పుట్టపర్తిలో గెలుపెవరిది ?

By KTV Telugu On 17 February, 2024
image

KTV TELUGU :-

ఉమ్మడి అనంతపురం జిల్లాలో అత్యంత కీలకమైన నియోజకవర్గాల్లో ఒకటి పుట్టపర్తి. ఇప్పుడు సత్యసాయి జిల్లాగా మారిన తర్వాత జిల్లా కేంద్రం అయింది.  అయితే రాజకీయాలో మాత్రం పెద్దగా మార్పులు రాలేదు. పాలన కూడా ఉమ్మడి జిల్లా అంటూ నడిపిస్తున్నారు. టీడీపీ తరపున పల్లె రఘునాథరెడ్డి మరోసారి పోటీ చేయడం దాదాపు ఖాయమైతే.. వైసీపీలో మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు మరో నేత గట్టిగా పోరాడుతున్నారు. వారి మధ్య పోరులో టీడీపీకి అడ్వాంటేజ్ లభిస్తోంది.

ఏపీలోని కీలక నియోజకవర్గాల్లో ఒకటి పుట్టపర్తి. శ్రీసత్యసాయిబాబా జన్మస్థలం కావడంతో ఆధ్యాత్మిక క్షేత్రంగా పుట్టపర్తి ఉంది. ఇక్కడికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో రాజకీయంగానూ ప్రాధాన్యం ఉన్న సెగ్మెంట్ ఇది. 2014 దాకా టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం గత టర్మ్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించింది.  2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ మధ్య ద్విముఖపోరు నెలకొనగా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి 57 శాతం ఓట్లు  సాధించి భారీ మెజార్టీతో విజయం సాధించారు.  టీడీపీ నుంచి పోటీ చేసిన సీనియర్ లీడర్ పల్లె రఘునాథ్ రెడ్డికి 39 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక ఇతరులకు 4 శాతం ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గెలవడానికి ప్రధాన కారణం.. ఇదే పుట్టపర్తి సెగ్మెంట్ లో వైసీపీ కీలక నేత, 2014లో ఆ పార్టీ నుంచి పోటీ చేసిన సి.సోమశేఖర రెడ్డి సపోర్ట్ ఇవ్వడమే. ఇంకోవైపు నాటి టీడీపీ ప్రభుత్వంపై వచ్చిన సహజ వ్యతిరేకత, పల్లె రఘునాథ్ రెడ్డి వరుసగా గెలిచిన పరిస్థితి ఉండడంతో పుట్టపర్తి ఓటర్లు వైసీపీకి పట్టం కట్టారు.

ఈసారి కూడా టీడీపీ, వైసీపీ మధ్య ద్విముఖపోరుకు రంగం సిద్ధమైంది.  సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మళ్లీ పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.  కానీ టిక్కెట్ ఇంత వరకూ ఖరారు చేయలేదు. దీనికి కారణం గత ఎన్నికల్లో మద్దతు ఇచ్చిన కీలక నేత సోమశేఖర్ రెడ్డి ఈ సారి తనకే టిక్కెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు.  తాను పార్టీలో చాలా సీనియర్ నాయకుడిననని.. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని తనకు అవకాశం ఇవ్వాల్సిందేనని సోమశేఖర్ రెడ్డి అంటున్నారు.  2014 ఎన్నికల్లో కూడా తక్కువ తేడాతో ఓడిపోయానని.. గత ఎన్నికల్లో  త్యాగం చేయమంటే చేశాను కానీ ఈ సారి మాత్రం ఒప్పుకునేది లేదంటున్నారు.  2019 ఎన్నికల్లో  జగన్ చెప్పినట్లే శ్రీధర్ రెడ్డికి అవకాశం ఇవ్వాలంటే నేను తప్పుకున్నానని..  ప్రస్తుతం బలమైన ప్రతిపక్ష నేతను ఢీకొట్టాలంటే ఇవతల వైపు కూడా బలమైన వ్యక్తి ఉండాలని.. నేను బలమైన వ్యక్తిని నాకు టికెట్ కేటాయించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. ఆయన మాటల్ని  బట్టి చూస్తే శ్రీధర్ రెడికి చాన్సిస్తే పని చేసే అవకాశం లేదని తెలిసిపోతుంది.

ప్రభుత్వంతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యే  పై కూడా అసంతృప్తి ఎక్కుగా ఉన్నన సూచనలు కనిపిస్తున్నాయి. ప్రధాన రోడ్లు అధ్వాన్నంగా ఉండడం ..చిత్రావతి నుంచి ఇసుక మాఫియా ఆగడాలపై జనంలో ఆగ్రహం కనిపిస్తోంది.     టీడీపీ నుంచి పోటీ చేసే పల్లె రఘునాథ్ రెడ్డి గతంలో మూడు సార్లు గెలిచారు.   మూడుసార్లు పల్లె రఘునాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినా అవినీతి ఆరోపణలు లేకపోవడం. జనంలో క్లీన్ ఇమేజ్ ఉండడం  ఆయనపై మళ్లీ ప్రజలకు నమ్మకం కలగడానికి కారణం అవుతోంది.  ఇక్కడ జనసేన యాక్టివ్ గా లేకపోవడంతో తమకు కేటాయించాలని కోరే అవకాశాలు కూడా లేవు.  జనసేనవైపు ఉండే కమ్యూనిటీలన్నీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థికే ఓటు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంపై ఉన్న యాంటీ ఇంక్యుంబెన్సీ కూడా టీడీపీ గెలిచే అవకాశాలను పెంచుతున్నట్లు కనిపిస్తోంది.

అనంతపురం జిల్లా బాధ్యతల్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. ఆయన జిల్లాలో అత్యధిక సమయం గడుపుతున్నారు. పరిస్థితి బాగోలేదని ఆయన పలుమార్లు పార్టీ నేతలతోనే చెప్పారు. అందుకే అభ్యర్థుల్ని మార్చేస్తున్నామని.. అభ్యర్థులను మార్చిన తర్వాత పరిస్థితి అనుకూలంగా మారుతోందని అంటున్నారు. అందుకే అందరూ సహకరించాలని అంటున్నారు. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి ి రావాలన్న కసితో అందరూ కలిసి పని చేస్తున్నారు. కానీ అధికారంలోకి వచ్చాక పవర్ అంతా ఎమ్మెల్యేనే అనుభవిస్తూ ఇతర  నేతల్ని ఎదగనీయడం లేదు. ఆ కారణంగా గ్రూప్ పోరాటాల్ని నిలువరించడంలో  వైసీపీ పెద్దలు విఫలమవుతున్నారు. ఆ ఎఫెక్ట్ పుట్టపర్తిలోనూ కనిపిస్తోంది…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి