ఉత్తరాంధ్ర వైసీపీ టెన్షన్

By KTV Telugu On 25 September, 2023
image

KTV TELUGU :-

ఉత్తరాంధ్ర పరిణామాలతో వైసీపీ వణికిపోతోంది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో పార్టీ పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉంది. సైకిల్, గ్లాస్ కదం తొక్కుతుంటే, ఫ్యాన్ గాలి స్పీడు తగ్గింది. తాజా పరిణామాలతో వైసీపీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరగడంతో ఏం చేయాలో తోచక అధికార పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.

చంద్రబాబు అక్రమ అరెస్టు ఉమ్మడి విజయనగరం జిల్లా రాజకీయాలనే మార్చేసిందని చెప్పక తప్పదు. ప్రస్తుత విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో ఏ ఇద్దరు వైసిపి నేతలు కలిసినా ఒకటే మాటే..! చంద్రబాబు అరెస్టు, తదనంతర పరిస్థితులు, రాబోయే రోజుల్లో రాజకీయ భవిష్యత్తులు, కొత్త సమీకరణలు అనే అంశాలపైనే చర్చించుకుంటున్నారు. కాస్తో కూస్తో రాజకీయ పరిజ్ఞానం ఉన్నవారందరూ జగన్ తొందరపడ్డారని చెబుతుంటే..! ఎన్నికల ముందు తమ కొంప ముంచేశారని మరి కొంత మంది వైసిపి నేతలు తెగేసి చెబుతున్నారు.

ఇజ్జీనగరంలో రాజకీయ విశ్లేషకులు ఇప్పుడు కొత్త వాదనను తెరమీదకు తెచ్చారు. 1984 పరిణామాల్లో స్వర్గీయ ఎన్టీయార్ ఎలా లబ్ధిపొందారో… చంద్రబాబు కూడా అదే తీరుతో బౌన్స్ బ్యాక్ అవుతారని వాళ్లు చెప్పుకుంటున్నారు. దానితో వైసీపు నేతలకు టెన్షన్ పట్టుకుంది. జిల్లాలో టీడీపీ నిరసనలు తారాస్థాయికి చేరడం, వాటికి ప్రజామద్దతు లభించడంతో వైసీపీకి పాలుపోవడం లేదు. పైగా టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని స్వయంగా వవన్ కల్యాణ్ ప్రకటించడంతో ఇక తమ పని అయిపోయిందని వైసీపీ నేతలు లెక్కలేసుకుంటున్నారు .చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తేసే వరకు తమ పోరాటం ఆగదని టీడీపీ ప్రకటించడంతో వైసీపీ వారికి పాలు పోవడం లేదు. ముందే అంతర్గత కుమ్ములాటలతో పార్టీ గగ్గోలు పెడుతుంటే… ఇప్పుడు బయట నుంచి కూడా సంక్షోభం వచ్చి పడిందని వైసీపీ వాళ్లు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల సీఎం జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు జనసేన నేతలు, కార్యకర్తలు జగన్ కాన్వాయ్ ముందు సీఎం. గో బ్యాక్ నినాదాలతో మారుమ్రోగించారు. టీడీపీ రిలే నిరాహార దీక్షా శిభిరాల దగ్గరకు వెళ్లి జనసేన, సీపీఐ నేతలు, కార్యకర్తలు తాము కూడా బాబుతోనే చెప్పటం ఫ్యాన్ గుర్తుపై మోజు తగ్గించే పరిస్థితులు ఎదురవుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.

విజయనగరం జిల్లా నెంబర్ వన్ వైసీపీ నాయకుడిగా పేరున్న బొత్స సత్యనారాయణకు కూడా ఎదురుగాలి వీచడం ఇప్పుడు పార్టీ వర్గాలకు మింగుడు పడటం లేదు. బొత్స ప్రాతనిధ్యం వహిస్తున్న చీపురుపల్లి నియోజకవర్గంలో గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయని చెప్పుకుంటున్నారు. విభజన సెగ దెబ్బతో 2014లో ఓడిన ఆయన..2015లో జగన్‌తో చేతులు కలిపారు. ఆ తర్వాత 2019లో వైసీపీ తరపున పోటీచేసి… విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో మూడోస్థానానికి పరిమితమైన పార్టీని.. చీపురుపల్లిలో ఫస్టు ప్లేసుకు తీసుకొచ్చారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జడ్ పి ఛైర్మన్ కమ్‌ వైసిపి జిల్లా ప్రెసిడెంట్‌ చిన్న శ్రీనులిద్దరూ ఈ నియోజకవర్గం నుంచే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. బెల్లాన బొత్సకు వ్యతిరేకమైన నేపథ్యంలో మంత్రికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో నెలకొన్న పరిస్థితులకు చీపురుపల్లి దర్పణం పడుతోంది.

వచ్చేసారి బొత్స సత్యనారాయణ ప్లేసులో… ఆయన కుమారుడు సందీప్‌ పోటీచేస్తారనే ప్రచారం జరుగుతోంది. తాను ఎంపీగా పోటీచేసి.. వారసుణ్ని అసెంబ్లీ బరిలో నిలపాలని ఈ సీనియర్‌ నేత ఆలోచిస్తున్నట్టు సమాచారం. అయితే అదీ అంత ఈజీ కాదని చెబుతున్నారు. ఎందుకంటే ఉమ్మడి జిల్లాలో పార్టీ కేడర్ పూర్తిగా దెబ్బతిన్నది. గడపగడపకు జనం నిలదీయడం వారికి ఇబ్బందికరంగా మారింది. జగన్ ఏం చేశాడో చెప్పాలంటూ జనం ప్రశ్నిస్తుంటే వాళ్లు సమాధానం చెప్పలేకపోతున్నారు.దానితో పార్టీని కాపాడుకునేందుకు కొత్త వ్యూహాలు కావాలని కేడర్ ఎదురుచూస్తోంది. మరి అధిష్టానం రెస్పాండ్ అవుతుందో లేదో చూడాలి.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి