పశ్చిమాన బుద్దా రాగం…

By KTV Telugu On 5 February, 2024
image

KTV TELUGU :-

మిత్రపక్షాల మధ్య సీట్ల చిచ్చు తప్పేలా లేదు. ఎవరికెంత బలముందో చూసుకోకుండా మాకు ఈ సీటు కావాల్సిందేనన్న డిమాండ్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రతీ   నియోజకవర్గంలోనూ టీడీపీ-జనసేనకు ఇలాంటి సమస్యలు తప్పడం లేదు. ఒకరి తీరు మరోకరు ఎండగట్టుకోకపోయినా లోలోన కుతుకతా ఉడుకుతున్నది మాత్రం నిజం….

కేశినేని నాని…టీడీపీ నుంచి నిష్క్రమించారని చాలా మంది సంతోషించి ఉండొచ్చు. ఆయన కుమార్తె శ్వేతకు టికెట్ ఇచ్చే పని లేకుండా పోయిందని సంబరపడిపోతుండొచ్చు.  తాజా లెక్కలు, అంచనాలు చూసుకుంటే మాత్రం అసలు ముసళ్ల పండగ ఇప్పుడు మొదలైందని చెప్పక తప్పదు. దానితో మిత్రపక్షాలకు  భవిష్యత్తు ముఖచిత్రం కనిపిస్తూనే ఉంది. సీట్ల సర్దుబాటు నాటికి రోడ్డు మీద పడి కొట్టుకునే పరిస్థితి వచ్చినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదన్న అనుమానమూ కలుగుతుంది. విజయవాడ పశ్చిమ  సీటు వ్యవహారం ఒక చిన్న ఉదాహరణ మాత్రమేనని చెప్పుకోవాలి. విజయవాడ వెస్ట్‌ టిక్కెట్ తనకే ఇవ్వాలంటూ గురువారం బుద్ధా వెంకన్న దుర్గగుడి వరకు ర్యాలీ చేపట్టారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి ఇవ్వబోయే దరఖాస్తును అమ్మవారి పాదాల వద్ద ఉంచి పూజలు చేశారు. తనకే బాబు టికెట్‌ ఇప్పించేలా అమ్మవారు ఆశీర్వదించారంటూ బయటకు వచ్చి హడావిడి చేశారు. చంద్రబాబుకిచ్చే అప్లికేషన్ ముందుగా కనకదుర్గమ్మకు ఇచ్చా. విజయవాడ వెస్ట్ లేదా అనకాపల్లి ఎంపీగా నాకు అవకాశం ఇవ్వాలని అప్లికేషన్ ఇచ్చా. .. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తా. అలాగని టిక్కెట్ రాలేదని ఎవరైనా చంద్రబాబుని విమర్శించినా తాట తీస్తా. నాకు టిక్కెట్ కేటాయించాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దర్నీ కోరుతున్నానని అనడం టీడీపీ, జనసేన వర్గాల్లో చర్చకు దారితీసింది. వెంటనే ప్రత్యర్థులు రంగంలోకి దిగారు…

విజయవాడ పశ్చిమకు పోటీదారులు ఎవరు.. వాళ్లేమంటున్నారు. రెండు పార్టీల అగ్రనేతలు రంగంలోకి పరిస్థితిని చక్కదిద్దాల్సిన అనివార్యత ఏర్పడిందా. లేనిపక్షంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులు అదుపుకు వచ్చే అవకాశం లేదా…

బుద్దా వెంకన్న హడావుడి చేసిన కాసేపటికే జలీల్ ఖాన్ బ్యాటింగ్ మొదలు పెట్టారు. విజయవాడ  వెస్ట్  నాదిరా అంటూ స్టేట్ మెంట్స్ ఇచ్చేశారు. ఇటు వైపు చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరికలు జారీ  చేస్తున్నారు. అందులోనూ  జలీల్ ఖాన్ కుటుంబానికి ఫైర్ బ్రాండ్స్ అన్న పేరుంది. పైగా మైనార్టీ వర్గాల ఓట్లు ఎక్కువగా ఉండే విజయవాడ వెస్ట్ లో తనకే టికెట్ కావాలని జలీల్ ఖాన్ డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో పరిణామాలు  తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. పైగా జలీల్ ఖాన్ కొంతకాలం కేశినేని నాని వెంట తిరిగారు. పరిస్థితులు అనుకూలించకపోతే ఆయన వైసీపీలోకి  వెళ్లిపోయినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. మరో పక్క జనసేన పార్టీ క్రియాశీల నాయకుడు పోతిన మహేష్ కూడా విజయవాడ వెస్ట్ పై ఆశలు పెట్టుకున్నారు. పశ్చిమ టిక్కెట్ తమకే కేటాయించాలంటూ ఆయన చాలాకాలంగా డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో.. ఇప్పుడు బుద్ధా చేసిన హడావిడిని జనసేన నేతలు తట్టుకోలేకపోతున్నారు. ఎక్కడ చంద్రబాబు ఏకపక్షంగా ఈ సీటును కూడా ప్రకటిస్తారేమోనని ఆందోళన చెందుతున్నారు. ఇలా పదే పదే పొత్తు ధర్మాన్ని ఉల్లంఘిస్తూ సీట్లు ప్రకటించుకోవడంపై పార్టీ అధినేత పవన్‌ను కలిసి నిలదీసే యోచనలో జనసేన నేతలు ఉన్నట్లు సమాచారం.

ఏదేమైనా బుద్దా వెంకన్న ఒక స్టెప్  ముందుకు వేసినట్లే అనుకోవాలి. ఒక రకంగా ఆయన పార్టీ అధిష్టానానికి హెచ్చరిక జారీ చేశారనుకోవాలి. జలీల్ ఖాన్ కూడా తక్కువేమీ తినలేదు. ఆయన టఫ్ నట్ అని చెప్పుకోక తప్పదు . ఇదీ ఓ కోణమైతే..ఇప్పుడు జనసేన క్షేత్రస్థాయి నేతల్లో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. తమపై టీడీపీ పెత్తనం ఎక్కువైందని వాళ్లు ఆగ్రహం చెందుతున్నారు. ఈ ఆగ్రహం ఎలా మారుతుందో చూడాలి….

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి