గురజాలలో విజేత ఎవరో..?

By KTV Telugu On 25 January, 2024
image

KTV TELUGU :-

పల్నాడు జిల్లాలో అత్యంత ప్రధానమైన నియోజకవర్గాల్లో గుజరాల ఒకటని చెప్పాలి. పేరుకు గురజాలే అయినా డామినేషన్ పిడుగురాళ్లదనే ఒప్పుకోవాలి. ప్రస్తుత ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గెలుస్తారా అంటే అది మిలియన్ డాలర్ ప్రశ్న అవుతుందని వైసీపీ వర్గాలు అంటున్నాయి. టీడీపీకి  చెందిన మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు దూసుకుపోతున్నారని వార్తలు  వస్తున్నాయి. అసలు గురజాల కథాకమావిషు ఏమిటో చూద్దాం…

గురజాల నియోజకవర్గంలో విచిత్ర పరిస్థితులున్నాయి. గురజాల కొంచెం లూప్ లైన్లో మాచర్ల వైపు ఉండటం, పిడుగురాళ్ల ప్రధాన హైవేపై హైదరాబాద్ వెళ్లే మార్గంలో ఉండటంతో పాటు బాగా అభివృద్ధి చెందడంతో నియోజకవర్గం కేంద్రం కంటే ఇతర ప్రాంతాలు బాగా ఉన్నాయన్న టాక్ వచ్చేసింది. గత ఆరు ఎన్నికలు చూసుకుంటే టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు మూడు సార్లు గెలిచారు. 2014లో ఆయన గెలిచినప్పుడు మంత్రి పదవి కూడా వస్తుందనుకున్నారు.అప్పటి సీఎం చంద్రబాబు సామాజికవర్గం సమీకరణాలను  చూసుకుని ఆయనకు మంత్రిపదవి ఇవ్వలేకపోయారు. 1999,2004లో  కాంగ్రెస్ తరపున జంగా కృష్ణమూర్తి గెలిచినప్పుడు కూడా టీడీపీ  అభ్యర్థిగా యరపతినేని  శ్రీనివాసరావే ఉన్నారు.  2019లో పల్నాడు ప్రాంతంలో వైసీపీ ప్రభంజనం కనిపించింది. అప్పుడు కాసు మహేష్ రెడ్డి విజయం సాధించారు. ఆయన స్థానికుడు  కాకపోయిన రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన పలుకుబడితో వైసీపీలో గురజాల టికెట్  దక్కించుకున్నారు…

ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో  గురజాల టఫ్ ఫైట్ అనే చెప్పాలి. టీడీపీ అభ్యర్థి యరపతినేని పట్ల ఓటర్లు సుముఖంగా ఉన్నారు. పైగా ప్రస్తుత ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పట్ల వ్యతిరేకత పెరిగి….నియోజకవర్గం మార్చుకునే ఆలోచనలో ఉన్నారు..

సమస్యలు విలయతాండవమాడే నియోజకవర్గాల్లో గురజాల ఒకటని చెప్పాలి. ఒకప్పుడు గురజాల, దాచేపల్లి రోడ్డు అద్వాన్నంగా  ఉండేది. ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో కొంత మేర రిపేర్లు జరిగినా అది అంతంతమాత్రంగానే కనిపిస్తోంది. పిడుగురాళ్ల బైపాస్ సగం ప్రారంభించి వదిలేశారన్న అపవాదు స్థానిక ఎమ్మెల్యేపై ఉంది. పక్కనే కృష్ణా నది ఉన్నా.. తాగు, సాగునీటికి కష్టాలు తప్పడం లేదు. ఇటీవలే సమగ్ర సాగునీటి పథకానికి శ్రీకారం చుట్టినా  అది  పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదు. సరైన  రోడ్డు వసతి లేని గ్రామాలు గురజాల నియోజకవర్గంలో ఎక్కువగానే కనిపిస్తాయి.పిడుగురాళ్ల మినహా ఎక్కడా ఉపాధి కల్పించే పరిశ్రమలు లేవు. ఇలా చెప్పుకుంటూ పోతే గురజాలకు సవాలక్ష సమస్యలు ఎదురవుతాయి..ఇక రాజకీయ అంశాల విషయానికి  వస్తే వైసీపీ అభ్యర్థిగా గెలిచినప్పటి నుంచి కాసు మహేష్ రెడ్డి ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటూనే ఉన్నారు. ల్యాండ్, శాండ్, మైనింగ్ స్కాముల్లో ఆయన  పేరు వినిపిస్తోంది. ఐనవారికే కాంట్రాక్టులు ఇప్పించుకుంటూ పనులు జరగకపోయినా వదిలేశారన్న చర్చ కూడా ఉంది. పైగా గురజాల వైసీపీలో గ్రూపు  రాజకీయాలు బాగా పెరిగిపోయాయి. నిజానికి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బీసీ సామాజికవర్గం నేత జంగా కృష్ణమూర్తిని పక్కన పెట్టి కాసు మహేష్ రెడ్డికి జగన్ టికెటిచ్చారు. తర్వాత జంగా ఎమ్మెల్సీ అయినప్పటికీ గురజాల నియోజకవర్గంపై ఆయన ఆశలు వదులుకోలేదు. ఇప్పుడు టికెట్ తనకే కావాలని ఆయన పట్టుబడుతున్నారు.ఈ నేప‌థ్యంలో త‌న సామాజిక వ‌ర్గంతోపాటు.. బీసీ సంఘాల‌ను కూడా జంగా ఏకం చేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌నే పోటీ చేయ‌నున్నాన‌ని ఆయ‌న ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. సీఎం జ‌గ‌న్‌పై త‌న‌కు న‌మ్మ‌కం ఉంద‌ని అన్నారు.ఇటీవ‌ల‌.. వైసీపీ సాధికార బ‌స్సు యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా జ‌రిగినా.. గుర‌జాల‌లో మాత్రం జ‌ర‌గ‌లేదు. దీనికి కార‌ణం.. జంగా స‌హ‌క‌రించ‌క‌పోవ‌డ‌మేన‌న్న‌ది తెలిసిందే. ఇక‌ గురజాలలో పోటీ చేసేకంటే  నరసరావుపేటకు మారిపోవడం మంచిదని కాసు మహేష్ భావిస్తున్నట్లు సమాచారం. అక్కడ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఎర్త్ పెట్టే పనిలో మహేష్ ఉన్నారు. తాడేపల్లి ప్యాలెస్ లో కూడా దీనిపై చర్చ జరగగ్గా త్వరలో స్పష్టత వస్తుందని ఎదురుచూస్తున్నారు. మరో పక్క 2019లో ఓడిపోయిన టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు ఆ రోజు నుంచి జనంలోనే ఉంటున్నారు. నియోజకవర్గంలో రోజు వారీ తిరుగుతూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. తన సొంత డబ్బులతో పేదలకు సాయం చేస్తున్నారు. దానితో ఇప్పుడు టీడీపీ అధిష్టానానికి ఆయనపై  విశ్వాసం మరింతగా పెరిగింది. టికెట్ ఇస్తే యరపతినేని  సునాయాసంగా గెలుస్తారన్న టీడీపీ అంచనా వేసుకుంటోంది…

ఈ సారి  గురజాల పోరు ఫోటో ఫినిష్ అనే చెప్పాలి. అక్కడ కమ్మ, రెడ్డి సామాజికవర్గాల మధ్య సంఘర్షణ ఎక్కువగానే ఉంటుంది. మాచర్ల నియోజకవర్గంలో ఉన్నంతగా ఫ్యాక్షన్ లేకపోయినా ఉద్రిక్తతలు మాత్రం అక్కడక్కడా కనిపిస్తున్నాయి. మరి  బాగా వెనుకబడిపోయిన గురజాలను  బాగుచేసే వారికే జనం ఓటేస్తారా లేక కమ్మ, రెడ్డి, బీసీ లెక్కలు వేసుకుని అభ్యర్థిని గెలిపించుకుంటారా అన్నది చూడాలి…..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి