కొన్ని పొలంగట్ల పంచాయతీలు ఎంతకీ తేలవు. కొన్ని తరాలు కొట్టుకు చస్తూనే ఉంటాయి. ఇక ఇరుగూపొరుగూ మధ్య మాట పట్టింపులు వస్తే గాలికి ఓ కాగితం ఎగిరొచ్చినా గొడవే. రాజకీయాలూ అంతే. అంతా బావుంటే సర్దుకుపోతారు. అనుమానాలు పంతాలు పెరిగితే తుమ్మిన దగ్గినా దురుద్దేశాలు ఆపాదించుకుంటారు. మైలవరంలో అదే జరుగుతోంది. తన నియోజకవర్గంలో మంత్రి జోగి రమేష్ జోక్యం పెరిగిందని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ డౌట్. కేవలం అనుమానమేం కాదు. జోగి రమేష్ కూడా గమ్మునుండే రకమేం కాదు. ఆయన కూడా వేలు పెడుతూనే ఉన్నాడు. దీంతో రెండేళ్లనుంచీ ఆ ఇద్దరి మధ్య కీచులాటలు కామనైపోయాయ్.
ఎందుకు ఎమ్మెల్యే అయ్యానా అని వసంత బాధపడుతుంటారు. నలుగురు గొట్టంగాళ్లని వెంటేసుకుని తిరిగితేనే లీడర్లా అంటూ ఎత్తిపొడుస్తుంటారు. ఆయన ఆగ్రహించినా ఆవేదన చెందినా అది జోగి రమేష్ గురించే. ఆ మధ్య అయితే వసంత టీడీపీలోకి వెళ్తారని ఆయన తండ్రి నాగేశ్వరరావు వ్యాఖ్యలు అందులో భాగమేనన్న ప్రచారం జరిగింది. దీంతో వసంత కృష్ణప్రసాద్‌ని వైసీపీ పక్కన పెట్టేస్తుందనుకున్నారు. కానీ వెంకటగిరి నెల్లూరురూరల్ ఎమ్మెల్యేల తిరుగుబాట్ల తర్వాత జగన్ కూడా మొండిగా పోవాలనుకోవడం లేదు. అవకాశం ఉన్నచోట సామరస్యంగా పరిష్కరించాలనుకుంటున్నారు. వెళ్లాలని ఫిక్స్ అయితే ఎవరూ ఆపలేరు. కానీ డోలాయమానంలో ఉన్న వసంతలాంటివారికి నచ్చజెప్పి భరోసా ఇస్తే మారతారన్న నమ్మకంతో ఉన్నారు.
మైలవరం పంచాయితీ మరోసారి సీఎం దగ్గరికి వచ్చింది. జోగి రమేష్‌పై అసంతృప్తితో ఉన్న వసంతను సీఎం వైఎస్ జగన్ పిలిపించి మాట్లాడారు. దాదాపు అరగంటసేపు జరిగింది మీటింగ్. షరామామూలుగానే జోగి రమేష్‌పై సీఎంకి వసంత ఫిర్యాదుచేశారు. వివాదాలకు దూరంగా ఉండే తనకు ఈ అనుభవాలతో రాజకీయాలపై ఆసక్తి పోయిందని సీఎంకి చెప్పుకున్నారు. సీఎం కూడా ఓపిగ్గా విని పాతిక ముప్ఫై ఏళ్లు తనతో కలిసి ప్రయాణం చేస్తావంటూ వసంతకి భరోసా ఇచ్చారు. మైలవరం-నందిగామ నియోజకవర్గాల్లో మరొకరు వేలు పెట్టకుండా చూద్దామని చెప్పటంతో ప్రస్తుతానికి పంచాయితీకి తెరపడినట్లే కనిపిస్తోంది. బయటికొచ్చాక వసంత కూడా అదే చెబుతున్నారు. తానెవరి నియోజకవర్గంలోనూ జోక్యంచేసుకోనని తన నియోజకవర్గంలో మరొకరు వేలుపెడితే సహించేది లేదని అన్నారు. అంటే బంతిని జోగి రమేష్ కోర్టులోకి తన్నేశారన్నమాట.