ఆంధ్రా ఊటీలో కింగ్ ఎవరు ?

By KTV Telugu On 26 January, 2024
image

KTV TELUGU :-

అరకు నియోజకవర్గం పూర్తిగా గిరరిజనులతో నిండి ఉంటుంది.   మత మార్పిళ్లు , ఇతర కారణాల వల్ల ముందుగా కాంగ్రెస్ ఆ తర్వాత వైసీపీ కంచుకోటగా మారింది.  గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ డిపాజిట్ కోల్పోయిన ఏకైక నియోజకవర్గం ఇది.  ఇక్కడ కూడా వైసీపీ అభ్యర్థిని మార్చేసింది. టీడీపీ ముందుగానే క్యాండిడేట్ ను ప్రకటించింది. ? ఈ నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది ?.

ఆంధ్రా ఊటీగా పేరున్న అరకు రాజకీయాలు ఈసారి ఆసక్తికరంగా మారాయి. అల్లూరి జిల్లాలో టూరిజం స్పాట్ గా అరకుకు దేశవ్యాప్త గుర్తింపు ఉంది.  ఆంధ్రా ఒడిశా బార్డర్ లో ఈ సెగ్మెంట్ ఉంది. ఒడిశాలోని కోరాపుట్ జిల్లాతో సరిహద్దులు పంచుకుంటోంది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో అరకు సెగ్మెంట్ ను ఏర్పాటు చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇక్కడ 94 శాతం మంది ఎస్టీ జనాభానే ఉంది. అరకు సెగ్మెంట్ కు ఈ సారి ఎంపీ గొడ్డేటి మాధవిని వైసీపీ ఇంఛార్జ్ గా నియమించింది. సిట్టింగ్ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణకు టిక్కెట్ నిరాకరించినట్లయింది.

గత ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన దొన్ను దొర సియ్యారి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగడం ఖాయమైంది. అరకు కదలిరా సభలో చంద్రబాబు దొన్నుదొర పేరును అధికారంగా ప్రకటించేశారు.

2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అరకు నియోజకవర్గంలో వైసీపీ నుంచి చెట్టి ఫాల్గుణ పోటీ చేశారు. సమీప ప్రత్యర్థి అయిన టీడీపీ ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. కేవలం 13 శాతం ఓట్లతోనే సరిపెట్టుకున్నారు. అటు మొదటి నుంచి వైసీపీలో ఉండి, యాక్టివ్ గా పని చేసినా సివేరి దొన్నుదొర కి 2014, 2019లో ఆ పార్టీ టిక్కెట్ దక్కలేదు. దీంతో ఆయన 2019లో ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. టీడీపీని దాటేసి… 18 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత టీడీపీలో జాయిన్ అయ్యారు. టీడీపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా ఉన్నారు. అరకు టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ గా బాధ్యతల్లో ఉన్నారు.

మైదాన ప్రాంత నియోజకవర్గాల్లో ఉండే కులాలు ఇక్కడ దాదాపుగా ఉండవు. 94 శాతం ఎస్టీ వర్గాలు కావడంతో అందులోనే ఉప వర్గాలతో ఒకరికొకరు పోటీ పడుతూంటారు.  అరకు నియోజకవర్గంలో కొండ దొర సామాజిక వర్గం 36 శాతంతో డామినెంట్ గా ఉంది.  అలాగే బగత సామాజికవర్గం ప్రజలు తర్వాతి స్థానంలో ఉంటారు.  కీలకమైన వాల్మీకి కమ్యూనిటీ ఓటర్లు కూడా గెలుపును ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు.  ఒడిశా బోర్డర్‌లో ఎక్కువగా ఉండే  కోటియా సామాజికవర్గానికి చెందిన గిరిజనులు  కూడా కాస్త ఎక్కువ మంది ఉన్నారు.  వీరిలో  కొండ దొర సామాజికవర్గ ప్రజలు ముందు నుంచి టీడీపీకి మద్దతుగా ఉన్నారు. ఇతర వర్గాలు వైసీపీకి మద్దతుగా ఉంటున్నాయి. ఇతర వర్గాల్లో ఎక్కువగా మత మార్పిళ్లు జరిగాయి.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. అరకు అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ సివేరి దొన్ను దొర నియోజకవర్గం మొత్తం కలియతిరుగుతున్నారు. ఆయనను రెండు సార్లు వైసీపీ మోసం చేసిందన్న సానుభూతి కనిపిస్తోంది. ఆయనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. అందరితో కలిసిపోతారు. సివేరి దొన్నుదొర  ప్రతి రోజు ప్రజల్లో ఉండేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వైసీపీ నుంచి వచ్చినప్పటికీ.. ఇతర నేతలు పూర్తిగా సహకారం అందిస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలవకపోయినప్పటికీ ఆరు నెలల వరకూ మంత్రిగా ఉన్న కిడారి శ్రవణ్ కుమార్ కూడా టిక్కెట్ ఇవ్వకపోయినా దొన్నుదొరకు సహకరిస్తున్నారు. అయితే ..  ఎంపీ గొడ్డేటి మాధవికి క్యాడర్ సహకరించడం లేదు. పరిస్థితిని హైకమాండ్ కలుగ చేసుకుని సరిదిద్దితే పరిస్థితి మెరుగవుతుంది.

అరకులో కూడా వైసీపీకి గడ్డు పరిస్థితి ఎదురయితే ఇక రాష్ట్రం మొత్తం మీద వైసీపీ పరిస్థితి ఘోరంగా ఉన్నట్లే. ఇక్కడ కూడా అభ్యర్థిపై వ్యతిరేకత ఉందన్న కారణంతో మార్చడం వల్ల వైసీపీ సెంటిమెంట్ దెబ్బతింటోంది. ఎన్నికల సమయానికి ఏమైనా జరగవచ్చని చెబుతున్నారు. గిరిజనులు ఎప్పుడూ పార్టీలకు స్టిక్ కారు…. తమకు ఎవరు మేలు చేస్తారనుకుంటే వారికే ఓట్లు వేస్తారు.  కానీ వారిని ఆకట్టుకునే విషయంలో వైసీపీ ఎప్పుడూ ముందు ఉంటోంది…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి