కన్నా బాటలోనే విష్ణుకుమార్ రాజు

By KTV Telugu On 23 February, 2023
image

ఏపీ బీజేపీలో ముసలం మొదలైంది. ఒక్కొక్కరుగా పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. టీడీపీ జనసేన పొత్తు ఖాయమని అనుకుంటున్న తరుణంలో బీజేపీకి చెందిన కొందరు నేతలు ముందే సర్దుకుంటున్నారు. బీజేపీలో ఉంటే గెలవలేమనే భావనతో పక్క పార్టీల్లో బెర్త్ కన్ఫామ్ చేసుకుంటున్నారు. ఇప్పటికే వీర్రాజు నాయకత్వాన్ని తిట్టిపోస్తూ బీజేపీకి గుడ్ బై చెప్పిన కన్నా లక్ష్మీనారాయణ 23న బాబు సమక్షంలో సైకిల్ ఎక్కేందుకు సిద్ధమయ్యారు. ఆ షాక్ నుంచి తేరుకోకముందే ఆయన బాటలోనే మరికొందరు నేతలున్నారు పార్టీ మారనున్నారన్న ప్రచారం కమలనాథులను కలవరపెడుతోంది. మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా బీజేపీని వీడనున్నారనే రూమర్స్ వస్తున్నాయి.

కన్నా ఇంటికి వెళ్లిన విష్ణుకుమార్ రాజు సొంత పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీలో పరిస్థితులు బాగోలేవన్నారు. బీజేపీ కార్యకర్తలతో నాయకులతో మాట్లాడే తీరిక అధిష్టానానికి లేదని విమర్శలు గుప్పించారు. పార్టీలో వర్గ విభేదాలపై కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా ఉపయోగం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు పార్టీలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియడం లేదని కామెంట్ చేశారు. పార్టీ శాసనసభాపక్షనేతగా పని చేసిన తన మాటలు వినే వాళ్లు ఎవరు లేరని వ్యాఖ్యానించడంతో విష్ణుకుమార్ రాజు కూడా కన్నా బాటలోనే పయనించేందుకు రెడీ అవుతున్నారని ఊహాగానాలు మొదలయ్యాయి. బీజేపీపై బహిరంగ విమర్శలు చేయడం కన్నా ఇంటికి వెళ్లి మంతనాలు జరపడం లాంటి పరిణామాలతో ఆయన సైకిల్ ఎక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

2014లో బీజేపీ తరపున విశాఖ నార్త్ నుంచి గెలిచిన విష్ణుకుమార్ రాజు శాసనసభ పక్ష నేతగా కూడా కొనసాగారు. 2019 ఎన్నికల్లో బీజేపీ నుంచి అదే స్థానంలో పోటీ చేసి గంటా చేతిలో ఓడిపోయారు. అయినా నియోజకవర్గంలో బీజేపీ బాధ్యతల్ని చూస్తున్నారు. గత ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి గెలిచిన గంటా శ్రీనివాసరావు ఈసారి భీమిలిలో పోటీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దాంతో తెలుగుదేశం పార్టీలో చేరితే తనకు టిక్కెట్ ఖాయమని నమ్ముతున్నారు విష్ణుకుమార్ రాజు. టీడీపీ నుంచి గ్రీన్ సిగ్నల్ అందిన వెంటనే రాజు పార్టీ కండువాను మార్చేస్తారంటున్నారు. ఇక పురంధేశ్వరి కూడా పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చేసిన కామెంట్స్‌కు పురంధేశ్వరి కౌంటర్ ఇవ్వడం కూడా హాట్ టాపిక్‌ అయ్యింది.