వై.ఎస్.షర్మిలను కాంగ్రెస్ పార్టీలో చేర్పించింది ఎవరు? ఆమె తనంతట తానుగా కాంగ్రెస్ లో చేరలేదా? వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికి ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే కాంగ్రెస్ పెద్దలతో కుమ్మక్కై షర్మిలను కాంగ్రెస్ లో చేర్పించారా? షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల వచ్చే ఎన్నికల్లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా నష్టం వాటిల్లే అవకాశాలుంటాయా? వై.ఎస్.కుటుంబంలో నిజంగానే విబేధాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయా? ఏం జరుగుతోంది అసలు ఏపీలో?
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.ఆర్. కూతురు వై.ఎస్.ఆర్. తెలంగాణా పార్టీ అధినేత్రి వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు.రాహుల్ గాంధీ సమక్షంలో చేరిన షర్మిల ఆ తర్వాత సోనియా గాంధీని కలిశారు. షర్మిలకు ఏం బాధ్యతలు అప్పగిస్తారన్నది ఇంకా తేలలేదు. ఏపీ పిసీసి అధ్యక్ష పదవి ఇస్తారని ఒక ప్రచారం అయితే జరుగుతోంది. అయితే తెలంగాణా నుంచి ఆమె లోక్ సభ ఎన్నికల బరిలో దిగుతారని మరో ప్రచారం నడుస్తోంది. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడ్డమే తన కల అని వై.ఎస్.ఆర్. అనేవారు. తన
తండ్రి కలను నిజం చేయడమే తన లక్ష్యం అంటున్నారు షర్మిల.షర్మిల ఏపీ కాంగ్రెస్ లో ఎంట్రీ ఇస్తే వచ్చే ఎన్నికల్లో రాజకీయ సమీకరణలు ఎలా ఉంటాయన్న అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
షర్మిల ప్రభావం ఎలా ఉంటుందనేది పక్కన పెడితే ఇపుడు దీని వెనుక టిడిపి అధినేత చంద్రబాబు నాయుడి కుట్ర దాగుందని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. కుటుంబంలో చీలికలు తెచ్చే కుట్రలు జరుగుతాయని రెండురోజుల క్రితమే జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. అదే రోజున షర్మిల కాంగ్రెస్ లో చేరడానికి ఢిల్లీ వెళ్లారు. అయితే కాంగ్రెస్ లో షర్మిల చేరడానికి చంద్రబాబు నాయుడే ప్లాన్ చేశారన్నది వైసీపీ ఆరోపణ. ఈ మధ్య చంద్రబాబు నాయుడు ఎయిర్ పోర్ట్ లో కర్నాటక డిప్యూటీ సిఎం కాంగ్రెస్ నాయకుడు డి.కె.శివకుమార్ తో ఏకాంతంగా మాట్లాడ్డం చర్చనీయాంశమైంది. ఆ తర్వాత షర్మిల దంపతులు టిడిపి నేతలతో సన్నిహితంగా ఉండడం సంచలనమైంది. సిఎం రమేష్ విమానంలో షర్మిల గన్నవరం వెళ్లడం.. టిడిపి నేత బిటెక్ రవితో బ్రదర్ అనిల్ ఫోటో దిగడం టిడిపి-షర్మిల మిలాఖత్ కు నిదర్శనాలని వైసీపీ అంటోంది.
గతంలోనూ కాంగ్రెస్ పార్టీ వై.ఎస్.ఆర్. కుటుంబంలో చీలిక తెచ్చేందుకు ప్రయత్నించిందని వైసీపీ దుయ్యబడుతోంది. వై.ఎస్.ఆర్. మరణానంతరం జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ వీడిన తర్వాత ఉప ఎన్నికల్లో వై.ఎస్.విజయమ్మపై వై.ఎస్.కుటుంబానికే చెందిన వై.ఎస్. వివేకానంద రెడ్డిని కాంగ్రెస్ పార్టీ బరిలో దించింది. అప్పట్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో రహస్య మైత్రి కొనసాగిస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ వీడిన తర్వాత ఆయనపై కాంగ్రెస్ పార్టీ కేసు పెట్టినపుడు అందులో చంద్రబాబు నాయుడి పార్టీ కూడా ఇంప్లీడ్ అయ్యింది. అప్పట్నుంచి టిడిపి-కాంగ్రెస్ లు కలిసి కట్టుగానే వైసీపీపై కుట్రలు చేస్తున్నాయని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపిస్తున్నారు.
ఎన్నికలకు మూడు నెలల సమయం మాత్రమే ఉన్న తరుణంలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోన్న సామాజికార సాధికార బస్సు యాత్రకు అద్భుతమైన స్పందన వస్తోందన్న భయంతోనే దాన్ని దారి మళ్లించడానికి చంద్రబాబు నాయుడు కొత్త కుట్రకు తెర తీశారని..అందులో భాగంగానే షర్మిలను కాంగ్రెస్ లో చేర్పించారని వైసీపీ వాదిస్తోంది. అయితే జగన్ మోహన్ రెడ్డి తన ఇంట్లో తానే చిచ్చురేపుకుని ఆ నెపాన్ని తమపైకి నెట్టేస్తున్నారని చంద్రబాబు నాయుడు మండి పడ్డారు. వచ్చేఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతోనే వైసీపీ నేతలు చిత్ర విచిత్ర ఆరోపణలు చేస్తున్నారని చంద్రబాబు అంటున్నారు.
షర్మిల ఎపిసోడ్ ఒక పక్క నడుస్తుండగానే మరో పక్క వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి మాత్రం క్షణం తీరిక లేకుండా చెస్ ఆడేస్తున్నారు. ఒక పక్క వచ్చే ఎన్నికలకోసం అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ చేపడుతూ అందులోనూ సామాజిక న్యాయానికి పెద్ద పీట వేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. మరో పక్క ప్రభుత్వ పరంగా అమలు చేయాల్సిన పథకాలను అమలు చేసుకుపోతున్నారు. తన పాలనలో మంచి జరిగిందని అనిపిస్తేనే మా పార్టీకి ఓటు వేయండి అని ఆయన నిక్కచ్చిగా పిలుపు నిస్తున్నారు. అదే సమయంలో టిడిపి,జనసేనలతో పాటు వాటికి అనుకూల మీడియాలను ఉద్దేశించి వారిది గజదొంగల ముఠా అంటూ నిప్పులు చెరుగుతున్నారు. టిడిపి జనసేన పొత్తు, షర్మిల కాంగ్రెస్ లో చేరిక వంటి అంశాలు వచ్చే ఎన్నికల్లో ఎలాంటి ప్రభావాలను చూపుతాయో ఇపుడే చెప్పలేం. జగన్ మాత్రం వైనాట్ 175 అంటూనే ఉన్నారు…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…