సర్వే నిజమా.. గ్రామీణ ఫలితం నిజమా..?

By KTV Telugu On 23 August, 2023
image

KTV TELUGU ;-

ఏది నిజం ఏది ఎంత నిజం. చంద్రబాబులో కనిపిస్తున్న జోష్ ఎన్నికలు పూర్తయ్యేదాకా కొనసాగుతుందా. అన్ని పరిణామాలు టీడీపీకి అనుకూలంగా మారాయా. వైసీపీలో చాలా మంది తెలుగుదేశంలో చేరేందుకు సిద్దంగా ఉన్నారా. జనం కూడా టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారా…

వచ్చే ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి. జగన్ తన పదవిని నిలబెట్టుకుంటారా చంద్రబాబు మళ్లీ సీఎం అవుతారా.. ఈ ప్రశ్నలు తాజా పరిణామాలతో మరింత జటిలమవుతోంది. ఇటీవల విడుదలైన ఒక సర్వే జగన్ కు ఘనవిజయం ఖాయమని చెప్పింది. శనివారం జరిగిన పంచాయతీ ఉప ఎన్నికలు మాత్రం అందుకు భిన్నమైన ఫలితాలనిస్తూ అటు ఓటర్లను, ఇటు విశ్లేషకులను డైలమాలో పడేశాయి…

టైమ్స్ నౌ ఛానెల్ జరిపిన సర్వేకు, పంచాయతీ ఎన్నికల ఫలితాలకు పొంతన లేదన్నది నిజం. టైమ్స్ నౌ సర్వే ప్రకారం ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో ఉన్న 25 లోక్ సభా స్థానాల్లో 24 వైసీపీకి వస్తాయి. వాటిని అసెంబ్లీ సీట్లుగా మార్చితే గతంలో జగన్ పార్టీకి వచ్చిన 151 సీట్లు రావడం మాత్రం ఖాయమేననుకోవాలి. ఈ సర్వే ఫలితం చూసి మామూలు జనం కూడా ఆశ్చర్య పడిన మాట వాస్తవం. అన్ని సీట్లు ఎలా వస్తాయని ప్రశ్నించుకున్నదీ నిజం. రెండు రోజుల్లోనే సీన్ మారిపోయింది. పంచాయతీ ఉప ఎన్నికల్లో టీడీపీ గట్టి పోటీ ఇచ్చింది. వైసీపీకి ముచ్చెమటలు పట్టించింది.

మొత్తం 34 సర్పంచ్ స్థానాలకు శనివారం పోలింగ్ నిర్వహించారు. అందులో 22 చోట్ల వైసీపీ మద్దతుదారులు, రెబల్ అభ్యర్థి మరోచోట గెలిచారు. తెలుగుదేశం మద్దతుదారులు తొమ్మిదిచోట్ల, టీడీపీ, జనసేన కలిపి రెండు చోట్ల విజయం సాధించారు. మొత్తం 243 వార్డులకు ఎన్నికలు జరగగా.. వైసీపీ మద్దతుదారులు 141 వార్డులు, తిరుగుబాటు అభ్యర్థులు రెండు చోట్ల, టీడీపీ మద్దతుదారులు 90 చోట్ల, జనసేన మద్దతుదారులు ఐదుచోట్ల,టీడీపీ, జనసేన కలిపి ఒకచోట, సిపిఎం ఒకచోట, ఇతరులు మూడు వార్డులను గెలుచుకున్నారు. అంటే రాష్ట్రంలో ప్రతిపక్షాలు పుంజుకుంటున్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేని ఫలితం ఇది. అందుకే ఇప్పుడు టైమ్స్ నౌ సర్వే ఫలితాలపై అనుమానాలు కలుగుతున్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 26 జిల్లాల్లో 64 సర్పంచ్, వెయ్యి ఒకటి వార్డు సభ్యుల స్థానాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఈనెల 6న నోటిఫికేషన్ జారీచేసింది. ఇందులో 30 సర్పంచ్, 756 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. చాలాచోట్ల ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురిచేసి ఏకగ్రీవం చేసుకున్నట్లు ఆరోపణలు వినిపించాయి.నామినేషనే వేయనివ్వకుండా గృహ నిర్బంధం చేసి, పోలీసులతో బెదిరించి వైసీపీ వాళ్లు గెలిచారు. శనివారం జరిగిన పోలింగ్లో సైతం అధికార వైసీపీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసినట్లు విమర్శలు వ్యక్తం అయ్యాయి. కొన్ని చోట్ల పోలింగ్ ఆఫీసర్లను సైతం మేనేజ్ చేశారు. అయినా సరే అధికార పక్షానికి ధీటుగా.. విపక్షాలు సత్తా చాటడం విశేషం. దీంతో పల్లెల్లో కూడా అధికార వైసిపికి ప్రమాద ఘంటికలు వినిపిస్తున్నాయి.

వైసీపీ వైపు నుంచి ఇంతకాలం వినిపించిన థీయరీ కూడా నిజం కాదని తేలిపోయింది. పదుల సంఖ్యలో సర్వేయర్లు వైసీపీ తరపున సామాజిక మధ్యమాల్లో ప్రచారం చేస్తున్న మాట ఒకటి ఉంది. వైసీపీకి పట్టణ ప్రాంతాల్లో కాస్త బలం తగ్గిన మాట నిజమేనని ఆ ప్రచారాల సారాంశం. అర్బన్ లో వైసీపీకి తగ్గినా రూరల్ లో జగన్ ప్రభావం చెక్కు చెదరకుండా మిగిలే ఉందని వైసీపీ బ్యాచ్ వాదిస్తూ వచ్చారు. గ్రామీణ ప్రాంతాల ఓట్లతో జగన్ సునాయాస విజయం సాధిస్తారని చెప్పుకున్నారు. ఇప్పుడది పటాపంచలైంది.వైసీపీ వారి గ్రామీణ కోటలకు బీటలు వారుతున్నాయని తేలిపోయింది. ఊళ్లలో జనం వైసీపీని వ్యతిరేకిస్తున్నారని అర్థమైంది. దానితో ఇప్పుడు టీడీపీ పండుగ చేసుకునే అవకాశం వచ్చింది. పైగా నేషనల్ మీడియా తప్పుడు సర్వేలు చేస్తోందని ఎదురు దాడికి దిగేందుకు కూడా అవకాశం వచ్చింది. ఇక అసలు గేమ్ ఇప్పుడు మొదలవుతుందని టీడీపీ వర్గాలు అంటున్నాయి.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి