నాలుగు దశాబ్ధాల ఘన చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీకి ఏమైంది? ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ను 16 ఏళ్ల పాటు విభజిత ఆంధ్ర ప్రదేశ్ ను అయిదేళ్ల పాటు ఏలిన రాజకీయ పార్టీలో ఏం జరుగుతోంది? ఎన్నో ఆగస్టు సంక్షోభాలను అధిగమించి తనదంటూ ఘనమైన ముద్ర వేసుకున్న టిడిపి ఇపుడు ఏ దిశగా అడుగులు వేస్తోంది? పార్టీ అధినేత జైల్లో ఉంటే.. పార్టీ కష్టాల్లో ఉంటే.. లక్షలాది మంది సుశిక్షితులైన కార్యకర్తల బలం ఉన్న పార్టీ ఎందుకు ధైర్యంగా నిలబడలేకపోతోంది? ఎన్నో వెలుగులు వెలిగిన పార్టీలో ఎన్నో పదవులు అనుభవించిన దిగ్గజ నేతలంతా ఏం చేస్తున్నారు? అధినేత అరెస్ట్ కాగానే మొత్తం అంతా ఎందుకు సైలెంట్ అయిపోయారు?
దివంగత నటుడు నందమూరి తారకరామారావు 1982లో స్థాపించిన తెలుగుదేశం పార్టీ పుట్టిన 9 నెలలకే ఏపీలో కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యానికి గండి కొట్టి కాలర్ ఎగరేసింది. తెలుగుదేశం పార్టీ పేరు ప్రపంచమంతా మార్మోగింది. ఇక ఆ తర్వాత ఆ పార్టీ ఎన్నో ఎత్తులు పల్లాలు చేసింది. విజయాలు..పరాజయాలూ చవి చూసింది. అయితే ఏ నాడూ తలవంచలేదు. తల దించనూ లేదు. అటువంటి రాజకీయ పార్టీకి సంక్షోభాలూ కొత్త కాదు. కానీ ప్రస్తుతం టిడిపిలో నెలకొన్న గందరగోళం మాత్రం గతంలో ఎన్నడూ లేనిదే. పార్టీ కార్యకర్తలు ఇపుడు చాలా అయోమయంలో ఉన్నారు. దిశానిర్దేశనం చేసే నేతల కోసం ఎదురు చూస్తున్నారు.
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు నాయుణ్ని ఏపీ సిఐడీ పోలుసులు గత సెప్టెంబరు 9న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుణ్ని జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారు. పార్టీకి అన్నీ తానే అయిన వన్ మ్యాన్ ఆర్మీలా నడిపించిన సారధి జైలుకు వెళ్లడంతో క్యాడర్ లో కొంత కంగారు ఉన్న మాట వాస్తవం. పార్టీ జాతీయ అధ్యక్షుడు జైలుకు వెళ్లడంతో జాతీయ ప్రధాన కార్యదర్ధి అయిన బాబు తనయుడు నారా లోకేష్ తన తండ్రి తరపున వాదించే న్యాయవాదులను మానిటర్ చేయడానికి ఢిల్లీలో ఉండాల్సి వచ్చింది. అగ్రనేతలు ఇద్దరూ అందుబాటులో లేకపోవడంతో పార్టీ భవిష్యత్తు ఏంటి? చంద్రబాబు నాయుడిపై మోపిన కేసుల పరిస్థితి ఏంటి? అన్న ప్రశ్నలు పార్టీ శ్రేణుల్లో వస్తున్నాయి.
తాజాగా నారాలోకేష్ సిఐడీ విచారణలో ఉన్నారు. ఇటువంటి కష్టకాలంలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపి వారిలో ధైర్యాన్ని నింపి వెన్నుతట్టి ప్రోత్సహించాల్సిన బాధ్యత పార్టీలోని సీనియర్ నేతలపైనే ఉంటుంది.అయితే చిత్రంగా టిడిపి ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతూ వస్తోన్న కొందరు నేతలు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కీలక మంత్రి పదవులను అనుభవించారు. అటువంటి వారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి జైల్లో ఉంటే పార్టీకి భరోసా ఇవ్వడానికి ముందుకు రాకపోవడం..చురుగ్గా వ్యవహరించకపోవడం పార్టీ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది.
ఎన్టీయార్ పార్టీని స్థాపించినపుడు ఆయన పిలుపును అందుకుని రాజకీయాల్లోకి అడుగు పెట్టిన వారు చాలా మంది ఉన్నారు. వారిలో కీలక నేతలుగా ఎదిగిన కొందరు ఇప్పటికీ టిడిపిలో కొనసాగుతున్నారు. ఎన్టీయార్ హయాంతో పాటు ఎన్టీయార్ ను పదవి నుండి తప్పించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత బాబు ప్రభుత్వంలోనూ ఈ నేతలు కీలక పదవులు అనుభవించారు. మంత్రి వర్గంలో కీలక పాత్రలూ పోషించారు. వీరిలో ముఖ్యులు నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు, విజయనగరం జిల్లాకు చెందిన మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు, రాజమండ్రికి చెందిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి, తునికి చెందిన యనమల రామకృష్ణుడు వంటి వారు చాలా మంది ఉన్నారు. వీరంతా ఇపుడు క్రియాశీలకంగా వ్యవహరించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
చంద్రబాబు నాయుడి అరెస్ట్ కు నిరసనగా పార్టీ కొన్ని ఆందోళనలకు పిలుపు నిచ్చింది. అయితే ఈ కార్యక్రమాల్లో సీనియర్ నేతలెవరూ పాల్గొనకపోవడం విశేషం. పోనీ ఈ సీనియర్లే వేరే వినూత్న కార్యక్రమాలకైనా రూపకల్పన చేసి పిలుపు నిచ్చారా అంటే అదీ లేదు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు సీనియర్లంతా ఇలా అస్త్ర సన్యాసం చేస్తే ఎలాగ? అని పార్టీ సానుభూతి పరులు ప్రశ్నిస్తున్నారు.పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన వారు పార్టీ కష్టాల్లో ఉంటే మౌనంగా ఉండడం క్షమించరాని నేరం కాదా? అని వారు ప్రశ్నిస్తున్నారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…