వంగవీటికి మొండిచెయ్యి.. అదితప్ప ఇంకే సీటు అయినా అడగాలన్న లోకేష్

By KTV Telugu On 9 March, 2023
image

రైట్ టైమ్ లో రాంగ్ డెసిషన్ తీసుకుంటారు కొందరు. రాంగ్ టైమ్ లో రైట్ డెసిషన్ తీసుకుంటారు ఇంకొందరు. నిజానికి ఈ రెండూ కూడా ఒకటే. వీళ్ల డెసిషన్లు వీళ్లకి మంచి రోజులు తీసుకురావు ఎప్పటికీ. ఇదంతా ఎవరి గురించి అనేగా ఓ సారి అలా విజయవాడ వెళ్దాం పదండి. ఒకప్పుడు వంగవీటి మోహన రంగా పేరు వినపడితేనే కాపులు ఉత్సాహంతో ఉరకలు వేసేవారు. అంత గొప్పనాయకుడు రంగా. ఎంతో ఉజ్వల రాజకీయ భవిష్యత్తు ఉన్న వంగవీటి రంగా దారుణ హత్యకు గురయ్యారు. ఆయన్ను హత్య కు స్కెచ్ గీసింది అప్పటి టిడిపి ప్రభుత్వంలోని పెద్దలే అని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఆ ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న చేగొండి హరిరామ జోగయ్యే తన ఆత్మకథలో వంగవీటి రంగాను హత్య చేయించింది చంద్రబాబు నాయుడే అని ఆరోపించారు.

చేగొండి హరిరామ జోగయ్యే కాదు కాంగ్రెస్ మాజీ నేత కన్నా లక్ష్మీనారాయణ సైతం ఇదే ఆరోపణ చేశారు. టిడిపి అనుకూల మీడియాలోనే కన్నా ఇంటర్వ్యూ ఇస్తూ వంగవీటి రంగానూ తననూ హతమార్చడానికి చంద్రబాబు నాయుడు ప్లాన్ వేశారని అయితే వంగవీటి విషయంలో సక్సెస్ అయ్యారు కానీ తన విషయంలో కాలేకపోయారని కన్నా వివరించారు. టిడిపి వ్యవస్థాపకుడు ఎన్టీయారే చంద్రబాబును మందలించడంతో తాను బతికి బట్టకట్టగలిగానని కన్నా అన్నారు. అదే కన్నా కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నాయుడి చేతుల మీదుగా పచ్చకండువా కప్పుకుని టిడిపిలో చేరారన్నది వేరే విషయం అనుకోండి. వంగవీటి రంగా జీవించి ఉంటే కాంగ్రెస్ లో అత్యున్నత పదవిలో ఉండేవారు. అంతటి గ్లామర్ ఉంది కాబట్టే ఆయన్ను హతమార్చి ఉంటారు. ఆయన మరణానంతరం ఆయన సతీమణి కొంతకాలం ప్రజాజీవితంలో ఉన్నారు టిడిపి హయాంలో ఎమ్మెల్యేగా ఉన్నారు కూడా.

ఆమె తర్వాత తనయుడు వంగవీటి రాథాకృష్ణ వై.ఎస్.రాజశేఖర రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ లో చేరి 2004 ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. 2009 ఎన్నికల్లోనూ ఆయన కాంగ్రెస్ లోనే ఉంటే మరో సారి ఎమ్మెల్యే అయ్యేవారే కాకపోతే అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టడంతో వంగవీటి రాథా ఆ పార్టీలో చేరి ఎన్నికల బరిలో దిగారు. అయితే ఆ ఎన్నికల్లో ఓటమి చెందారు. అయిదేళ్ల తర్వాత 2014 ఎన్నికల్లో వంగవీటి రాథా కృష్ణ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి చెందారు. 2019 ఎన్నికలకు ముందు ఆయన అనూహ్యంగా టిడిపిలో చేరారు. నిజానికి ఆ ఎన్నికల్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ ప్రభంజనం వీస్తోందని అన్ని సర్వేలూ ఘోషిస్తోన్నా టిడిపి అనుకూల మేథావుల ట్రాప్ లో పడి వంగవీటి రాథా టిడిపిలో చేరారు. కాకపోతే ఆయనకు టికెట్ రాకపోవడంతో పోటీ చేయలేదు. పార్టీ తరపున ప్రచారం చేశారు.

నిజానికి ఆయన వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లోనే ఉండి ఉంటే మచిలీపట్నం లోక్ సభ నియోజకవర్గం అభ్యర్ధిగా బరిలో దింపాలని జగన్ మోహన్ రెడ్డి అనుకున్నారట. అదే విషయాన్ని వంగవీటికి చెప్పారట కూడా. కానీ అసెంబ్లీ ఎన్నికల బరిలోనే దిగాలనుకున్న వంగవీటి ఎంపీ సీటు పట్ల ఆసక్తి చూపలేదు. ఆయన డైలమాలో ఉండగానే ఆంధ్రా ఆక్టోపస్ రాథాకు ఫోన్ చేసి ఈ ఎన్నికల్లోనూ టిడిపియే గెలుస్తుంది పార్టీ మారిపో అని సలహా ఇచ్చారని అంటారు. అయితే అందులో ఎంత నిజం ఉందో తెలీదు. 2019 ఎన్నికల్లో టిడిపి ఘోర పరాజయం చెందడంతో చాలా కాలం వంగవీటి రాథా రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. టిడిపి కార్యక్రమాల్లోనూ ఎక్కడా కనిపించలేదు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొడాలి నాని టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీలకు మంచి మిత్రుడైన రాథా మళ్లీ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో చేరతారని ఆ మధ్య ప్రచారం జరిగింది. ఆయన జనసేనలో చేరతారన్న ఊహాగానాలూ షికార్లు చేశాయి.

అయితే తాజాగా వంగవీటి రాథా కృష్ణ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడి తనయుడు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో ప్రత్యక్షమయ్యారు. లోకేష్ పాదయాత్రకు సంఘీభావంగా కొంత దూరం నడిచిన వంగవీటి ఆ తర్వాత లోకేష్ తో క్యారవాన్ లో రెండు గంటలకు పైగా చర్చించారు. కచ్చితంగా వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజకీయాల గురించే వారు చర్చలు జరిపారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ సెంట్రల నుండి పోటీ చేయాలని వంగవీటి రాథా భావిస్తున్నారు. అదే విషయాన్ని లోకేష్ కు చెప్పారట. అయితే విజయవాడ సెంట్రల్ కాకుండా ఇంకెక్కడినుంచి అయినా పోటీ చేసే ఉద్దేశం ఉంటే చెప్పాల్సిందిగా లోకేష్ అన్నారట. దానికి కారణం మరేమీ లేదు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి ఇన్ ఛార్జ్ గా ఉన్న బోండా ఉమ అక్కడి నుంచే పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆయనకు టికెట్ ఇంచు మించు ఖాయమని ప్రచారం జరుగుతోంది. అందుకే లోకేష్ విజయ వాడ సెంట్రలో సీటు కుదరదని వంగవీటికి చెప్పారు.

అయితే విజయవాడ సెంట్రల్ కాకుండా మరో నియోజక వర్గం గురించి వంగవీటి నోరు మెదపలేదట. రాథా వాలకాన్ని గమనించిన లోకేష్ వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా మనదే అధికారం అప్పుడు మీకు ఎమ్మెల్సీ కూడా ఇవ్వగలం అని ఆఫర్ ఇచ్చారట. లోకేష్ చెప్పింది విన్న వంగవీటి చిరునవ్వు నవ్వుతూ క్యారవాన్ నుండి దిగి నెమ్మదిగా వెళ్లిపోయారు. మరి 2024 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ లో ఖాళీ లేదు కాబట్టి విజయవాడ వెస్ట్ నుండి కానీ మరో చోట నుండి కానీ వంగవీటి పోటీ చేస్తారా లేక ఎన్నికల్లో పోటీ చేయకుండా టిడిపి తరపున ప్రచారం చేసి లోకేష్ ఆఫర్ ఇచ్చినట్లు ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీ టికెట్ అందుకోవాలని అనుకుంటున్నారా అన్నవి తేలాల్సి ఉంది. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నందున అప్పటిలోగా రాజకీయ సమీకరణలు ఎలాగైనా మారచ్చు. వంగవీటి రాథా మరోసారి పార్టీ మారినా మారచ్చు అంటున్నారు రాజకీయ పరిశీలకులు. వంగవీటి రాథాకృష్ణకు వ్యక్తిగతంగా మంచి పేరే ఉంది. కాకపోతే తన తండ్రిని హతమార్చారని ఆరోపణలు ఎదుర్కొంటోన్న చంద్రబాబు నాయుడి పార్టీలో ఆయన ఎలా కొనసాగుతున్నారా అన్న విమర్శలూ ఉన్నాయి. కాకపోతే సాయం కోరి ఎవరొచ్చినా ఆపన్న హస్తం అందిస్తారన్న మంచి పేరు కూడా వంగవీటి సొంతం.

లోకేష్ తో మాట్లాడినదానికి కొనసాగింపుగా రాథా చంద్రబాబు నాయుణ్ని కలుస్తారా బోండా ఉమకు చంద్రబాబు నాయుడు ఏమన్నా సద్ది చెబుతారా అన్నది చూడాలి. అయితే వైసీపీ కూడా వంగవీటిని చేరదీసే అవకాశాలు లేకపోలేదు. కొడాలి నాని వల్లభనేని వంశీలు పట్టుబడితే వంగవీటి రాథా మనసు మార్చుకునే అవకాశాలు ఉంటాయి. అపుడు విజయవాడ సెంట్రల్ నుండే రాథాకు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో టికెట్ ఇచ్చే పరిస్థితులూ ఉండచ్చునని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ప్రస్తుతం వివిధ సర్వేలు పరిగణనలోకి తీసుకుంటే వచ్చే ఎన్నికల్లోనూ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. టిడిపి జనసేన పొత్తు పెట్టుకున్నా టిడిపి ఓట్లు నిజాయితీగా జనసేనకు బదలీ కావు కాబట్టి ఆ కూటమికి సీట్లు అనుకున్నట్లుగా రావని వారు అంచనా వేస్తున్నారు. మరి తన భవిష్యత్ ను రాథా ఎక్కడ వెతుక్కుంటారో చూడాలి. అది ఆయన ఇష్టం.