పెడనలో గెలుపు పడవ ఎక్కేదెవరు ?

By KTV Telugu On 27 January, 2024
image

KTV TELUGU :-

ఏపీ అధికార పార్టీలో బాగా నోరున్న నేత జోగి రమేష్ . జగన్ ను మెప్పించడానికి ఆయన ఎవరిపైనైనా ఎలాంటి పదాలతో అయినా విరుచుకుపడతారు.  ఆయన అభిమానాన్ని అలాగే చూరగొని మంత్రి కూడా అయ్యారు. కానీ ఎన్నికల దగ్గరకు వచ్చే సరికి తన  అభిమాని ఓటమి అంచులో ఉన్నారని గుర్తించి నియోజకవర్గం మార్చేశారు సీఎం జగన్. పెడనను ఆయనను తప్పించారు. మరి ఆయనను తప్పించిన తర్వాత పెడనలో పరిస్థితి మెరుగుపడిందా ? .  టీడీపీ కంచుకోటలో జనసేన మద్దతు తోడైతే వైసీపీ రేసులో ఉండగలదా ?ఉమ్మడి కృష్ణా జిల్లాలో పెడన నియోజకవర్గం కీలకమైనది.  టీడీపీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గంలో గత ఎన్నికల్లో సీఎం జగన్ ప్రయోగం చేశారు. అది సక్సెస్ అయింది.

2019 ఎన్నికల్లో వైసీపీ తరపున జోగి రమేష్‌ పోటీ చేసి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో ఆయనకు 42 శాతం ఓట్లు పోలయ్యాయి. అయితే ఈ ఎన్నికల్లో జనసేన పోటీ చేయడంతో భారీ సంఖ్యలో ఓట్లు చీలాయి. దీంతో టీడీపీ అభ్యర్థి కాగిత కృష్ణ ప్రసాద్‌కు 37 శాతం ఓట్లు పోలయ్యాయి. తండ్రి కాగిత వెంకట రావు చరిష్మా, టీడీపీ సాంప్రదాయ ఓటు బ్యాంక్‌ ఆయనకు అండగా నిలిచింది.   ఆయన కేవలం స్వల్ప మార్జిన్‌తో ఓటమిని చవి చూశారు. జనసేన తరపున అంకెం లక్ష్మీ శ్రీనివాస్‌ పోటీ చేసి ఏకంగా 17 శాతం ఓట్లు సంపాదించారు. నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో ఉన్న కాపు సామాజిక ఓట్లు ఆయనకే పడ్డాయి. అంతేకాదు ఆయన సొంత సామాజిక వర్గమైన గౌడ సామాజిక ఓటర్లు కొంత మంది కూడా ఆయనకు మద్ధతుగా నిలిచారు. దీంతో భారీ సంఖ్యలో ఓట్లు చీలాయి. మరి ఈసారి ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి బరిలోకి దిగుతుండటం.. జోగి రమేష్‌ పెనమలూరుకు వెళ్లడంతో  నియోజకవర్గంలో పరిస్థితి మారిపోయింది.

2009లో నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా కొత్త నియోజకవర్గంగా పెడనను ఏర్పాటు చేశారు.  నిన్నా మొన్నటి వరకు పెడన టికెట్‌ కోసం జరిగిన పంచాయితీ అంతా ఇంతా కాదు. 2019 ఎన్నికల్లో గెలిచిన జోగి రమేష్‌ను వైసీపీ అధిష్టానం పెనమలూరుకు పంపడంతో వైసీపీలో జరిగిన అంతర్గత పోరుకు కాస్త చల్లబడినట్టే కనిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో కాపు, గౌడ సామాజికవర్గాలదే హవా అని చెప్పాలి. గత ఎన్నికల్లో గౌడ కులస్తులనే బరిలోకి దింపాయి వైసీపీ, టీడీపీ పార్టీలు. ఈసారి కొత్త అభ్యర్థి రాముకు వైసీపీ టికెట్ కేటాయించగా.. టీడీపీ గత ఎన్నికల్లో పోటీ చేసిన కాగిత కృష్ణ ప్రసాద్‌కే మరోసారి టికెట్‌ కేటాయించే అవకాశం ఉంది.

పెడన నియోజకవర్గంలో కాపులు, గౌడ్‌లు అధిక సంఖ్యలో ఉన్నారు. నియోజకవర్గంలో 31 శాతం కాపులు ఉన్నారు. వీరే డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా ఉన్నారు. వీరిలో ఎక్కువగా టీడీపీ వైపు ఉంటూ వస్తున్నారు.   2019 ఎన్నికల్లో వీరి ఓట్లు ఎక్కువగా జనసేనకే పడ్డాయి. ఈ సారి జనసేన టీడీపీతో కూటమిలో ఉండటంతో వారి ఓట్లు ఆ పార్టీకే పడనున్నాయి.  కాపుల తర్వాత అధిక సంఖ్యలో గౌడ సామాజిక వర్గ ఓటర్లు ఉన్నారు. మొత్తం 28 శాతం ఉన్న ఓటర్లలో వైసీపీ, టీడీపీ కూటమికి సమంగానే మద్దతు పలుకుతూ వస్తున్నారు. ఈ సారి జోగి రమేష్ కు టిక్కెట్ కేటాయించకపోవడంతో  కొంత మంది ఓటర్లు మారిపోయే అవకాశం కనిపిస్తోంది.  ఈ రెండు సామాజిక వర్గాల తర్వాత ఎస్సీ మాలలు 13 శాతం ఉన్నారు. వీరిలో అధికంగా  వైసీపీకి మద్దతు పలుకుతున్నారు.  8 శాతం ఉన్న మత్స్యకారుల్లో   జనసేనకు ఎక్కువ మొగ్గు కనిపిస్తోంది.   టీడీపీకి కూడా సాంప్రదాయ ఓటర్లు ఉన్నారు.  స్థానిక ఎన్నికల్లో   మంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఓ  జడ్పీటీసీ స్థానంలో  వైసీపీ ఘోరంగా ఓడిపోయింది.

ఏపీలో ఈ సారి భిన్నమైన రాజకీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో ఓట్ల పోలరైజేషన్ పరిస్థితి కనిపిస్తోంది.  టీడీపీ, జనసేన తరపున అందరూ గట్టిగా వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపాలన్న పట్టుదలతో ఉన్నారు.  పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేయడం.. చిరంజీవిని అవమానించడం వంటి వాటితో కాపులు ఎక్కువ అసంతృప్తిలో ఉన్నారు. ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టారన్న ఆగ్రహంతో ఉన్నారు ఇవన్నీ వైసీపీకి మైనస్ గా మారుతున్నాయి. పెడనలో టీడీపీ, జనసేనల్లో ఎవరు పోటీ చేసినా వారికి అడ్వాంటేజ్ గా మారే అవకాశం కనిపిస్తోంది..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి