ఏపీ రాజధాని ఎక్కడో…?

By KTV Telugu On 23 May, 2024
image

KTV TELUGU :-

ఏ  పార్టీ గెలిస్తే ఏంటి ప్రయోజనం, జనానికి ఒరిగేదేమిటి.. రాజకీయ నాయకులు వారి కుటుంబ సభ్యులు సంపాదించుకోవడం కోసమే కదా ఎన్నికల  రాజకీయాలుండేది…  అన్న టాక్ నిత్యం జరుగుతుండేదే. ఈ సారి మాత్రం ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక కొత్త టాక్ నడిచింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ అనేదే ఆ టాక్. ఎన్నికల్లో  గెలిచిన పార్టీని బట్టి  రాజధాని ఉంటుందని కూడా తేల్చేశారు. పైగా ఎక్కడ ప్రమాణ స్వీకారం ఉంటుందో అన్న  అంశంపై ఇప్పుడు బెట్టింగులు నడుస్తున్నాయి. అమరావతి వర్సెస్ వైజాగ్ పెద్ద గేమ్ ఆవిష్కృతమైంది…..

ఏపీకి ఎన్నికలు ప్రత్యేకం. సాధారణంగా కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ఎన్నికలు నిర్వహిస్తారు. కానీ ఏపీలో మాత్రం కొత్త ప్రభుత్వంతోపాటు కొత్త రాజధాని కోసం ఎన్నికలు నిర్వహించారు. వైసీపీ గెలిస్తే విశాఖ రాజధాని ఏర్పాటు ఖాయం. టీడీపీ కూటమి గెలిస్తే మాత్రం అమరావతి ఏకైక రాజధానిగా అవతరించడం తథ్యం.ప్రజాభిప్రాయం మేరకు రాజధాని నిర్మాణం చేస్తారు. కానీ ఇప్పుడు ఎన్నికల్లో వచ్చిన ఫలితం బట్టి ఏపీకి రాజధాని నిర్మితం కానుంది. ఒక రకంగా చెప్పాలంటే ఏపీకి ఇది సంక్లిష్ట సమయం. పార్టీల గెలుపోటములపై రాజధాని అంశం ముడిపడి ఉండడం విశేషం. మరో పది పన్నెండు  రోజుల వ్యవథిలో ఎన్నికల ఫలితాలు వచ్చేస్తాయి. గెలిచిన వెంటనే అమరావతిలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని టీడీపీ వర్గాలు ప్రకటించాయి. వైసీపీ గెలిస్తే జూన్ 9న విశాఖలో ప్రమాణ స్వీకారం ఉంటుందని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. కొందరైతే టైమ్ కూడా చెప్పేస్తున్నారు…

జగన్ రెడ్డి అధికారానికి వచ్చిన తర్వాత రాజధాని అంశం పెద్ద సమస్యగా మారింది. మూడు ముక్కలాటకు తెరతీసిన జగన్ రెడ్డి.. ఎక్కడా అభివృద్ధి లేకుండా చేశారు. కావాల్సినంత చోటున్న అమరావతిని వదిలేసి చోటు లేని వైజాగ్ పై  దృష్టిపెట్టారు.రాజధాని కోసం రుషికొండకు బోడి కొట్టారు. విశాఖలో భూకబ్జాలకు తెరతీశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడేం జరగబోతోంది..

రాజధానిని తమపై  రుద్దారని వాదించే విశాఖ వాసులు చాలా మందే ఉన్నారు. అమరావతే ఏకైక రాజధాని అని ఉత్తరాంధ్రలో చాలా మంది ప్రచారం చేస్తున్నారు. నిజానికి  అందరి ఆమోదంతోనే చంద్రబాబు, అమరావతిని రాజధానిగా ప్రకటించారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అంశం వివాదంగా మారింది. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చారన్న విమర్శను జగన్ ఎదుర్కొన్నారు. ఈ ఎన్నికల్లో విపక్షాలకు ఇదే అస్త్రంగా మారింది.  తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి నిర్మాణాన్ని తిరిగి ప్రారంభిస్తామని టీడీపీ అంటోంది. అయితే ప్రచారంలో అమరావతి అంశాన్ని టీడీపీ పెద్దగా ప్రస్తావించలేదని వైసీపీ  ఎదురుదాడి చేసిన  మాట వాస్తవం. 34 వేల ఎకరాలు భూములిచ్చిన రైతులు మాత్రం అమరావతే రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారు. జగన్ సీఎం కావడం వల్ల తమ జీవితాలు నాశనమయ్యాయని వారు ఆవేదన చెందుతున్నారు. జగన్ ఓడితే మూడు రాజధానుల అంశం కూడా మరుగునపడి పోవడం ఖాయమని తేలిపోయింది….

రాజధాని  విషయంలో ఎన్నికల ఫలితాలు చాలా కీలకమవుతున్నాయి వైసీపీ  మళ్లీ గెలిస్తే అమరావతి రైతుల ఆశలు గల్లంతైనట్లే అనుకోవాలి. టీడీపీ గెలిస్తే మాత్రం విజయవాడ, గుంటూరు మధ్య అత్యాధునిక నగరం ఆవిష్కృతం కావడం ఖాయం. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు శరవేగంగా విస్తరిస్తాయి. చూడాలి మరి  ఫలితం ఎలా ఉంటుందో…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి