వైఎస్ జగన్ ద్విముఖ వ్యూహం

By KTV Telugu On 2 March, 2023
image

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అప్పుల భారం పెరిగిపోతున్న తరుణంలో పెట్టుబడులను ఆహ్వానించి నిధుల సమీకరణకు ప్రయత్నిస్తోంది. ఆ దిశగా గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్, జీ -20 సదస్సు లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ నెల 3, 4 తేదీల్లో విశాఖ వేదికగా జరిగే పెట్టుబడుల సదస్సుపై అన్ని వర్గాల దృష్టి కేంద్రీకృతమైంది. పెట్టుబడుల సదస్సులో బడా కంపెనీలను రాష్ట్రానికి రప్పించే ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్రప్రభుత్వం అంటోంది. సిటీ ఆఫ్ డెస్టినీగా పిలిచే సాగర నగరానికి అంతర్జాతీయ గుర్తింపు లభించే విధంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ఏపీలో ఉన్న వనరులు, ఏపీ శక్తిసామర్ధ్యాలు, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీలతో పాటు కల్పిస్తున్న అవకాశాలు ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ లో వివరించడం ద్వారా విశాఖ ఇమేజ్ ను మరింతగా పెంచాలని జగన్ ప్రభుత్వం తీర్మానించింది.

అంబానీ అదానీతో పాటు అమెరికా యూరప్ గల్ఫ్ అగ్నేయాసియా సహా పలు దేశాల పారిశ్రామిక వాణిజ్య ప్రతినిధులు ఈ పెట్టుబడుల సదస్సుకు హాజరవుతున్నారు. దీని కోసం ఢిల్లీలో జరిగిన ఒక సన్నాహక సమావేశంలోనూ విశాఖ రాజధానిపై సీఎం జగన్ ప్రత్యేక ప్రస్తావన చేశారు. విశాఖ రాజధానిగా ఉంటుందని తాను కూడా త్వరలో అక్కడకు వెళ్లిపోతున్నానని ఆయన ప్రకటించారు. రాజధాని వ్యవహారంపై కోర్టు కేసులున్న నేపథ్యంలో జగన్ అండ్ కో మాటలను జనం నమ్ముతారా లేదా అన్నది పెద్ద ప్రశ్నే.

మార్చి నాటికి విశాఖను ఎగ్జిక్యుటివ్ కేపిటల్ గా పూర్తి స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తామని వైసీపీ ప్రకటించి చాలా రోజులైంది ఇందుకోసం సదస్సులు సమావేశాలు ఉత్తరాంధ్ర ఉద్యమాలు కూడా నిర్వహించారు. అయితే అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు విచారణ జరుపుతున్న నేపథ్యంలోనే ప్రభుత్వం రాజధాని మార్పు ప్రక్రియ కొనసాగించింది. అక్కడ భవనాలను సిద్ధం చేస్తోంది. సీఎం క్యాంపు కార్యాలయానికి ఏర్పాట్లు చేస్తోంది. విశాఖను రాజధానిగా అంగీకరించకపోతే ఉత్తరాంధ్రను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని లేని పక్షంలో మరో ఉద్యమం ఖాయమని మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రకటించి ఉద్రిక్తతలు సృష్టించేందుకు కూడా ప్రయత్నించారు.

బెంగళురులో నిర్వహించిన సన్నాహక సదస్సులో ఆర్థిక మంత్రి బుగ్గన మాటలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనమయ్యాయి. మూడు రాజధానులన్నవి సమాచార లోపం మాత్రమేనని విశాఖ ఒక్కటే రాజధాని అని బుగ్గన చెప్పడంతో వైసీపీలోనే గందరగోళం ఉందని తేలిపోయింది. విశాఖకు అన్ని అనుకూలతలు ఉన్నాయని చెప్పిన బుగ్గన కర్నూలులో హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ గుంటూరులో ఏడాదికి ఒకసారి అసెంబ్లీ పెట్టినంత మాత్రాన అవి రాజధానులు అయిపోవన్నారు. బుగ్గన వివరణపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆచి తూచి వ్యవహరించడం మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. పాలనా సౌలభ్యం కోసం మూడు రాజధానులు పెట్టాలనుకున్న విషయాన్ని ఆయన మళ్లీ మళ్లీ చెప్పారు. పైగా ఎవరూ అపోహలకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు.

ఇప్పుడు వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి కొత్త రాగం అందుకున్నారు. న్యాయపరమైన చిక్కులను తొలగించుకుని ఏప్రిల్ తర్వాత విశాఖను రాజధానిగా చేస్తామని ఆయన ప్రకటించారు. పైగా వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ఈ సంగతిని వెల్లడించారు. అంటే మార్చి డెడ్ లైన్ నుంచి వైసీపీ ప్రభుత్వం పక్కకు జరిగినట్లే అనుకోవాలి. ఇలా డెడ్ లైన్లు పెంచుకుంటూ టైమ్ పాస్ చేస్తుందని కూడా అనుకోవాలి.

ప్రభుత్వం ఇప్పుడు ద్విముఖ వ్యూహంతో ముందుకెళ్తోంది రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం మొదటి వ్యూహం. ఆంధ్రప్రదేశ్ కు విశాఖే రాజధాని అని చెప్పడం రెండో వ్యూహం. నిజానికి ఉత్తరాంధ్ర ప్రజలకే విశాఖ రాజధానిపై ఆసక్తి లేదని అనేక సందర్భాల్లో నిరూపితమైంది. అయినా అమరావతిని దెబ్బకొట్టేందుకే విశాఖ రాజధాని అంశాన్ని జగన్ పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఏ విధంగా చూసినా రాజధాని అమరావతి నుంచి విశాఖకు మారే అవకాశం లేదని తెలుస్తూనే ఉంది. అయినా జగన్ కు దింపుడు కళ్లెం ఆశ తీరలేదు. అందుకే పారిశ్రామికవెత్తలతో విశాఖ అందాలు మౌలిక వసతులపై మెచ్చుకోలు ప్రకటనలు ఇప్పించాలని చూస్తున్నారు. అది సరే పెట్టుబడుల సదస్సులో ఏపీకి ఎంత ప్రయోజనం చేకూరుతుందో తెలుసుకోవడం ఇప్పుడు తక్షణ అవసరంగా పరిగణించాల్సి ఉంటుంది.