ఏపీలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన మధ్య పొత్తు అంటున్నారు. బీజేపీ కూడా కలిసి రావాలంటున్నారు. కానీ ప్రస్తుతం నేతల జంపింగ్‌లు చూస్తే అసలు ఏ పార్టీల మధ్య పొత్తు కుదిరేలా కనిపించడం లేదు. ఎందుకంటే బీజేపీ నేతలను టీడీపీ తమ పార్టీలోకి లాగేసుకుంటోంది. కన్నా సైకిల్ ఎక్కేశారు. కామినేని శ్రీనివాస్ విష్ణుకుమార్ రాజులు లైన్లో ఉన్నారు. ఎన్నికల నాటికి ఇంకెంతమంది వెళతారో తెలియదు గానీ ఈ పరిణామాలతో ఆ రెండు పార్టీల మధ్య పొత్తు కష్టమనే సంకేతాలు అయితే వెలువడ్డాయి. ఇక టీడీపీ జనసేన వైపు చూసే నేతలను కూడా ఆకర్షిస్తుండడంతో అటు పవన్ పార్టీ కూడా ఆట మొదలుపెట్టినట్టే కనిపిస్తోంది. తెలుగుదేశం నేతలపై ఫోకస్ పెట్టింది. వంగవీటి రాధా జనసేనలో చేరనున్నారనే ప్రచారం జోరందుకుంది.
గత ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వంగవీటి రాధాకు బాబు టికెట్ ఇవ్వలేదు. ఎన్నికల తర్వాత సైలెంట్ అయిపోయారు. ఎమ్మెల్సీగా ఇస్తారని భావించినా సాధ్యపడలేదు. ప్రస్తుతానికి టీడీపీలో ఉన్నా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ రాజకీయంగా నిర్ణయం తీసుకోవాలని రాధా డిసైడ్ అయ్యారు. సన్నిహితుల నుంచి వస్తున్న ఒత్తిడితో రాధా జనసేనలో చేరేందుకు సిద్దమయ్యారట. ఇందుకు ముహూర్తం కూడా ఖరారైందంటున్నారు. మార్చి 14న జనసేన ఆవిర్బావ సభ జరగనుంది. ఆ సమయంలో జనసేనాని పవన్ సమక్షంలో కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. అదే విధంగా మార్చి 22న ఉగాది ముహూర్తం కూడా పరిశీలనలో ఉందని చెబుతున్నారు. టీడీపీ జనసేన మధ్య పొత్తు సంగతేమో గానీ వంగవీటి రాధా నిర్ణయం మాత్రం విజయవాడ రాజకీయాల్లో ఆసక్తి కరంగా మారుతోంది. నగర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు కారణమవుతోంది.
రాధా గతంలో ప్రజారాజ్యంలోనూ పని చేసారు. పవన్‌తో అతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎన్నికల తర్వాత రాధా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కలవడంతో పార్టీ మారతారని అప్పట్లోనే ఊహాగానాలు వినిపించాయి. కానీ అది జరగలేదు. కొద్ది నెలల క్రితం జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ విజయవాడలో వంగవీటి రాధాతో భేటీ అయ్యారు. ఆ సమయంలోనే రాధాను ఆహ్వానించినట్లు ప్రచారం సాగింది. వంగవీటితో పాటు యలమంచిలి రవి పలువురు నేతలు పవన్ సమక్షంలో కండువా కప్పుకుంటారని చెబుతున్నారు. పార్టీ ఆవిర్భావ సభ తరువాత పవన్ కల్యాణ్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు ప్రారంభించాలని నిర్ణయించారు. ముందుగా విజయవాడ నగరం నుంచే సమీక్షలు చేపట్టనున్నారు.
వంగవీటి రాధా జనసేనలో చేరితే విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేస్తారని చెబుతున్నారు. ఒకవేళ టీడీపీ జనసేనల మధ్య పొత్తు ఉంటే సీట్ల సర్థుబాటు సమస్యగా మారుతుంది. జనసేన నుంచి రాధా పోటీ చేస్తే టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది. వంగవీటి రాధా 2004లో కాంగ్రెస్ నుంచి విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009 లో ప్రజారాజ్యం నుంచి విజయవాడ సెంట్రల్ అభ్యర్దిగా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసినా గెలవలేదు. 2019 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాలకు మాత్రం హాజరవుతున్నారు.