తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చాలా రోజులుగా మౌనంగా ఉండిపోయారు. పది రోజుల క్రితం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఏపీలో టిడిపి-జనసేన కూటమితో పొత్తు పెట్టుకోవలసిందిగా చంద్రబాబు షాను అడిగినట్లు ప్రచారం జరిగింది. అయితే అమిత్ షా దానికి ఏం సమాధానం చెప్పారో మాత్రం బయటకు పొక్కలేదు. దీంతో ఎవరికి తోచిన ఊహాగానాలను వారు ప్రచారంలో పెట్టేస్తున్నారు. ఇటు చంద్రబాబు నాయుడు కూడా అమిత్ షాతో భేటీలో ఏం నిర్ణయాలు తీసుకున్నారో ఇంత వరకు ప్రకటించలేదు.
చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లిన రోజునే ఏపీ రాజకీయ వర్గాల్లో బోలెడు ఆసక్తి కర చర్చలు జరిగాయి. టిడిపి-బిజెపిల మధ్య పొత్తుకు రంగం సిద్ధం అయ్యిందని ఒక వర్గం ప్రచారం చేసింది. మరో వర్గం బిజెపి విధించిన షరతులతో చంద్రబాబు అవాక్కయ్యారని చెప్పుకొచ్చింది. అసలు భేటీ అయిన టిడిపి-బిజెపిలు మాత్రం భేటీలో ఏం నిర్ణయాలు తీసుకున్నారో ఇంత వరకు వెల్లడించలేదు. కానీ ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత చంద్రబాబు మౌనాన్ని కొనసాగిస్తున్నారు. దాని అర్దం ఏంటో ఎవరికీ అర్ధం కావడం లేదు.
చంద్రబాబు అమిత్ షా దగ్గరకు వెళ్లినపుడు .. ఆ భేటీ ముగిసి చంద్రబాబు ఏపీ వచ్చాక పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి బిజెపి అగ్రనేతలతో చర్చిస్తారని ఒక ప్రచారం బాగా వైరల్ అయ్యింది. కానీ చంద్రబాబు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇటు చంద్రబాబు కానీ అటు పవన్ కానీ మాట్లాడ్డం లేదు. పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లలేదు. పోనీ ఢిల్లీ నుంచి వచ్చిన చంద్రబాబు తో అయినా పవన్ సమావేశం కాలేదు. ఢిల్లీ వెళ్లకముందు చంద్రబాబు తన నివాసంలో పవన్ తో పలు దఫాలు భేటీ అయ్యారు. ఆ సమయంలోనే సీట్ల సర్దుబాటుపై ఒక నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరిగింది.
ఏపీలో పాలక పక్షమైన వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ దీన్నే అడ్వాంటేజ్ గా తీసుకుని విమర్శలు చేస్తోంది. చంద్రబాబు నాయుడు ఇవ్వలేని విధంగా సీట్లు డిమాండ్ చేసి బిజెపి రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరే పరిస్థితి లేకుండా చేసిందని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు.బిజెపి అడిగినన్ని సీట్లు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టే చంద్రబాబు నాయుడు కూడా ఏం మాట్లాడాలో తోచక మౌనంగా ఉండిపోయి ఉంటారని రాజకీయ పండితులు అనుమానిస్తున్నారు. అయితే చంద్రబాబు మాత్రం ఎవ్వరికీ అందనంత లోతుగానే ఆలోచన చేస్తారని పరిశీలకులు అంటున్నారు.
చంద్రబాబు -పవన్ కళ్యాణ్ లు రెండు వారాల క్రితం భేటీ అయినపుడు తమకు ఎన్ని సీట్లు కేటాయిస్తారో అని జనసైనికులు ఉత్కంఠగా ఎదురు చూశారు. నేడో రేపో సీట్ల సర్దుబాటు గురించి బయటకు సమాచారం వస్తుందని టిడిపి-జనసేన కార్యకర్తలు అనుకుంటోన్న తరుణంలో చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అమిత్ షాని కలిశారు. అంతే ఆ తర్వాత టిడిపి-జనసేనలు కూడా మౌనంగా ఉండిపోయాయి. అందుకే అసలు ఢిల్లీలో ఏం జరిగింది? చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారు? బిజెపి పొత్తుకు ఒప్పుకుందా లేదా? ఒప్పుకుంటే ఏం షరతులు విధించింది? అన్నవి తేలాల్సి ఉంది.
చంద్రబాబు నోరు తెరిస్తే కానీ టిడిపి-జనసేనల ఉమ్మడి కార్యక్రమాల షెడ్యూలు ఒక కొలిక్కి వచ్చే పరిస్థితి ఉండదు. రెండు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోని విడుదల చేయాల్సి ఉంది. చంద్రబాబు-పవన్ కళ్యాణ్ లు ఉమ్మడిగా పాల్గొనే బహిరంగ సభలు ఎక్కడెక్కడ నిర్వహించాలో నిర్ణయించాల్సి ఉంది. అదే విధంగా రెండు పార్టీలూ తమ తమ అభ్యర్ధుల జాబితాలను విడుదల చేయాల్సి ఉంది. ఫిబ్రవరిలో సగం నెల అయిపోయింది. ఎన్నికల నగారా వచ్చే నెల మొదటి వారంలో విడుదల కావచ్చు. టిడిపి-జనసేనలు తొందరగా ఓ కొలిక్కి రాకపోతే ఎన్నికల ప్రచారానికి సమయం కూడా సరిపోదని రెండు పార్టీల కింది స్థాయి నేతలు ఆందోళన చెందుతున్నారు. ముందుగా చంద్రబాబు మౌనం వీడాలని వారంటున్నారు..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…