అధికార పీఠంపై ఆశలు పెట్టుకోవడమే తప్ప గెలుపు గుర్రాలు ఎక్కడం తెలియని కొన్ని వర్గాలు ఇప్పుడు రూటు మార్చుతున్నాయి. జరిగిందేదో జరిగిపోయింది.. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి అందలం ఎక్కాలన్న ఆలోచనతో ఆయా వర్గాలు పావులు కదుపుతున్నాయి. అందులో బెజవాడ బెబ్బులి వంగవీటి మోహన్ రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ ఒక్కరని చెప్పాల్సి ఉంటుంది. తండ్రి దారుణ హత్య తర్వాత కాస్త ఆలస్యంగా రాజకీయాల్లోకి వచ్చిన రాధా ఒక్కసారి మాత్రమే 2004లో గెలిచారు. తర్వాత ఓటమే ఆయన చిరునామాగా మారిన తరుణంలో ఈ సారి గెలిచి తీరాల్సిందేనన్న పట్టుదలతో ఆయన పావులు కదుపుతున్నారు.
2024 ఎన్నికలు తనకు కూడా పెద్ద సవాలేనని జనసేనాని పవన్ కళ్యాణ్ భావిస్తున్న తరుణంలో రాధా ఆయన పార్టీలోకి రావాలనుకోవడం అందుకు అంగీకారం చెప్పడం వెంటవెంటనే జరిగిపోయాయి. కులాల కుమ్ములాటలకు కేంద్రబిందువైన ఆంధ్రప్రదేశ్ లో రాధా పార్టీ మారడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఎవరికి మోదం ఎవరికి ఖేదమన్న చర్చ కూడా జరుగుతోంది.
కాపు సామాజిక వర్గానికి చెందిన వంగవీటి రాధా రాకతో వేర్వేరు వర్గాల్లో కాపు పార్టీగా పేరు పడిపోయిన జనసేనకు ప్రయోజనం ఉంటుందని కొందరంటున్నారు. పవన్ ను కూడా కొన్ని వర్గాల్లో కాపు నాయకుడిగానే పరిగణిస్తున్న తరుణంలో కాపు ఓట్ల కన్సాలిడేషన్ కోసం రాధాను ఆహ్వానిస్తున్నారన్నది ఒక వాదన. అయితే ఈ సారి మాత్రం కాపు సెంటిమెంట్ కొంతేనని మార్పు కోసం సమర్థ నాయకత్వాన్ని ఎన్నుకోవడం అసలు సిసలు రాజకీయమని మరికొందరి ఆలోచనా విధానం.
విజయవాడ ప్రాంతంలో వంగవీటి రంగా కుటుంబాన్ని కులవాదులుగా కాకుండా ప్రజా నాయకులుగానే పరిగణిస్తున్నారు. ఇంత కాలం ఏపీలో ఉన్న బహుకొద్దిమంది పొలిటికల్ యూత్ ఐకాన్స్ లో రాధా కూడా ఒకరుగానే చెప్పుకోవాలి. గత మూడేళ్లుగా అనివార్య కారణాలతో రాధా రాజకీయ జనజీవన స్రవంతిలో కనిపించకపోయినా టైగర్ జిందా హై అన్నట్లుగా త్వరలోనే విజృంభించే అవకాశం ఉందని చెప్పక తప్పదు.
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కాపులు సంతోషపడినప్పటికీ ఆయన్ను కాపు నాయకుడిగా జనం పరిగణించలేదు. ఎన్నికల్లో ప్రజారాజ్యం ఓటమికి కారణాలు వేరే ఉన్నాయనే చెప్పారు. ఆ తర్వాత 2019లో జనసేన ఓటమికి కూడా ఓట్ల చీలికే కారణమని చెప్పక తప్పదు. ఇప్పుడు సీన్ మారింది. కొన్ని పార్టీలతో విసిగిపోయిన జనం జనసేనకు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దామనుకుంటే మాత్రం రాజకీయాలు మారిపోవడం ఖాయం. అలాంటి సందర్భంలో రాధా చేరిక అదనపు ఆకర్షణగానే ఉంటుంది. రాధాకు ఎలాంటి సినిమా గ్లామర్ లేదు. ఆయనది ఫక్తు పొలిటికల్ గ్లామరనే చెప్పాలి. రాధా రాజకీయ అరంగేట్రం చేసినప్పుడు ఆయన వెంట కొందరే రంగా అనుచరులున్నారు. విజయవాడ యూత్ ఆయనతో నడిచింది అందుకే 2004 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నుంచి ఆయన గెలిచారు.
టీడీపీలో రాధాకు తగిన ప్రాధాన్యం లభించకపోవడం చెప్పుకోదగిన అంశమే అవుతుంది. ముందు నుంచి పార్టీలో ఉన్న బోండా ఉమ కోసం టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన్ను బుద్ధి పూర్వకంగా పక్కన పెట్టారని చెప్పక తప్పదు. ఈ సారి కూడా బోండా ఉమకే విజయవాడ సెంట్రల్ టికెట్ దక్కుతుందని తెలిసి రాధా సైకిల్ పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పుకోవాలి. అంటే విజయవాడ సెంట్రల్ సహా ఉమ్మడి కృష్ణా జిల్లాలో రాధా వర్గం టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉంటుందనుకోవాల్సిందే.
రాధా పార్టీ మారడంలో అనేక అంతర్గీనమైన సందేశాలున్నాయి. టీడీపి జనసేన పొత్తు కుదిరితే ఏమవుతుంది, కుదరకపోతే అప్పుడేమవుతుందన్న చర్చ కూడా జరుగుతోంది. రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే జనసేనకే ఎక్కువ అవకాశాలుంటాయి ఎందుకంటే ఇప్పుడు స్థానిక టీడీపీ నాయకులకంటే రాధాకే ఎక్కువ పరపతి ఉందని అంగీకరించకతప్పదు. పైగా కేశినేని నాని, బుద్ధా వెంకన్న, దేనినేని ఉమ లాంటి వాళ్లు పార్టీని తలోవైపు లాగుతూ టీడీపీ పరువును కృష్ణలో కలుపుతున్నారు. జనసేనకు ఆ ఇబ్బంది లేదు. కొత్తగా చేరిన రాధా పాతవారికంటే సమర్థంగా పనిచేయగలరన్న విశ్వాసమూ ఉందని చెబుతున్నారు. టీడీపీ జనసేన పొత్తు కుదిరితే రాధా కారణంగా రెండు పార్టీలకు ప్రయోజనం కలుగుతుంది.