వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుటుంబం.. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చింది. జగన్ దగ్గర మర్యాద దక్కడం లేదన్న ఆగ్రహం, ఆవేశంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ముందు టీడీపీలోకి మారిపోయారు. తన క్లీన్ ఇమేజ్, జగన్ రెడ్డి పట్ల ఉన్న వ్యతిరేకత కారణంగా నెల్లూరు లోక్ సభా స్థానం నుంచి వేమిరెడ్డి సునాయాసంగా గెలిచారు. ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి కోవూరు నుంచి ఎమ్మెల్యే అయ్యారు.ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేయడం వెనుక వేమిరెడ్డి పరపతి కూడా ఉందని చెబుతున్నారు. పైగా వేమిరెడ్డి ఫ్యామిలీ ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు ఖర్చు చేసింది….
నెల్లూరు జిల్లా రాజకీయాలను ఊపేసే ఘటన ఒకటి ఇప్పుడు జరిగింది. నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. డీఆర్సీ సమావేశంలో జిల్లాకు చెందిన మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి సహా అంతా హాజరయ్యారు. అలాగే నెల్లూరు జిల్లా ఇంఛార్జి మంత్రి ఫరూఖ్ కూడా అటెండ్ అయ్యారు. ఈ సమావేశానికి జిల్లాకు చెందిన పది మంది ఎమ్మెల్యేలు జిల్లాకు చెందిన అధికారులు అంతా హాజరయ్యారు. ఇక వేదిక మీద మంత్రులను పిలిచిన ఆర్డీవో వేమిరెడ్డి పేరు పిలవకపోవడంతో ఆయన తీవ్ర అవమానానికి గురి అయ్యారు. వేదిక నుంచి దిగి ఆయన కారెక్కి వెళ్ళిపోయారు. దీనిని గమనించిన మంత్రులు నారాయణ ఆనం రామనారాయణరెడ్డి ఆయనను బతిమాలారు. కానీ వేమిరెడ్డి అయితే వినలేదు.ఆయన భార్య ప్రశాంతి రెడ్డి కూడా వెళ్లిపోయారు..
వేమిరెడ్డికి కనీస ప్రోటోకాల్ ఇవ్వలేదన్నది నిజం. ఎమ్మెల్యేలకు బోకే ఇచ్చి ఎంపీకి ఇవ్వకపోవడం తప్పే అవుతుంది. కాకపోతే వేమిరెడ్డి అలకే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అసలు వేమిరెడ్డి ఇలాంటి విషయాలు పట్టించుకుంటారా అన్న ప్రశ్న తలెత్తుతోంది. వైసీపీలో తనకు గౌరవం లభించడం లేదన్న ఏకైక కారణంతో వేమిరెడ్డి పార్టీ మారి టీడీపీలోకి వచ్చారన్నది నిజం.కాకపోతే చిన్న విషయానికి కూడా అలుగుతారా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశం.
వేమిరెడ్డి ఒక వ్యాపారవేత్త, పారిశ్రామికవేత్త. విదేశాల్లో వ్యాపారాలున్నాయి.సొంత ఫ్లైట్స్ లో విదేశాలకు వెళ్తూ అక్కడ ఎక్కువ కాలం ఉంటారు. నెల్లూరు ప్రజలకు సేవ చేస్తున్నప్పటికీ జిల్లాలో ఎక్కువ కాలం కనిపించరు. అయితే ఈ సారి గెలిచిన తర్వాత మాత్రం నెల్లూరు రాజకీయాలపై ఎక్కువ ఏకాగ్రత చూపాలని వేమిరెడ్డి డిసైడయ్యారట. రాజకీయంగా తన హవా చాటాలనుకుంటే జిల్లాలో నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి అడ్డుకుంటున్నారని వేమిరెడ్డి ఆందోళన చెందుతున్నారట. ఆనం కాస్త నయమని, జిల్లాల్లో పార్టీని, ప్రభుత్వాన్ని మంత్రి నారాయణ చేతుల్లోకి తీసుకున్నారని వేమిరెడ్డి ఆగ్రహం చెందుతున్నారట. ఎప్పుడు వాళ్లకేనా, మాకు ఛాన్సులు రావద్దా అని వేమిరెడ్డి ప్రశ్నిస్తున్నారట. అందుకే ఇకపై ఎక్కువ సమయం జిల్లాలోనే ఉంటూ రాజకీయాల్లో క్రియాశీలంగా పనిచేయాలని కోరుకుంటున్నారు. ఆ దిశగా ప్రోటోకాల్ వ్యవహారాన్ని, తనకు బోకే ఇవ్వలేదన్న అంశాన్ని మీడియా సాక్షిగా ఎక్స్ పోజ్ చేసి జిల్లా పార్టీని ఇరకాటంలో పెట్టారని చెబుతున్నారు. ఇదీ ఆరంభం మాత్రమేనని.. భవిష్యత్తులో మరిన్ని ఝలక్కులు ఉంటాయని వేమిరెడ్డి అనుచరులు చెబుతున్నారు. ఇప్పటికే భార్య ప్రశాంతి రెడ్డికి టీటీడీ బోర్డు మెంబర్ ఇప్పించుకున్న వేమిరెడ్డి…ఇకపై ఎలాంటి పావులు కదుపుతారో చూడాలి…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…