ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కొత్త స్లోగన్ ఎత్తుకున్నారు. వై నాట్ పులివెందుల అంటున్నారు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వై నాట్ 175 అన్న నినాదంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్న సంగతి తెలిసిందే. ఇపుడు అదే టైటిల్ చంద్రబాబుకు స్ఫూర్తి నిచ్చి ఉంటుంది. అంతే కాదు వైనాట్ కుప్పం అని గతంలో తనని వెటకారం చేశారని అందుకే వైనాట్ పులివెందుల అని సవాల్ విసురుతున్నానని చంద్రబాబు అంటున్నారు.
మొన్న విశాఖ లో పర్యటించారు చంద్రబాబు నాయుడు. ఉత్తరాంధ్ర టిడిపి నేతల పనితీరును సమీక్షించి వారికి దిశా నిర్దేశనం చేశారు. విశాఖ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలవాలంటే యువతకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని వ్యాఖ్యానించి సీనియర్లకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఆ వెంటనే నెల్లూరు టూరు పెట్టుకున్నారు. ఈక్రమంలో ఓ కొత్త నినాదాన్ని అందుకున్నారు. వై నాట్ పులివెందుల అన్నారు. అంటే వచ్చే ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తోన్న పులివెందుల నియోజకవర్గంలో కూడా టిడిపిని గెలిపించుకుంటామన్నది వైనాట్ పులివెందుల అర్ధం.
గత ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినపుడు రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి ఘోరమైన ఫలితాలు మూటకట్టుకుంది. ఎంత దారుణంగా అంటే చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గమైన కుప్పం నియోజకవర్గంలో కూడా టిడిపి చేతులెత్తేసింది. పంచాయతీ ఎంపీటీసీ-జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికల్లోనూ కుప్పం నియోజకవర్గంలో టిడిపి భూస్థాపితం అయిపోయింది. ఈ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు కుప్పంలోనే మకాం వేసి ప్రజలను రెచ్చగొట్టేలా ప్రసంగించారు. నా కుప్పం జోలికి వస్తారా ఖబడ్దార్ అంటూ హుంకరించారు.
కుప్పం ప్రజలు వైసీపీని తరిమి తరిమి కొట్టడం ఖాయం అన్నారు. అయితే కుప్పం ప్రజలు కూడా టిడిపిని కాదని వైసీపీ అభ్యర్ధులను గెలిపించడంతో చంద్రబాబు నాయుడు చాలా పెద్ద షాక్ తిన్నారు. చాలా రోజుల పాటు ఆయన దాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఎందుకిలా జరిగిందా అని తనలో తానే కుమిలిపోయారు. ఓడించిన ప్రజలపై రగిలిపోయారు కూడా. ఆ సందర్భంలోనే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నేతలు టిడిపికి ఓ సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో కుప్పం నియోజక వర్గంలో కూడా టిడిపిని ఓడించి తీరతామని ఛాలెంజ్ చేశారు. చంద్రబాబు నాయుడికి దమ్ముంటే గెలిచి చూపించాలన్నారు. కుప్పంలో ఓటమి అన్నదే ఎరుగకుంగా విజయాలు సాధిస్తూ వచ్చిన చంద్రబాబు నాయుడికి కూడా కుప్పంపై అనుమానాలు వచ్చేశాయి. ఏళ్ల తరబడి పట్టించుకోని కుప్పం నియోజకవర్గానికి ఆయన మూడు నెలలకోసారి వెళ్లి రెండు మూడు రోజులు మకాం వేసి రావడం మొదలు పెట్టారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు సురక్షితమైన నియోజకవర్గం కోసం అన్వేషిస్తున్నారంటూ ప్రచారం జరిగింది. కృష్ణా జిల్లాలో అమరావతి ప్రాంతంలో ఏదో ఒక నియోజక వర్గంపై ఆయన కర్చీప్ వేస్తారని కూడా అనుకున్నారు. కుప్పం ఓటమి టిడిపిలో ప్రకంపనలు సృష్టించింది. అప్పటినుంచే పార్టీలో వేడి పెంచాలని చంద్రబాబు నాయుడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే అన్నీ పూర్తి స్థాయిలో వర్కవుట్ కావడం లేదు. సరిగ్గా ఆ నిరాశలో ఉన్న సమయంలోనే గ్రాడ్యుయేట్స్ నియోజక వర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలు చంద్రబాబు నాయుడికి ఆశాకిరణంలా కనిపించాయి. మూడు నియోజకవర్గాల్లో పోటీ చేసి మూడు చోట్లా టిడిపి గెలిచింది. పిడిఎఫ్ జనసేనల మద్దతుతోనే గెలిచినప్పటికీ అంతిమ విజేతగా టిడిపినే చెబుతారు ఎవరైనా. ఈ విజయాలతో చంద్రబాబు నాయుడిలో ఉత్సాహం పెరిగిపోయింది. ఆవెంటనే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లోనూ గెలిచే బలం లేకపోయినా టిడిపి ఓ స్థానాన్ని దక్కించుకుంది. దాంతో ఇక వైసీపీ పని అయిపోయింది టిడిపి ప్రభంజనం మొదలైపోయింది అని చంద్రబాబు నాయుడు ఎగరి గంతేస్తున్నారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానాల పరిధిలో పులివెందుల నియోజకవర్గం కూడా ఉంది. అందుకే ఇపుడు చంద్రబాబు నాయుడు వై నాట్ పులివెందుల అనే స్లోగన్ ఎత్తుకున్నారు. అంతే కాదు వైనాట్ 175 అని జగన్ అంటూ ఉంటే వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లోనూ వైసీపీని ఓడిస్తాం అని చంద్రబాబు సవాల్ విసిరారు. ఇదంతా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపడంతో పాటు వైసీపీ శ్రేణుల్లో అలజడి సృష్టించాలన్నదే బాబు లక్ష్యంగా భావిస్తున్నారు. అయితే 175 నియోజకవర్గాల్లో వైసీపీని ఓడిస్తానన్న చంద్రబాబు నాయుడు అసలు టిడిపి 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని చెప్పగలరా అని వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ సవాల్ విసిరింది.
చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే పరిస్థితి లేదు. ఆ విషయాన్ని చంద్రబాబు పరోక్షంగా ప్రకటించేశారని అనుకోవచ్చు. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించడానికి అన్ని విపక్షాలు ఏకం కావాలని ఆయనే పిలుపు నిచ్చారు. బిజెపి-జనసేనలతో పొత్తులకోసం ఇప్పటికీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో జనసేనకు ఎన్ని స్థానాలు కేటాయిస్తారన్న అంశంపైనా టిడిపి జనసేన పార్టీల సోషల్ మీడియా విభాగాల్లో ఊహాగానాలు వస్తున్నాయి. సో ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు నాయుడి టిడిపి 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే అవకాశాలు లేవన్నది బహిరంగ రహస్యం. దాన్ని చంద్రబాబు నాయుడు కానీ టిడిపి నేతలు కానీ ఖండిస్తే జనసేనతో పొత్తు లేదని ప్రకటించినట్లే అవుతుంది. జనసేనతో పాటు కమ్యూనిస్టు పార్టీలు కూడా టిడిపితో పొత్తు కోసం క్యూలో ఉన్నాయి. ఎందుకంటే వైసీపీ ఎవరితోనూ పొత్తులు పెట్టుకోదు కాబట్టి ఆ పార్టీ ఒంటరిగానే బరిలో ఉంటుంది కాబట్టి కమ్యూనిస్టులకు మరో ఆల్టర్నేటివ్ కూడా లేదు మరి. సరే దీన్ని కాసేపు పక్కన పెడితే పులివెందులలో జగన్ మోహన్ రెడ్డిని ఓడించగలగడం టిడిపికి సాధ్యమా అన్నది ప్రశ్న. పులివెందుల నియోజక వర్గం మొదట్నుంచీ కూడా వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి కుటుంబానికి కంచుకోట. ఈ నియోజక వర్గం నుండి దివంగత వై.ఎస్.రాజశేఖర రెడ్డి మొదటి సారి 1978లో పోటీ చేసి విజయం సాధించారు. అప్పటినుండి ఇప్పటి వరకు ఈ నియోజక వర్గంలో వై.ఎస్.ఆర్. కుటుంబీకులే విజయాలు సాధిస్తూ వస్తున్నారు.
అంటే నలభై ఐదేళ్లుగా ఓటమి అన్నదే తెలీకుండా వై.ఎస్. కుటుంబీకులు జైత్రయాత్ర చేస్తున్నారు. ఒక్క వై.ఎస్. రాజశేఖరరెడ్డే ఈ నియోజకవర్గంలో ఆరు సార్లు గెలిచారు. జగన్ మోహన్ రెడ్డి 2014, 2019 ఎన్నికల్లో రికార్డు స్థాయి మెజారిటీతో గెలిచారు. పులివెందులో వై.ఎస్. కుటుంబానికి ఎంత బలం ఉందంటే1982లో టిడిపి ని స్థాపించిన ఎన్టీయార్ 1983 ఎన్నికల్లో పార్టీకి అఖండ విజయం సాధించి పెట్టారు. ఆ వేవ్ లో అప్పుడు కాంగ్రెస్ లో ఉన్న చంద్రబాబు నాయుడు చంద్రగిరి నియోజకవర్గంలో ఘోరంగా ఓడిపోయారు. చాలా మంది కాంగ్రెస్ అగ్రనేతలు కూడా ఓడారు. కానీ వై.ఎస్.ఆర్. మాత్రం తిరుగులేని విజయం సాధించారు. అంతే కాదు 1994లో అయితే ఎన్టీయార్ ప్రభంజానికి అస్సలు తిరుగే లేకపోయింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 26 స్థానాలకు పరిమితం అయితే గెలిచిన వారిలో వై.ఎస్.ఆర్. కూడా ఉన్నారు. అదీ పులివెందులలో జగన్ మోహన్ రెడ్డి కుటుంబానికి ఉన్న బలం. స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కానీ పులివెందుల నియోజకవర్గంలో వై.ఎస్. కుటుంబం హవానే నడుస్తోంది. చంద్రబాబు ఓటమి ఎరుగని నాయకుడేమీ కాదు. చంద్రగిరిలో ఓటమి తర్వాతనే కుప్పం నియోజకవర్గానికి వలస వెళ్లారు చంద్రబాబు. వరుసగా విజయాలు సాధిస్తూ వస్తోన్నా గత కొద్ది ఎన్నికలను పరిశీలిస్తే చంద్రబాబు మెజారిటీ తగ్గుతూ వస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అయితే టిడిపి పరువే మట్టిపాలైపోయింది. అందుకే వైనాట్ కుప్పం అని వైసీపీ అనగలిగింది. మరి చంద్రబాబు నాయుడు వైనాట్ పులివెందుల నినాదాన్ని నిజం చేసుకుంటారా చేతులెత్తేస్తారా అన్నది తేలాలంటే 2024 ఎన్నికల వరకు ఆగాల్సిందే.