సత్తెనపల్లిని లోకేష్ సరిచేశారా?

By KTV Telugu On 14 August, 2023
image

KTV telugu ;-

టీడీపీ యువనేత నారా లోకేష్ సత్తెనపల్లి నియోజకవర్గంలో ఎక్కువ సేపు గడపకపోవడానికి కారణం ఏమిటి.. ఉన్న కొద్ది గంటల్లోనే నియోజకవర్గ టీడీపీని సెట్ చేసి వెళ్లిపోయారా. విభేదాలు వదిలిపెట్టి కలిసి పనిచేయకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారా. నేతలంతా దారికి వచ్చినట్లేనా.. సత్తెనపల్లి విజయంపై పార్టీ పూర్తి అవగాహనతో ఉందా..

కొన్ని నియోజకవర్గాలు కొరుకుడు పడవు. చంద్రబాబు స్వయంగా దృష్టి పెట్టినా ఓ కొలిక్కి రావు. అలాంటి సెగ్లెంట్లలో జోక్యం చేసుకోవడానికి అధినేత కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. సత్తెనపల్లి కూడా అలాంటిదే. పార్టీ ఓడిపోయిన తర్వాత సైతం సత్తెనపల్లి నాయకత్వంలో పెద్దగా మార్పు రాలేదు. యువగళం పాదయాత్రలో మాత్రం ఏదో మార్పు కనిపించినట్లనిపించింది. వైరి వర్గాలు నారా లోకేష్ సమక్షంలో ఒకటైనట్లు అనిపించింది. మరి అది తాత్కాలికమా, శాశ్వతమా…

నారా లోకేష్ సత్తెనపల్లి పట్టణంలోకి ఎందుకు ఎంటర్ కాలేదు. ఇదీ పెద్ద ప్రశ్నే. నియోజకవర్గంలోకి ఇలా వచ్చి అలా ఎందుకు వెళ్లారు.అది కూడా పెద్ద ప్రశ్నే. రాయలసీమ జిల్లాల్లో ప్రతీ నియోజకవర్గానికి రెండు మూడు రోజులు కేటాయించిన లోకేష్ బాబు.. కోస్తాకు వచ్చే సరికి వడివడిగా కదిలిపోవడానికి కారణమేమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అందులోనూ రాజకీయ ప్రాధాన్యమున్న సత్తెనవల్లి నియోజకవర్గంలో లోకేష్ కొన్ని గంటలు మాత్రమే గడిపారు. గురజాల నియోజకవర్గంలో కొండమోడు దగ్గర సత్తెనపల్లి నియోజకవర్గంలోకి ఎంటరైనప్పుడు ఇంఛార్జ్ కన్నా లక్ష్మీనారాయణ, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరాం, మన్నెం శివనాగమల్లేశ్వరరావు అలియాస్ అబ్బూరు మల్లి సహా అందరు నేతలు ఒక ఫ్రేమ్ లోకి వచ్చారు.పార్టీపై అలిగిన శివరాం రాడనుకున్నా సకాలంలో ప్రత్యక్షం కావడం విశేషమేనని చెబుతున్నారు. కన్నా, కోడెల చేతులు కలిపించిన లోకేష్.. అందరూ కలిసి పనిచేయాలని కూడా ఆదేశించినట్లు చెబుతున్నారు.

లోకేష్ వెంట కొంత దూరం నడిచిన కోడెల శివరాం తర్వాత కనిపించలేదు. చౌటపాపాయపాలెం బహిరంగ సభలో స్టేజీపై ఆయన లేరు. అందుకు కారణం లేకపోలేదు. సత్తెనపల్లి ఇంఛార్జ్ తనకు ఇస్తారని శివరాం ఎదురు చూశారు. అలా జరగకపోగా అప్పుడే పార్టీలోకి వచ్చిన కన్నాకు కట్టబెట్టడంతో నొచ్చుకున్నారు. కనీసం తనను పిలిచి ఒక మాట చెప్పిన తర్వాతేనా కన్నాకు అవకాశం ఇచ్చి ఉండాల్సిందని శివరాం తన అనుచరుల వద్ద చెప్పుకున్నారు.అందుకే బహిరంగ సభలో కన్నా పక్కన నిల్చోవడం ఇష్టం లేక శివరాం వెళ్లిపోయారని పార్టీ వర్గాల్లో టాక్. అయితే శివరాంను బుజ్జగించడం కష్టమేమీ కాదని త్వరలో అధిష్టానం పిలిపించి మాట్లాడుతుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. బహురంగ సభ వాహనం మీద ఇతర నియోజకవర్గాల నేతలు కూడా కనిపించడం ఆశ్చర్యకర పరిణామంగా చెబుతున్నారు. ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, జీవీ ఆంజనేయులు లాంటి నేతలు అక్కడకు ఎందుకు వచ్చారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పైగా అబ్బూరు మల్లికి సకాలంగా తగిన పదవి కల్పిస్తామని లోకేష్ ప్రకటించడం కూడా సంప్రదాయానికి విరుద్ధమైన ప్రకటనగా చెప్పుకోవాల్సి ఉంటుంది.

సత్తెనపల్లి టీడీపీలో రాజకీయ విభేదాలు తొలగించడం అంత సులభం కాదు. ఎందుకంటే వైఎస్ హయాంలో రెండు పర్యాయాలు నియోజకవర్గం కాంగ్రెస్ చేతుల్లో ఉండేది. 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు పాలనలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రాతినిధ్యం వహిస్తే ఆయన కుటుంబ సభ్యులు ఇష్టానుసారం వ్యవహరించారు. దానితో గత 18 నుంచి 19 ఏళ్లుగా టీడీపీ కేడర్ నిర్వీర్యమైపోయింది. అంకితభావంతో, కష్టపడి పనిచేసే కార్యకర్తలను పట్టించుకునే వారు లేకుండా పోయారు. పైగా ఇప్పుడు కన్నా లక్ష్మీ నారాయణను తీసుకొచ్చి పెట్టారు. గత 30 ఏళ్లుగా చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన కన్నాను పార్టీలో చేర్చుకోవడమేంటని ప్రశ్నించే సత్తెనపల్లి కేడర్ ఎక్కువగానే ఉంది. వాళ్లను సమాధాన పరిచే వారే లేరు. నియోజకవర్గం పార్టీలో ఎవరి గోల వారిదే అన్నట్లుగా తయారైంది. మరి లోకేష్ పర్యటనతోనైనా పరిస్థితి మారి పార్టీలో ఐకమత్యం సాధ్యమవుతుందా అన్నది చూడాలి…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి