నర్సాపురం ఎంపీ రఘురామరాజు ఎట్టకేలకు టీడీపీలో చేరారు. ఇంతకాలం జగన్ పై పోరాటం సాగించిన రఘురామ..ఇప్పుడు టీడీపీలో చేరి ఏపీ సీఎంకు బలమైన ప్రత్యర్థి అవుతున్నారు. ఇప్పటి నుంచి ఆయన కార్యాచరణ ఏమిటన్న చర్చ మొదలైంది. నర్సాపురం లోక్ సభ టికెట్ ఆయనకు దక్కే అవకాశం లేదని తేలిపోయిన తరుణంలో అసెంబ్లీ టికెటే ఆయనకు కట్టబెడతారని కూడా చెబుతున్నారు. ఇంతకీ ఆ పని జరుగుతుందా… అలా జరిగితే ఏ నియోజకవర్గంలో టీడీపీ బీ ఫార్మ్ ఇస్తారన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి…
రెబెల్ స్టార్ రఘురామ అనుకున్నదొక్కటీ. ఆంధ్రప్రదేశ్లో జరిగిందొక్కటీ. నాలుగేళ్ల పాటు జగన్ పై తాను చేసిన పోరోటానికి ఫలితంగా టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిలో పిలిచి టికెట్ ఇస్తారని ఆయన ఎదురుచూశారు. నర్సాపురంలో నిలబెట్టి గెలిపించుకుంటారని ఆశపడ్డారు. కట్ చేసి చూస్తే సీన్ సితారైంది. మూడు పార్టీల్లో ఎవరూ టికెటివ్వలేదు. నర్సాపురం నియోజకవర్గాన్ని చంద్రబాబు తెలివిగా బీజేపీకి కేటాయించారు. దానితో వాళ్లు భూపతిరాజు శ్రీనివాసవర్మను నిలబెట్టుకుని రఘురామరాజుకు మొండిచేయి చూపించారు. చంద్రబాబు కూడా తన కోటాలో టికెట్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఒక్కో నియోజకవర్గంలో పది మంది ఆశావహులున్నారు. ఈ పరిస్థితుల్లో దిక్కుతోచని రఘురాజు….తనదైన శైలిలో లాబీయింగ్ చేసుకోవాల్సి వచ్చింది. రఘురాజుకు అన్యాయం జరిగిందని గోదారోళ్లలో కూడా నిరసనధ్వనులు వినిపించాయి. దీనితో చంద్రబాబు రూటు మార్చారు. రఘురాజు తమకు చాలా ఆప్తుడని చెబుతూ ఆయనకు టీడీపీ కండువా కప్పేశారు. పాలకొల్లులో జరిగిన భారీ సభలో రఘురామ ఆనందంగా పార్టీలో చేరుతూ చంద్రబాబును ప్రశంసలతో ముంచెత్తారు.. ఇక అసలు కథ ఇప్పుడే మొదలవుతుందని అంటున్నారు…
రఘురాజుకు ఇప్పుడు పరిస్థితులు అంత అనుకూలంగా ఏమీ లేవు. టికెట్ దక్కుతుందా.. దక్కితే అది గెలిచే సీటే అవుతుందా అన్న భయం ఆయన్ను వెంటాడుతోంది. ఈ క్రమంలో రఘురాజు కొంత అసహనానికి కూడా లోనవుతున్నారు. గతిలేని పరిస్థితికి తీసుకొచ్చారన్న ఫీలింగ్ ఆయనలో కనిపిస్తోంది….
రఘురామ అప్పుడే మాట జారడం మొదలు పెట్టారన్న చర్చ జరుగుతోంది. శుక్రవారం మధ్యాహ్నం ఆయన బాడీ లాంగ్వేజ్ లో కొంత అసహనం కూడా కనిపించింది. ఎక్కడ నుంచి పోటీ చేస్తున్నారన్న మీడియా ప్రశ్నలకు లోపల చంద్రబాబు నాయుడు గారుంటారు..అక్కడకు వెళ్లి అడగండి అని ఆయన కసురుకున్న తీరు పెరిగిపోతున్న ఫ్రస్ట్రేషన్ కు నిదర్శనంగా నిలుస్తోంది. నాకు బీజేపీ టికెట్ ఇప్పించలేని చంద్రబాబు, పోలవరం నిధులు ఎలా తెస్తారని రెండు రోజుల క్రితం రఘురాజు తన అనుచరులతో వ్యాఖ్యానించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే రాజకీయాల్లో ఇవన్నీ సహజమే కనుక చంద్రబాబు కూడా పెద్దగా పట్టించుకోరు. జగన్ ను గట్టిగా వ్యతిరేకించిన వ్యక్తిగా రఘురామను ఎక్కడోక్కడ అకామడేట్ చేయాలని చూస్తున్నారు. ఉండి అసెంబ్లీ నియోజకవర్గాన్ని రఘురామకు కేటాయిస్తారని ప్రస్తుతం టీడీపీలో వినిపిస్తున్న టాక్. దీని కోసం పార్టీతో పాటు పొత్తు అభ్యర్థుల్లో కొన్ని మార్పులు చేయాలనుకుంటున్నారు. ఈ విషయంపై బీజేపీ, జనసేనతో కూడా చర్చలు జరుగుతున్నాయి. నల్లమిల్లి కోసం అనపర్తిని తీసేసుకుని, బీజేపీకి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఒక నియోజకవర్గాన్ని కేటాయించేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. అలా రెండు మూడు నియోజకవర్గాలపై చర్చ కొనసాగుతోంది. నామినేషన్ల పర్వం ప్రారంభమయ్యే ఏప్రిల్ 25 నాటికి మొత్తం వ్యవహారంపై ఒక క్లారిటీ రావచ్చు. ఈ లోపు రఘురామ ఒక పని చేయాల్సి ఉంది. గతంలో లాగ కాకుండా ఇప్పుడు నోరు అదుపులో పెట్టుకుని సంయమనం పాటించాలి. జగన్ కు తిట్టినట్లుగా ఎన్డీయేను తిడితే కుదరకపోవచ్చు.
పార్టీ మారినంత మాత్రాన రఘురామ నేచర్ మారుతుందా అని ప్రశ్నించే వాళ్లు కూడా ఉన్నారు. వారందరకీ ఆయన మౌనమే సమాధానం కావాలి. పోటీ చేసే అవకాశం వస్తే జనంలోకి తాను చేయబోయేదేమిటో స్పష్టంగా చెప్పాలి. టికెట్ ఇవ్వలేని పరిస్థితి వస్తేనే రఘురామ పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…