బిజెపిలో ఆయనో కీలక నేత. తెలుగురాష్ట్రాల్లో ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. మొన్నటి ఎన్నికలలో అదృష్టం కలిసి రాలేదు. ఎంపీగా పోటీ చేద్దామంటే పార్టీపెద్దలు కరుణించలేదు. పార్టీలో, క్యాడర్లో పలుకుబడి ఉన్నా టిడిపి ఆడిన ఆటలో అరటిపండుగా మిగిలిపోయారు. ఆయన రాజ్యసభ ఎంపీ పదవీ కాలం కూడా పూర్తి అయింది. ప్రత్యక్ష ఎన్నికల్లో ఛాన్స్ ఇవ్వలేదు. మరోసారి రాజ్యసభలో అడుగుపెట్టడానికి అవకాశం దక్కుతుందా? ఆయనపై అధిష్టానం కరుణ కురిపిస్తుందా? ఇంతకీ ఎవరా బిజెపి నేత?
గుంటుపల్లి వెంకట నరసింహారావు..జీవీఎల్గా గుర్తింపు పొందిన ఈ బీజేపీ నేత రాజ్యసభ పదవీ కాలం పూర్తయింది. ప్రధాని మోదీకి దగ్గరగా ఉన్న నేతల్లో ఒకరుగా గుర్తింపు పొందిన జీవీఎల్..అమిత్‌షా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జాతీయ అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహించారు. దశాబ్ధ కాలం పాటు పార్టీకి చేసిన సేవలకి గుర్తింపుగా జీవీఎల్‌ను 2018లో ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పంపించారు బిజెపి పెద్దలు. రాజ్యసభ సభ్యుడిగా…వివిధ పార్లమెంటరీ కమిటీలలో సభ్యుడిగా కూడా జివిఎల్ సమర్ధవంతంగా పనిచేశారనే పేరు తెచ్చుకున్నారు. అదే సమయంలో ఎపిలో పార్టీ బలోపేతం చేసే లక్ష్యంతో జీవీఎల్ నరసింహారావును బీజేపీ హైకమాండ్రాష్ట్రానికి పంపించింది.
గతంలో విశాఖ ఎంపీ సీటును బీజేపీ గెలుచుకుంది. అందువల్ల విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని కమలం పార్టీ పెద్దలు సూచించడంతో జివిఎల్ విశాఖలోనే ఇల్లు కొనుక్కుని 2020 నుంచి అక్కడే పనిచేస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన సోము వీర్రాజుతో కలిసి విశాఖలో బిజెపిని పటిష్టం చేయడానికి ప్రయత్నించడంతో పాటు.. పలు కార్యక్రమాలతో నగర ప్రజలకి దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని అమ్మేయాలని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నిర్ణయించిన సందర్బంలో రాజ్యసభలో స్టీల్‌ప్లాంట్‌పై ప్రశ్న వేసి అందరి దీష్టినీ ఆకర్షించారు.
స్టీల్ ప్లాంట్ కి ఉక్కు గనులు కేటాయించాలని కూడా కేంద్రానికి లేఖ కూడా రాసారు. దీంతో పాటు విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కోసం రైల్వే శాఖమంత్రిని కలిసి విన్నవించారు. బిజెపిలో ఉంటూనే ఉమ్మడి ఎపి విభజిత సమస్యలపై ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. ఇలా పార్టీలో ముఖ్యనాయకుడిగా ఉన్న జివిఎల్ మొన్నటి ఎన్నికలలో విశాఖపట్నం నుంచి ఎంపిగా పోటీ చేయడం ఖాయమని అందరూ భావించారు. అయితే టిడిపి ఆడిన ఆటలో జివిఎల్ అరటిపండుగా మిగిలిపోవాల్సి వచ్చింది. విశాఖ ఎంపి సీటు కోసం నాలుగేళ్లపాటు జివిఎల్ శ్రమించగా చివరి నిమిషంలో ఆ సీటు ఆయనకే కాదు..అసలు బీజేపీ నుంచే జారిపోయింది.
రాష్ట్రంలో బిజెపి, టిడిపి, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకోవడంతో…అందులో భాగంగా విశాఖ సీటు టిడిపికి దక్కింది. గతంలో గెలిచిన సీటును వదులుకుని, అనకాపల్లి సీటును బీజేపీ కేటాయించేవిధంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి చక్రం తిప్పారు. విశాఖ స్ధానం నుంచి పోటీ చేయాలని విశ్వప్రయత్నం చేసిన జివిఎల్ కి సొంత పార్టీలోనే చుక్కెదురైంది. పురందేశ్వరి తన సోదరుడు బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ కోసం విశాఖ సీటుని వదులుకున్నట్లుగా విమర్శలు చెలరేగాయి. విశాఖ సీటుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న జివిఎల్ కి పొత్తుల కారణంగా చివరికి నిరాశే మిగిలింది. ఇదే సమయంలో రాజ్యసభ సభ్యుడైన జివిఎల్ కి ఇటీవలే పదవీకాలం ముగిసింది.
విశాఖ ఎంపి సీటు దక్కకపోవడంతో మళ్లీ రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కోసం జివిఎల్ నరసింహరావు ఎదురుచూస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర కోటాలో 2018 లో రాజ్యసభ సభ్యుడైన జివిఎల్‌కు ఇప్పుడు అక్కడి నుంచి అవకాశం వస్తుందా అంటే అనుమానమే అంటున్నారు. ఎందుకంటే పార్టీ అధికారంలో ఉన్నా యూపీలో బీజేపీకి ఎంపీ సీట్లు భారీగా తగ్గిపోయాయి. అనేక మంది సీనియర్లు ఓడిపోయారు. అందువల్ల ఇప్పుడు అక్కిడి కీలక నేతకే రాజ్యసభ సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. యూపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కూడా బీజేపీ హైకమాండ్నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల జీవీఎల్‌కు మరోసారి అవకాశం ఇస్తారా లేదా అనేది చూడాలి.
అయితే ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా లాంటి అగ్రనేతలతో సన్నిహిత సంబంధాలు ఉండటం, యుపిలో కూడా జివిఎల్ కి గట్టి పట్టు ఉండటం వల్ల రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం దక్కవచ్చని బిజెపిలో చర్చ జరుగుతోంది. ఒకవేళ రాజ్యసభ సభ్యుడిగా ఛాన్స్దక్కకపోతే పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తారనే వాదన వినిపిస్తోంది. ఉత్తరాదిన ఒక రాష్ట్రానికి ఇన్ చార్జిగా పంపించే అవకాశాలు కూడా ఉన్నట్లు పార్టీలో గట్టిగా ప్రచారం జరుగుతోంది. మరి సొంత రాష్ట్రంలో ఎంపీ సీటు దక్కని, రాజ్యసభ పదవీ కాలం ముగిసిన జీవీఎల్‌కు బీజేపీ పెద్దలు ఎలాంటి అవకాశం ఇస్తారో చూడాలి.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…