వైసీపీ నేతలతో లోకేష్ డైరెక్ట్ ఫైట్.. చూసుకుందాం రా

By KTV Telugu On 13 March, 2023
image

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు భారీ ప్రజా స్పందన లభిస్తోంది. వైపీసీ ప్రభుత్వ తప్పిదాలు అరాచకాలను ప్రస్తావిస్తూ లోకేష్ యాత్రలో సాగిపోతున్నారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ అక్కడి స్థానిక ఎమ్మెల్యేలను వైసీపీ నేతలను నారావారబ్బాయి టార్గెట్ చేస్తున్నారు. చిత్తూరు జిల్లా అభివృద్ది ఆగిపోవడానికి అధికార పార్టీనే కారణమని ఆయన ఆరోపించారు. మంత్రులు రోజా, పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి సహా పలువురిపై ఆరోపణలు చేశారు. ప్రజలకు ఏం ఒరిగించారని పెద్దిరెడ్డిని పెద్దాయన అని పిలవాలంటూ ఎద్దేవా చేశారు.

చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్యే, ఎంపీ నియోజకవర్గాల అభివృద్దిపై నారా లోకేష్ వందలకొద్ది విమర్శలు చేశారు. ఏ ఒక్క చోట ప్రజా సంక్షేమాన్ని నేతలు పట్టించుకోలేదని ఆరోపించారు. పైగా ఆయన సెల్ఫీ ఛాలెంజ్ విసిరి చాలా రోజులైంది. అభివృద్ధి ఆగిపోయిన చోట తాను సెల్ఫీ దిగి పోస్ట్ చేస్తున్నానని జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేసిన చోట వచ్చి సెల్ఫీ దిగి సోషల్ మిడియాలో పోస్ట్ చేయాలని సవాలు విసిరారు. ఎంపీ మిథున్ రెడ్డిపై లోకేష్ ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు. నియోజకవర్గం అభివృద్ధికి ఎంపీ మిథున్ రెడ్డి చేసిందేమీ లేదని ఆరోపించారు. కావాలంటే దీనిపై ఎంపీతోనే బహిరంగ చర్చకు సిద్ధమని లోకేష్ సవాలు చేశారు.

లోకేష్ సవాలు చేసిన తర్వాత ఒకటిరెండు రోజులు వైసీపీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అంతలోనే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉందని అధికారులు చెప్పడంతో యాత్రకు బ్రేక్ ఇచ్చి లోకేష్ హైదరాబాద్ చేరుకున్నారు. లోకేష్ హైదారాబాద్ వెళ్లిపోయిన తర్వాత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నోరు విప్పారు. చిత్తూరు జిల్లా అభివృద్ధిపై చర్చకు సవాలు విసిరిన లోకేష్ పాలయనం చిత్తగించారని ఆరోపించారు. ఎంపీ మిథున్‌రెడ్డి తంబళ్లపల్లెలోనే ఉన్నారని ఎప్పుడైనా చర్చకు సిద్ధమని పెద్దిరెడ్డి చెప్పుకున్నారు. మాజీ మంత్రి అమర్‌నాథ్‌ రెడ్డి ఇచ్చిన తప్పుడు సమాచారంతో లోకేష్ మాట్లాడుతున్నారన్నారు.

పెద్దిరెడ్డి వ్యాఖ్యలకు టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర గట్టి కౌంటర్ ఇచ్చారు. లోకేష్ లేన్పుడు వైసీపీ వాళ్లు మాట్లాడుతున్నారని నరేంద్ర అన్నారు. లోకేష్ తిరిగి చిత్తూరు జిల్లాలోకి అడుగుపెట్టిన తర్వాత ఎప్పుడైనా బహిరంగ చర్చకు టీడీపీ సిద్ధమని నరేంద్ర కుండబద్దలు కొట్టారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అథోగతి పాలు చేసిందని నరేంద్ర ఆరోపిస్తూ జగన్ పాలనలో కక్షసాధింపు మినహా సంక్షేమం లేదన్నారు.

లోకేష్ యాత్ర మొదలు పెట్టిన నెల తర్వాత అసలు కాక ఇప్పుడు మొదలైంది. ఇంతకాలం వ్యవస్థలతో లోకేష్ యాత్రను నియంత్రించాలని ప్రయత్నించిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు నేరుగా నేతలే రంగంలోకి దిగే అవకాశం ఉంది. ఛాలెంజుల పేరుతో లోకేష్ ను మరింత రెచ్చగొట్టడం యాత్ర జరగకుండా ఇబ్బంది పెట్టడం లాంటి చర్యలకు దిగవచ్చు. నిజానికి టీడీపీకి కాావల్సింది కూడా అదే. వైసీపీ అరాచకాలను జనంలో ఎండగట్టాలంటే బడా నేతలను బయటకు లాగాలి. వాళ్లంతా రౌడీ రాజ్యాన్ని నడిపిస్తున్నారని నిరూపించగలగాలి. పైగా బహిరంగ చర్చ పేరుతో వారిని ఇరకాటంలో పెట్టాలి. మాట్లాడే ముందు వైసీపీ నేతలు ఒకటికి పది సార్లు ఆలోచించుకునేట్లు చేయాలి.

నిజంగా బహిరంగ చర్చ జరుగుతుందని ఖచితంగా చెప్పలేము. రెండు పార్టీలు ఒక వేదికపైకి రావడం అంత సులభం కాదు అలా రావాలనుకున్నా ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు అనుమతివ్వరు. చర్చకు టైమ్ ప్రకటించిన వెంటనే నేతల హౌస్ అరెస్టులు ఎక్కడికక్కడ నిర్బంధాలు మొదలవుతాయి. అధికార పార్టీ నేతలను సైతం ఇళ్లు కదలకుండా ఆపుతారు. అయితే దాని వల్ల కొంత టెన్షన్ మరి కొంత పబ్లిసిటీ వస్తుంది. టీడీపీకి కావాల్సింది కూడా అదేనని చెప్పాలి. పాదయాత్ర రొటీన్ గా సాగిపోతే రోజూ అవే ఆరోపణలు అవే ప్రకటనలతో జనానికి బోర్ కొట్టించాల్సి వస్తోంది. కార్యకర్తల్లో కూడా క్రమంగా ఉత్సాహం తగ్గిపోతోంది. ఇలాంటి సవాళ్లతో కొంత వెరైటీ చూపించే అవకాశం ఉంటుందని టీమ్ లోకేష్ భావిస్తోంది.వైసీపీ కూడా తొడకొడుతోంది ఏం జరుగుతుందో చూడాలి మరి.