఇదే ప్రశ్న వేశారు. ఏపీ ప్రభుత్వం చేసిన అప్పులెన్ని అని అడిగారు. దానికి కేంద్ర ఆర్ధిక మంత్రి సీతారామనే బదులిస్తూ చంద్రబాబు హయాంలో చేసిన అప్పుల కన్నా జగన్ మోహన్ రెడ్డి చేసిన అప్పులు తక్కువేనని లెక్కలతో సహా వివరణ ఇవ్వడంతో రఘురామ కూడా కంగుతిన్నారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి …..