జూనియర్ ఎన్టీయార్ ఇప్పుడు రాజకీయాల్లో లేరు. రాజకీయ స్టేట్ మెంట్స్ ఇవ్వడం మానేసి చాలా రోజులైంది.రాజకీయ నాయకులు ఆయనపై విమర్శలు చేసినా మౌనమే సమాధానం అన్నట్లుగా జూనియర్ ఊరుకుంటారు. ఐనా సరే ఎక్కడోక్కడ ఆయన్ను రాజకీయాల్లోకి లాగే ప్రయత్నం మాత్రం కొందరు నేతలు మానుకోలేకపోతున్నారు. ప్రస్తుత ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జూనియర్ పోస్టర్లు వేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ పోస్టర్లు జూనియర్ కు చెప్పే వేశారా..చెప్పకుండా వేశారా అన్నది పెద్ద ప్రశ్న…
జూనియర్ ఎన్టీయార్ సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఆయన రాజకీయాల్లో రావడానికి ఇంకా చాలా టైమ్ ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఓ సారి టీడీపీకి ప్రచారం చేశారే తప్ప క్రియాశీల రాజకీయాల్లోకి వస్తానని జూనియర్ ఎప్పుడూ చెప్పలేదు. ఆయన ఓటు కూడా ఆంధ్రప్రదేశ్లో కాకుండా హైదరాబాద్ మహానగరంలోనే ఉంది. ఐనా సరే పార్టీలు ఆయన్ను రాజకీయాల్లోకి లాగకుండా ఉండలేకపోతున్నాయి. తాజా ఎన్నికల్లో అటు వైసీపీ, ఇటు టీడీపీ జూనియర్ బొమ్మను వాడేసుకుంటున్నాయి. కర్నూలు నియోజకవర్గంలో పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ ఇప్పుడు ఎక్కడ చూసినా జూనియర్ పోస్టర్లను పెట్టించేశారు. ఆయన మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ తనయుడని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తండ్రి బీజేపీలో ఉన్నప్పటికీ కుమారుడు టీడీపీలో కొనసాగారు. ఇక గుడివాడలో కొడాలినాని కూడా ఇప్పుడు జూనియర్ బొమ్మలను వాడుతున్నారు. వైసీపీలో మంత్రిగా కూడా చేసిన కొడాలి నానికి ఫైర్ బ్రాండ్ అన్న పేరు ఎలాగూ ఉంది. ఆయన ఒకప్పుడు జూనియర్ కు అత్యంత సన్నిహితుడు. ఇప్పుడు ఇద్దరం దూరం జరిగామని నాని స్వయంగా చెప్పుకున్న సందర్భాలున్నాయి…
ఎన్టీయార్ ను రెండు పార్టీలు దువ్వడం విశేషం.మరో పక్క టీడీపీ మాత్రం ఎన్టీఆర్ తీరుపై గుర్రుగానే ఉంది. కీలకాంశాల్లో ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడంతో టీడీపీలో పెద్దలు సైతం అసంతృప్తిగా ఉన్నారని సమాచారం…
ఎన్టీయార్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చినప్పుడు జూనియర్ ఏమి మాట్లాడలేదు. అందరూ ఎగబడి తిట్టిన తర్వాత మాత్రమే ఆయన ఒక ట్వీటీ చేశారు. అదీ కూడా రెండు వర్గాలను బ్యాలెన్సింగ్ చేసినట్లుగా ఉందే తప్ప.. ఎన్టీఆర్ పేరు తొలగించినందుకు వైసీపీ ప్రభుత్వాన్ని గట్టిగా మందలించిన దాఖలాలు లేవు. పైగా వైఎస్, ఎన్టీఆర్ ఇద్దరూ మహానాయకులే అని ప్రకటించడంతో.. ఒక వర్గం తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైంది. మరో పక్క చంద్రబాబు అరెస్టు సమయంలో అందరూ స్పందిస్తే జూనియర్ మాత్రం మౌనం వహించారు. రాజకీయాల కోసం వచ్చారో,మరే కారణం చేతనైనా వచ్చారో.. పవన్ కల్యాణ్ రాజమండ్రి జైలుకు వెళ్లి మరీ చంద్రబాబును పరామర్శించారు. ఆయనకు అండగా ఉంటామని మీడియా ముఖంగా ప్రకటించారు. ఇలాంటి అంశాల ఆధారంగా టీడీపీ శ్రేణులు కూడా జూనియర్ పై గుర్రుగా ఉన్నాయి. అయినా ఎన్నికల ప్రచారంలో జూనియర్ ఫోటోను వాడుకోవడం ఆయన అభిమానుల్ని ఆకర్షించడం కోసమేనని చెప్పుకోవాలి…
జూనియర్ ఎన్టీఆర్ అందరివాడ. అందరి అభిమానపాత్రుడా. అందరితో కలిసిపోయే వాడా…ఇలాంటి ప్రశ్నలు అడిగితే ఒక్క దానికి కూడా ఇప్పుడు సమాధానం రాదు. ఎందుకంటే ఆయన అందరితోనూ టచ్ మీ నాట్ అన్నట్లుగా ఉంటున్నారు. ఐనా జూనియర్ పేరు వాడుకోవడం ఒక దింపుడు కళ్లెం ఆశే అవుతుంది….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…