వైఎస్సార్ ఎన్టీఆర్ లేనా వంగవీటిని గౌరవించరా: GVL

By KTV Telugu On 18 February, 2023
image

ఎవరు అధికారంలో ఉంటే వారికి నచ్చిన పేర్లను ప్రభుత్వ పథకాలకు పెడుతూ ఉంటారు. అధికారంలో లేని వాళ్లు ఆ పేర్లను తప్పుబడుతూ ఉంటారు. ఈ పేర్ల పంచాయతీ మన దేశంలో సర్వసాధారణం. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ బిజెపి ఎంత సేపూ ఎన్టీయార్, వై.ఎస్.ఆర్. పేర్లేనే ఇంకెవరి పేర్లూ పనికిరావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి ఆయన పార్టీ నుండే కౌంటర్ పడింది. అయితే ఇది ఒక్క ఏపీకే పరిమితమైంది కాదు.ఏదో ఒక పార్టీకి పరిమితమైంది కాదు.ఈ పద్ధతి మారాలంటున్నారు మేథావులు. ఆంధ్ర ప్రదేశ్ లో ఓ జిల్లాకు దివంగత ఎన్టీయార్ పేరు పెట్టింది వై.ఎస్.ఆర్‌.కాంగ్రెస్ ప్రభుత్వం. అంతకు ముందు కడప జిల్లాకు దివంగత వై.ఎస్.ఆర్. జిల్లా పేరు పెట్టింది నాటి ప్రభుత్వం. అప్పుడు వీటిపై ఎలాంటి అభ్యంతరాలూ రాలేదు. చాలా కాలం తర్వాత ఇపుడు ఏపీ బిజెపి నేత జి.వి.ఎల్.నరసింహారావు ఈ జిల్లాలకు వారి పేర్లపై అభ్యంతరం లేవనెత్తారు.

ఏపీలో ఏ పథకానికైనా ఎన్టీయార్, వై.ఎస్.ఆర్. ల పేర్లు తప్ప ఇంకెవరి పేర్లూ ఎందుకు పెట్టడం లేదు అంటూ నిలదీశారు. ఎన్టీయార్ పేరును ఓ జిల్లాకు పెట్టారు. వై.ఎస్.ఆర్. పేరును మరో జిల్లాకు పెట్టారు. మరి వంగవీటి రంగా పేరు వీళ్లకి ఎందుకు గుర్తురాలేదు. ఆయన పేరు కూడా ఓ జిల్లాకు పెట్టాలి కదా అంటూ జీవీఎల్ ప్రశ్నించారు. చిత్రం ఏంటంటే ఏపీలో బిజెపి 1999 నుండి బాగా యాక్టివ్ గా ఉంది. ఇంచుమించు పాతికేళ్లుగా ఏపీలో వ్యవహారాలు నడుపుకొస్తోంది. ఇన్నేళ్లలో ఏ నాడూ కూడా వంగవీటి రంగా పేరును బిజెపి ప్రస్తావించలేదు. మరి ఉన్నట్లుండి ఆయన పేరు ఎందుకు స్మరిస్తోందో అందరికీ తెలిసిందే. ఏపీలో కాపు సామాజిక వర్గాన్ని బుట్టలో వేసుకోవాలని చూస్తోన్న ఏపీ బిజెపి కొంత కాలంగా కాపులను ఆకర్షించే ప్రకటనలు వ్యాఖ్యలతో దూసుకుపోతోంది.

జి.వి.ఎల్. వ్యాఖ్యలకు ఆయన పార్టీ నుండే కౌంటర్ పడింది. ఎన్టీయార్ తెలుగువారి ఆత్మగౌరవాన్ని దేశమంతా చాటారన్న బిజెపి నాయకురాలు పురంధేశ్వరి వై.ఎస్.ఆర్. ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలతో పేదల హృదయాల్లో నిలిచిపోయారు కాబట్టే వారి పేర్లను పెట్టారని చెప్పుకొచ్చారు. దేశాన్ని ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏ పథకాన్ని ప్రారంభించినా ఏ కొత్త ప్రాజెక్టు నిర్మించినా వాటికి గాంధీ, నెహ్రూల పేర్లే పెట్టేది. విమానాశ్రయాలు, విద్యాసంస్థలు, పరిశోధనా సంస్థలన్నింటికీ అయితే జవహర్ లాల్ నెహ్రూ పేరు లేదంటే ఇందిరా, రాజీవ్ గాంధీల పేర్లు పెట్టేశారు. దేశంలో కొన్ని వేల సంఖ్యలో సంస్థలకు ఈ మూడు పేర్లే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. స్వాతంత్య్ర సమరయోధులు చాలా మంది ఉన్నా వారిలో ఎవరి పేరునూ కాంగ్రెస్ పార్టీ ఏ పథకానికీ పెట్టలేదు. దీనిపై ఆ పార్టీని ఎవరూ ప్రశ్నించిందీ లేదు.

కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక గాంధీల పేర్లకు గండి పడింది. నిజానికి బిజెపి కన్నా ముందుగానే గాంధీల పేర్లను పక్కన పెట్టింది కాంగ్రెస్ ప్రధాని పి.వి.నరసింహారావే. పి.వి. హయాంలో కేంద్ర ప్రభుత్వ పథకాలకు గాంధీల పేర్లు కాకుండా ప్రధాని ఆవాస్ యోజన, పి.ఎం.ఆర్.వై. పథకాలను ప్రారంభించారు. వాటికి ప్రధాని అన్న హోదానే పెట్టారు తప్ప వ్యక్తుల పేర్లు పెట్టలేదు. అందుకే సోనియా, రాహుల్ గాంధీలకు పి.వి.నరసింహారావు అంటే కడుపు మంట. ఆయన మరణానంతరం ఆయన పార్ధివ దేహాన్ని ఏ.ఐ.సి.సి. కార్యాలయంలోనికి కూడా రానీయకుండా అడ్డుకుని ఆదరా బాదరాగా హైదరాబాద్ పంపేసింది టెన్ జన్ పథ్. అందరు ప్రధానులకూ ఢిల్లీలో స్మారక ఘాట్ లు ఉన్నాయి. ఒక్క పి.వి.నరసింహారావుకే మాత్రం ఆ గౌరవం లేకుండా చేసింది సోనియా గాంధీ.

ఇక విభజిత ఏపీకి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ప్రతీ పథకానికి తన పేరు పెట్టుకునే సంప్రదాయానికి ఆజ్యం పోశారు. చంద్రన్న కానుక, చంద్రన్న తోఫా అంటూ ప్రతీ పథకానికీ తన పేరు పెట్టేసుకున్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన జగన్ మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు బాటలోనే జగనన్న అమ్మవొడి, జగనన్న గోరు ముద్ద, జగనన్న విద్యాకానుక అంటూ తన పేరు మీదనే పథకాలు పెట్టుకున్నారు. ఇలా కొందరి పేర్లనే ప్రజాధనంతో చేపట్టే కార్యక్రమాలకు పెట్టడం పై మేథావులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తోన్నా ఎవరూ వాటిని పట్టించుకోవడం లేదు. ఇటు తెలంగాణాలోనూ అంతే. కేసీయార్ కంటి వెలుగు అంటూ పథకాలకు తన పేరు పెట్టుకున్నారు ముఖ్యమంత్రి కల్వ కుంట్ల చంద్రశేఖరరావు.

2004లో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అని పేరు పెట్టారు. దానిపై టిడిపి గగ్గోలు పెట్టింది. దానికి ఎన్టీయార్ పేరు పెట్టాలని పట్టుబట్టింది. ఆ మధ్య ఏపీలో ఎన్టీయార్ హెల్త్ యూనివర్శిటీ పేరును డాక్టర్ వై.ఎస్.ఆర్. హెల్త్ యూనివర్శిటీగా మార్చింది ప్రభుత్వం. దానికి కారణాన్ని కూడా వివరించింది ప్రభుత్వం. వైద్య రంగానికి వై.ఎస్.ఆర్. ఇచ్చిన ప్రాధాన్యతకు గుర్తింపుగానే హెల్త్ యూనివర్శిటీకి ఆయన పేరు పెట్టామని చెప్పింది. రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. తెలుగుదేశం హయాలో ఒక్క వైద్య కళాశాల కూడా ప్రభుత్వ హయాంలో చేపట్టలేదు. అందుకే వై..ఎస్.ఆర్. పేరును హెల్త్ యూనివర్శిటీకి పెట్టామన్న ప్రభుత్వం విజయవాడ కేంద్రంగా ఏర్పడిన జిల్లాకు ఎన్టీయార్ పేరు పెట్టి నివాళి అర్పించింది.

కాంగ్రెస్ హయాం లో ప్రారంభించిన రాజీవ్ గాంధీ ఆరోగ్య శ్రీ పథకాన్ని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక పేరు మార్చి ఎన్టీయార్ ఆరోగ్యశ్రీగా మార్చారు. పేర్ల మార్పులు ఇక్కడే కాదు. అన్ని చోట్లా ఉన్నాయి. గుజరాత్ లో ఏడాది క్రితం కొత్త ఆధునికీకరించిన మొతేరా స్టేడియానికి సర్దార్ పటేల్ పేరు మార్చేసి నరేంద్ర మోదీ పేరు పెట్టారు బిజెపి నేతలు. ఎవరు అధికారంలో ఉంటే వారి హవా నడుస్తుంది. మొన్న మొన్ననే ఢిల్లీలోని మోఘల్ గార్డెన్స్ పేరు కూడా మార్చేసి అమృత ఉద్యాన్ గా కొత్త పేరు పెట్టింది కేంద్ర ప్రభుత్వం. పేరు మార్పులకు ఒక ముగింపు తేదీ అంటూ ఏదీ ఉండదు. అదో నిరాటంక ప్రక్రియ. రేప్పొద్దున రాహుల్ గాంధీ ప్రధాని అయితే చాలా పథకాలకు సోనియా గాంధీ పేరు పెట్టచ్చు. లేదంటే కొత్త ట్రెండ్ ప్రకారం కొన్నింటికి తన పేరు కూడా పెట్టుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు.
పేరులోనేముంది అని అనుకోవద్దు. ఇండియాలో అన్నీ పేరులోనే ఉంటాయి. అంటున్నారు రాజకీయ పరిశీలకులు.