వంగవీటి రాధా కృష్ణ ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన రెండో తరం నాయకుడు. ఇప్పుడు ఆయన టీడీపీలో ఉన్నప్పటికీ నాలుగు పార్టీలు మారిన ఘనుడు. ఈ సారి ఏ పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వకపోయినా టీడీపీ తరపున తన వంతు ప్రచారం చేస్తున్నారు. రాధా రాజకీయ భవిష్యత్తుపై విజయవాడ వర్గాల్లో పెద్ద చర్చే జరుగుతోంది. కాకపోతే చంద్రబాబు ఆయనకు పెద్ద హామీనే ఇచ్చారని, అందుకే రాధ మౌనంగా పనిచేసుకుపోతున్నారని చెబుతున్నారు….
విజయవాడకు చెందిన వంగవీటి మోహన్ రంగాకు కాపు సామాజికవర్గం నేతగానే కాకుండా అందరివాడు అన్న పేరు ఉంది. ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో ఆయన కీలక నాయకుడిగా కూడా ఉండేవారు. ఎమ్మెల్యేగా ఎన్నికయింది ఒకసారే అయినా.. తెలుగు రాజకీయాలనే షేక్ చేసే స్థాయికి చేరారు. కానీ ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యారు. ఆయన వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన రాధాకృష్ణ.. సరైన రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో విఫలం చెందడంతో యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్నారు. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తొలి ఎన్నికల్లో గెలిచినా.. మరో రెండు ఎన్నికల్లో ఓడిపోయారు. మరో రెండు ఎన్నికల్లో ఏ పార్టీ టికెట్ దక్కకుండా పోయారు. అయితే దీనికి రాధాకృష్ణ స్వయంకృతాపమే కారణమని, స్థిరంగా ఉండకపోవడంతో ఎవరూ పట్టించుకోవడం లేదని చెబుతారు..
వైసీపీలో తనకు తగిన గౌరవం లభిస్తుందని రాధా ఎదురు చూసి అభాసుపాలయ్యారు. ఆయన కోరుకున్నది కాకుండా వేరే నియోజకవర్గం కేటాయించేందుకు జగన్ సిద్ధం కావడంతో రాధాకు ఏమి తోచలేదు. ఇప్పుడు టీడీపీలో కూడా అదే పరిస్థితి ఎదురైనప్పటికీ సంయమనం పాటించడం ద్వారా అనుకున్నది సాధించాలని రాధా భావిస్తున్నారు…
వైసీపీ ఆవిర్భవించినప్పుడు రాధా ఆ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో వరుసగా రెండు ఎన్నికల్లో ఓటమి చవి చూడడంతో రాధా పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.2019 ఎన్నికల్లోవిజయవాడ తూర్పు నియోజకవర్గ టికెట్ కోసం పట్టుపట్టారు . జగన్ మాత్రం మచిలీపట్నం ఎంపీ సీటు ఆఫర్ ఇచ్చారు. దానిని అవమానంగా భావించిన రాధా వైసీపీని వీడారు. తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా మారారు. కానీ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. వైసీపీ అధికారంలోకి వచ్చింది. అయితే గత ఐదు సంవత్సరాలుగా ఆయన టీడీపీలోనే ఉన్నారు. అంటీ ముట్టనట్టుగా కొనసాగుతున్నారు. వైసీపీకి చెందిన కొడాలి నాని వల్లభనేని వంశీ మోహన్ ఆయనకు సన్నిహిత మిత్రుడు. ఐనా వైసీపీ వైపుకు వెళ్లకుండా టీడీపీలో ఉన్నారు. లోకేష్ పాదయాత్రలో సైతం పాల్గొన్నారు. ఇప్పుడాయన కొన్ని నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఆయన మీటింగులకు జనం విపరీతంగా వస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు ఆయనకు పెద్ద హామీ ఇచ్చారని టీడీపీ వర్గాలు చెబుతున్నారు. పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ లేదా శక్తిమంతమైన నామినేటెడ్ పదవి ఇస్తారని చర్చ జరుగుతోంది. దానితో ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం రాధా విపరీతంగా కష్టపడుతున్నారు…
నిజానికి రాధా మంచి నాయకుడు. పది మందిని కలుపుకుపోయే తత్వమున్న నేత. విజయవాడలో ఆయనకంటూ ఓ ఫాలోయింగ్ ఉంది. ఐనా ఇప్పటి వరకు కాలం కలిసి రాలేదు. ఎన్నికల్లో టీడీపీ గెలిచిన తర్వాత మాత్రం సీన్ మారిపోతుందని రాధా అనుచరుల నమ్మకం. ఆయన చక్రం తిప్పుతారని వాళ్లు అంటున్నారు. చూడాలి మరి…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…