సాయి..ఏదోటి చేయి..! – Vijaysai Jagan YSRCP

By KTV Telugu On 8 March, 2024
image

KTV TELUGU :-

నాకు  నువ్వే గతి.. ఆ ఉమ్మడి జిల్లాలో నువ్వే గట్టెక్కించాలి అని వేడుకోవడం ఇప్పుడు జగన్ వంతయ్యింది. ఒకపక్క పడుంటాడులే, మనోడే కదా ఎంతో కొంత సంపాదించుకుంటాడులే అనుకున్న  విజయసాయి రెడ్డినే ఇప్పుడు బతిమాలుకోవాల్సిన వచ్చింది. అన్యధా శరణం  నాస్తి అన్నట్లుగా ఇప్పుడు నెల్లూరు ఆయన చేతిలో పెట్టి ఫలితం కోసం జగన్ ఎదురు చూస్తున్నారు…

ఆనం వెళ్లిపోయాడు. కోటంరెడ్డి వెళ్లిపోయాడు. వేమిరెడ్డి కూడా వెళ్లిపోయాడు. వెరసి నెల్లూరు పెద్దారెడ్లంతా మూకుమ్మడిగా వైసీపీని వదిలేశారు. దానితో సింహపురిలో జగన్ పార్టీకి గడ్డుకాలం మొదలైంది. వర్తమానం అనుమానాస్పదమైంది. భవిష్యత్తు ఆగమ్యగోచరమైంది. గతం సరే. ఇప్పటి సంగతేంటని వైసీపీ నేతలు ప్రశ్నించుకుంటున్నారు.  గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో నెల్లూరు జిల్లాలోని 10 స్థానాల‌కు ప‌ది సీట్లూ వైసీపీ గెలుచుకుంది. కానీ, ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేదు. ఎందుకంటే.. ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ కూడా ఆపార్టీకి దూర‌మ‌య్యారు. నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ను కూడా అక్కడ కాకుండా నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా పంపించారు. మరి నెల్లూరు పోటీలో గట్టెక్కేదెలా అన్న ప్రశ్న వచ్చినప్పుడు..జగన్ కు వేణుంబాక్కం విజయసాయి రెడ్డి గుర్తుకు వచ్చారు . తిరిగేది  ఢిల్లీ, హైదరాబాద్, వైజాగ్, విజయవాడ అయినప్పటికీ సొంతూరు మాత్రం నెల్లూరేనని గుర్తుకొచ్చింది. ప్రత్యక్ష రాజకీయాల్లో లేకుండా రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిని రంగంలోకి దించితే బావుంటుందా లేదా అన్న సమీక్ష చేసుకునే కదనరంగంలోకి దించారని  చెబుతున్నారు. వేర్వేరు  ప్రాంతాల్లో ఇంచార్జీగా పనిచేసిన  అనుభవంతో పార్టీ శ్రేణులకు ఆయన దగ్గరగా ఉన్నారని ఆ క్రమంలో గ్రాస్ రూట్ టచ్ ఖాయమని జగన్ అంచనా వేసుకుంటున్నారు. అందుకే నెల్లూరు పార్లమెంటు ఇంచార్జీగా ఆయన్ను నియమించారు….

విజయసాయి ఏం చేస్తున్నారు. ఆయన ఏం చేయాలి. జగన్ తీసుకున్నది వ్యూహాత్మక నిర్ణయమేనా . పార్టీ శ్రేణులు ఆయనకు సహకరిస్తాయా….

విజయసాయికి ట్రబుల్ షూటర్ అని  పేరు ఉంది. పార్టీలో ఉన్న వారిలో మెజార్టీ పక్షం ఆయన మాట వింటారు. అయినా ఇప్పుడున్న పరిస్థితులు వేరు. పార్టీలో జనం వేరే దారి చూసుకుంటున్నారు. ఉండే వారి కంటే జంపు జిలానీలు ఎక్కువై పోయారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పార్టీ దాదాపుగా ఖాళీ అయ్యింది. నాయకులు వెళ్లిపోవడంతో దిశానిర్దేశం  లేక కేడర్ నానా తంటాలు పడుతోంది. దిక్కుతోచని  స్థితిలో కొట్టుమిట్టాడుతోంది.ఎన్నికల పోలింగ్ తేదీ లోపు నెల్లూరు పార్లమెంటు ఇంఛార్జీగా పార్టీకి నూతన జవసత్వాలు తీసుకురావాల్సిన బాధ్యత విజయసాయిరెడ్డిపై పడింది. ఇంతకాలం ఆయన చేసిన రాజకీయం వేరు, ప్రస్తుత రాజకీయం  వేరు అన్న కోణంలో ఆలోచించాలి. నెల్లూరు లోక్ సభ బరిలో తాను నిలబడి గెలిస్తే సరిపోదు. అందరినీ కలుపుకుపోతూ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించే బాధ్యత ఆయన తీసుకోవాలి. విజయసాయి నియామకం జరిగిన తక్షణమే మార్పు కనిపించకపోయినా, క్రమంగా పరిస్థితిని దారులోకి తెచ్చుకోవాలి.

మొత్తమ్మీద కీలక నేతలంతా చేజారినా నెల్లూరులో పట్టు నిలుపుకోడానికి సీఎం జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. విజయసాయిరెడ్డితో మంత్రాంగం మొదలు పెట్టారు. నేతలు పార్టీ వీడినా, కేడర్ చెదిరిపోకుండా కాపాడే బాధ్యత విజయసాయికి అప్పగించారు. మ‌రి ఏ మ‌ర‌కు ఆయ‌న స‌రిదిద్దుతారో చూడాలి.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి