సీబీఐ మాజీ జేడీ కూడా.. స్టీల్ ప్లాంట్ గేమ్‌

By KTV Telugu On 17 April, 2023
image

అస‌లే ఎన్నిక‌ల సీజ‌న్‌. అందులో ఉక్కుఉద్య‌మంతో సాధించుకున్న ప‌రిశ్ర‌మ సెంటిమెంట్‌. అందుకే విశాఖ స్టీల్ ప్లాంట్‌పై హైడ్రామా న‌డుస్తోంది. కేంద్రం ఆస్కార్ స్థాయికి త‌గ్గ‌కుండా న‌టిస్తోంది. ఇప్పుడిప్పుడే స్టీల్‌ప్లాంట్‌ని ప్రైవేటీక‌ర‌ణ చేసే ఆలోచ‌న లేద‌ని కేంద్ర ఉక్కుశాఖ స‌హాయ‌మంత్రి చెబుతారు. అబ్బే ప్రైవేటీక‌ర‌ణ ప్ర‌క్రియ‌నుంచి వెన‌క్కి తగ్గలేద‌ని మ‌ళ్లీ కేంద్రం వెంట‌నే ఖండిస్తుంది. ఆ ప్ర‌క్రియ‌ను కూడా ప్రారంభించేస్తుంది. హ‌రిహ‌రాదులు అడ్డుప‌డ్డా కేంద్రం ఆగే ప్ర‌స‌క్తే లేదు. స్వ‌యానా సీఎం వెళ్లి గేటు ద‌గ్గ‌ర అడ్డం ప‌డుకున్నా ఉప‌యోగం ఉండ‌దు. అందుకే ఈ ప‌రిస్థితిని పొరుగు రాష్ట్ర‌మైన తెలంగాణ‌నే కాదు కొంద‌రు రాజ‌కీయ నేత‌లు కూడా అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నారు.

రెండు సంవత్సరాలుగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం సాగుతోంది. కానీ కేంద్రం ఏమాత్రం వెన‌క్కిత‌గ్గ‌లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఈవోఐ కూడా నిర్వ‌హించింది. విశాఖ ఉక్కు పొలిటిక‌ల్ ఎజెండాగా మారిపోవ‌టంతో ఈవోఐకి అనూహ్య స్పందన వచ్చింది. ప్లాంట్ నిర్వహణకు మూలధనం ముడి సరుకులకు మొదట నిధులు ఇచ్చి అనంతరం నిబంధనల ప్రకారం ఉక్కు ఉత్పత్తులను కొనేందుకు ప్లాంట్‌ యాజమాన్యం ఈవోఐ నిర్వహిస్తోంది. 22 సంస్థలు బిడ్డింగులు వేయ‌టం స్పంద‌న బాగుండ‌టంతో ఈవోఐ గ‌డువుని కేంద్రం ఏప్రిల్ 20దాకా పొడిగించింది.

ఈవోఐలో ఆరుగురు అంతర్జాతీయ స్టీల్ ఎక్స్‌పోర్టర్స్ కూడా పాల్గొన్నారు. ఉక్రెయిన్ నుంచి కూడా ఓ ఉక్కు తయారీ సంస్థ ముందుకొచ్చింది. రష్యాతో యుద్ధంతో ప్రస్తుతం ఉత్పత్తి ఆగిపోయిందని ఇప్పుడు నిధులు ఇచ్చి తర్వాత స్టీల్ తీసుకుంటామంటోంది ఉక్రెయిన్ కంపెనీ. జిందాల్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ జిందాల్ ఎంఎస్ అగర్వాల్ వైజాగ్ ప్రొఫైల్స్ నారాయణి ఇస్పాత్ లిమిటెడ్‌తో పాటు పలు కంపెనీలు ఈవోఐలో పాల్గొన్నాయి. అన్నిటికంటే ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేంటంటే సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మినారాయ‌ణ కూడా నేను సైత‌మంటూ ముందుకొచ్చారు. ఓ ప్రైవేటు సంస్థ తరపున సీబీఐ మాజీ జేడీ కూడా బిడ్ వేశారు.

బిడ్ వేయ‌డానికి ముందు ఉక్కు ఫ్యాక్టరీ కార్మికులతో క‌లిసి 20 కిలోమీట‌ర్ల ర్యాలీ నిర్వహించారు సీబీఐ మాజీ జేడీ. EOI కోసం రెండు సీల్డ్ కవర్లలో పత్రాలు దాఖలు చేశారు. స్టీల్ ఫ్యాక్ట‌రీని కాపాడుకునేందుకు సీబీఐ మాజీ జేడీ స‌రికొత్త నినాదాన్ని అందుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ల‌క్ష్మినారాయ‌ణ పిలుపు ఇచ్చారు. ఒక్కొక్కరు 400 రూపాయలు కోసం వెచ్చిస్తే స్టీల్ ప్లాంట్ ఎవ‌రి చేతుల్లోకి పోకుండా కాపాడుకుంటామ‌ని అదే జ‌రిగితే ఇది చ‌రిత్ర‌లో నిలిచిపోతుందంటున్నారు ల‌క్ష్మినారాయ‌ణ‌. బిడ్డింగ్‌లో త‌మ ప్రతిపాదన‌ను తిర‌స్క‌రిస్తే కోర్టుకు వెళ్తామని సీబీఐ మాజీ జేడీ హెచ్చ‌రిస్తున్నారు. ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యంతో క్రౌడ్ ఫండింగ్ సేకరిస్తామ‌న్న ఆయ‌న ప్ర‌య‌త్నం ఫ‌లిస్తుందో లేదో చూడాలి.

కేంద్రం వెన‌క్కితగ్గింద‌నుకుని అది త‌మ ఘ‌నతేన‌ని ప్ర‌క‌టించుకున్న తెలంగాణ ప్ర‌భుత్వం ఏం చేయ‌బోతుంద‌న్న‌ది కూడా ఆస‌క్తిక‌రంగా ఉంది. సింగరేణి అధికారులు విశాఖ స్టీల్‌ప్టాంట్‌పై అధ్య‌య‌నం చేసిన అంశాల‌పై సీఎం కేసీఆర్‌కి నివేదిక స‌మ‌ర్పించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కి నిధులు సమకూరిస్తే లాభాల బాట పట్టే అవకాశముందని సింగ‌రేణి బృందంలోని అధికారులు నివేదించారు. తెలంగాణ ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌కు భారీగా స్టీల్ అవ‌స‌రం ఉండ‌టంతో ఏపీలో బీఆర్ఎస్ బ‌ల‌ప‌డేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం ఏ అడుగు వేస్తుందన్న చర్చ జ‌రుగుతోంది. తెలంగాణ నేత‌ల వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తున్న ఏపీ ప్ర‌భుత్వ పెద్ద‌లు స్టీల్ ప్లాంట్ చేజార‌కుండా ఏం చేయ‌గ‌ల‌మో మాత్రం చెప్ప‌లేక‌పోతున్నారు. ప్రైవేటీక‌ర‌ణ‌కు అంగ‌క‌రించే ప్ర‌స‌క్తే లేదంటున్నా ఆ ప్ర‌క్రియ ఆగ‌ద‌న్న విష‌యం అంద‌రికీ అర్ధ‌మైపోయింది.