మిషన్ పాజిబుల్ ! ఆమె..ఈమె..

By KTV Telugu On 26 October, 2023
image

KTV TELUGU :-

వాళ్లిద్దరూ అక్కాచెళ్లెళ్లు. ఇద్దరూ వీఐపీ కుటుంబాల్లోకి వెళ్లి సెటిలయ్యారు. అనివార్యంగా వారు రాజకీయాలతో లింక్ ఏర్పరచుకున్నారు. ఇప్పుడు సిస్టర్స్ ఇద్దరూ ఒక రాజకీయ చదరంగంలో భాగమైపోయారు. దృఢ నిశ్చయంతో ముందుకు కదులుతున్నారు. లక్ష్యమే వారిని నిలబెడుతోందని చెప్పక తప్పదు. వారి మధ్య పోటీ లేదు.. అప్పుడప్పుడు వేర్వేరు రాజకీయ పార్టీల్లో ఉన్నందున కాస్త వైరుధ్యం కనిపిస్తోంది. ఈ విభిన్న ప్రయత్నంలో వారు గమ్యాన్ని చేరుకుంటారా. ఒకరు పైచేయిగా నిలిచి  మరోకరు కాస్త వెనక్కి తగ్గాల్సిన  పరిస్థితి ఉంటుందా..

నందమూరి సిస్టర్స్… పురంధేశ్వరి, భువనేశ్వరీ ఇద్దరూ ఆ మహానటుడు, ఉమ్మడి ఏపీకి తొలి ప్రాంతీయ పార్టీ ముఖ్యమంత్రి తారక రామారావు ముద్దుల కూతుళ్లు. పెళ్లి కారణంగా పురంధేశ్వరి ఇంటి పేరు దగ్గుబాటి గానూ, భువనేశ్వరి ఇంటి పేరు నారా గానూ మారిపోయి ఉండొచ్చు. ఐనా వారిలో ప్రవహిస్తున్నది మాత్రం నందమూరి పౌరుషమే. ఎన్టీయార్ అంతటి అభిమాన ధనులు ఆయన ఇద్దరు కూతుళ్లని చెప్పక తప్పదు. తొలి నాళ్లలో ఇద్దరూ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. భర్తలు రాజకీయాల్లో పండిపోయినా వారికి ఇంటిలో చేదోడు వాదోడుగా మాత్రమే కొనసాగారు. అవసరం వచ్చినప్పుడు నందమూరి వారసత్వం జూలు విదిల్చుతుందన్నట్లుగా తర్వాతి కాలంలో వాళ్లు ప్రజల మధ్యకు వచ్చేస్తున్నారు. ఒకరు కాస్త ముందు, మరోకరి కాస్త వెనుక … తేడా అంతవరకే ఉందని చెప్పక తప్పదు.

పురంధేశ్వరి  భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా, మంత్రిగా చేశారు. భువనేశ్వరి భర్త నారా చంద్రబాబు  నాయుడు  మంత్రిగా, ముఖ్యమంత్రిగా అతి పెద్ద ప్రాంతీయ పార్టీ అధినేతగా ఉన్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, అంతే సమయం ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబుకు సంస్కరణవాదిగా ప్రపంచ వ్యాప్తంగా పేరుంది. పురంధేశ్వరి క్రియాశీల రాజకీయాల్లోకి 2004లో ఎంట్రీ ఇచ్చారని చెప్పోచ్చు. వచ్చిందే తడవుగా  ఎంపీ కావడం కేంద్ర మంత్రి పదవిని చేపట్టడం కూడా జరిగిపోయింది. పది సంవత్సరాలు ఆమె సెంట్రల్ కేబినెట్ లో ఉన్నారు. విభజన వేళ 2014లో కాంగ్రెస్ కు దూరమయ్యారు. బీజేపీలో చేరారు. రెండు సార్లు ఓడిపోయినా ఆమెకున్న ఇమేజ్ కు మాత్రం ఎలాంటి డేమేజ్ జరగలేదు. ఆమె పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారని, అంకితభావంతో  పనిచేస్తారని కూడా రెండు జాతీయ పార్టీల నేతలు ఒప్పుకుంటారు.

భువనేశ్వరి నిన్నటి దాకా రాజకీయాల  గురించి మాట్లాడలేదు. హెరిటేజ్ సంస్థలో వ్యాపార లావాదేవీలు  చూసుకుంటే, అంతే అంకితభావంతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆమె తనకుంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. నిండు సభలో  వైసీపీ నేతలు ఆమె పట్ల అసభ్య పదజాలాన్ని వాడినప్పుడు కూడా భువనేశ్వరి  తన సంయమనాన్ని కోల్పోలేదు. నిబద్ధతను  పాటిస్తూ తాను ఎన్టీయార్ కూతురినని నిరూపించుకున్నారు. భర్త చంద్రబాబును అరెస్టు చేసిన తర్వాతే ఆమె బయటకు వచ్చారు. ఇప్పుడు రాజమండ్రిలో తాత్కాలిక బస ఏర్పాటు చేసుకుని  భర్తతో మలాఖత్ కు వెళ్తున్నారు.  టీడీపీ వారిని కలుస్తూ వారికి ధైర్యం చెప్పేందుకు సమయాన్ని కేటాయిస్తున్నారు. ఎక్కడా విసుగు విరామం లేకుండా అహర్నిశలు  కార్యకర్తలతో మమేకామయ్యేందుకు భువనేశ్వరి ప్రయత్నిస్తూనే ఉన్నారు.

పురంధేశ్వరి ఇప్పుడు బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షురాలిగా ఉన్నారు. అక్కడ అందరినీ కలుపుకుపోతూ ఆంధ్రప్రదేశ్లో జీరోగా ఉన్న పార్టీని హీరోని చేసేందుకు తన వంతు కృషి  చేస్తున్నారు. మోదీ, అమిత్ షాకు ఆమెపై పూర్తి విశ్వాసం ఉందనేందుకు తరచూ ఆమెను పిలిపించి మాట్లాడటమే నిదర్శనంగా చెప్పుకోవాలి. రాజకీయాల్లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న ఆమె  ప్రతీ అంశంలోనూ ధైర్య సాహసాలను ప్రదర్శిస్తున్నారు. సామాజికపరంగానూ, చంద్రబాబుకు బంధువైనందునను వైసీపీ  నేతలు ఆమెను తీవ్ర పదజాలంతో విమర్శిస్తున్నప్పటికీ పురంధేశ్వరి ఎప్పుడూ సహనాన్ని కోల్పోలేదు. ఆమె ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పనిచేయడం లేదని, ఏపీ టీడీపీ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారని వేసీపీ నేతలు పలు పర్యాయాలు ఆరోపించినా… వినీ విననట్లుగా ఊరుకున్నారు. ఏపీ ప్రజలకు బీజేపీ అధిష్టానానికి వారధిలా ఉండాలనుకున్నారే తప్ప ఇతర విషయాలను పట్టించుకోదలచుకోలేదు.

నిజానికి పురంధేశ్వరి  పట్ల టీడీపీ వారికి కూడా కొంత అసంతృప్తి ఉందని వార్తలు వస్తున్నాయి. చంద్రబాబుకు అనుకూలంగా లాబీయింగ్ చేయడం లేదని, పైగా టీడీపీని ఇబ్బంది   పెట్టాలనుకుంటున్న కమలం పార్టీ పెద్దలను  వెనుకేసుకొస్తున్నారని ఆమెపై టీడీపీ  నేతలు లోలోన ఆరోపణలు సంధిస్తున్నారు. ఐనా పురంధేశ్వరి పట్టించుకోదలచుకోలేదు.బీజేపీలో తాను చేయగలిగిందీ చేస్తున్నారు. చంద్రబాబు అరెస్టును తొలుత ఖండించింది కూడా ఆమే కదా. ఏపీ పరిణామాలను ఆమె ఎప్పటికప్పుడు బీజేపీ పెద్దల దృష్టికి  తీసుకెళ్తున్నందునే అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగి లోకేష్ ను పిలిపించుకుని మాట్లాడారు. మరో పక్క భువనేశ్వరి ఒక బృహత్కార్యానికి తెరతీశారు. ఇప్పుడామె స్వయంగా నిజం గెలవాలి యాత్రకు శ్రీకారం చుడుతున్నారు. ప్రజల్లో ఉండేలా కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. చంద్రబాబు అరెస్టు తర్వాత.. పలువురు టీడీపీ కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. ఆ కుటుంబాలను పరామర్శించాలని  నారా భువనేశ్వరి నిర్ణయించుకున్నారు.చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చి జనంలో తిరిగే వరకు భువనేశ్వరి క్రియాశీలంగా ఉండాలని డిసైడయ్యారు.దీనికి నిజం గెలవాలి యాత్ర ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

అక్కా, చెల్లెలు ఇద్దరూ తమ తమ యాంబిషన్ తో రాజకీయాల్లో అడుగులు వేస్తున్నారు. బీజేపీని ఎలాగైనా ఏపీలో నిలబెట్టాలన్నది పురంధేశ్వరి సంకల్పం. అదే జరిగితే ఆమె ముఖ్యమంత్రి కావడమో, మళ్లీ కేంద్ర మంత్రి కావడమే తథ్యం. పైగా ఆమె మంచి వక్త. రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న మచ్చ లేని నాయకురాలు. మరో పక్క భువనేశ్వరి ఆశ, శ్వాస రెండూ తెలుగుదేశమే. భర్త చంద్రబాబును మళ్లీ సీఎంగా చూడాలన్నది ఆమె ఆకాంక్షం. అదీ ఆయన కోసమో తన కోసమో కాదు. రాష్ట్ర ప్రజల కోసం తాను పాటుపడుతున్నానని ఆమెకు తెలుసు. చంద్రబాబు  వస్తే రాష్ట్రం మళ్లీ గాడిలో పడుతుందని ఆమె విశ్వాసం. మరి పురంధేశ్వరి, భువనేశ్వరి ఇద్దరిలో ఎవరి  కోరిక నెరవేరుతుంది. ఎవరి మిషన్ పాజిబుల్ అవుతుందో… చూద్దాం…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి