మైండ్ గేమ్ ఆడ్డంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుణ్ని మించిన వారు మరొకరు ఉండరు. రాజకీయ ప్రత్యర్ధులను ఈ ఆటతోనే ఆయన అల్లాడిస్తూ ఉంటారు. వయసు మీద పడి..రాజకీయంగా పార్టీ కాస్త ఇబ్బందుల్లో ఉంది కానీ..లేదంటే చంద్రబాబు వేసే ఎత్తుగడలకు ప్రత్యర్ధులు ఉక్కిరి బిక్కిరి కావలసిందే అంటారు రాజకీయ పండితులు. ఇటువంటి ఆర్ట్ తోనే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారు చంద్రబాబు. 2024 ఎన్నికల్లో టిడిపిని అధికారంలోకి తీసుకురాలేకపోతే ఇక పార్టీ మనుగడే ప్రశ్నార్ధకమయ్యే పరిస్థితి నెలకొంది. ఈ ఆందోళనే చంద్రబాబుకు నిద్ర లేకుండా చేస్తోంది.
ఒక పక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రతో జనసేనలో జోష్ పెంచారు. టిడిపితో పొత్తు ఉంటుంది కాబట్టి జనసేన తో పాటు వారాహి యాత్ర టిడిపికి కూడా ఎంతో కొంత కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు. మరో వైపు లోకేష్ పాదయాత్ర సాగుతోంది. తానుకూడా జనంలోనే ఉంటూ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని చంద్రబాబు నాయుడు తాపత్రయ పడుతున్నారు. అందుకే తాను కూడా వివిధ జిల్లాలు పర్యటిస్తున్నారు. తాజాగా రాయలసీమలో చంద్రబాబు నాయుడు సుడిగాలి పర్యటలను చేస్తున్నారు. చంద్రబాబు నాయుడి సభలకు జనం కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు.ఆ జనాన్ని చూసే సరికి చంద్రబాబు నాయుడిలోనూ హుషారు పెరుగుతోంది. జనం తమని పూర్తిగా దూరం పెట్టేయలేదన్న ధీమా వచ్చింది.
రాయలసీమ పర్యటనలో ప్రత్యేకించి సాగునీటి ప్రాజెక్టులను సందర్శిస్తోన్న చంద్రబాబు నాయుడు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ప్రభుత్వంపైనా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపైనా నిప్పులు చెరుగుతున్నారు. జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఒక్క సాగునీటి ప్రాజెక్టుకూడా కట్టలేదన్నారు చంద్రబాబు. పోలవరం ప్రాజెక్టు తన కన్నబిడ్డ లాంటిదన్న చంద్రబాబు నాయుడు ఎవరో కన్న బిడ్డను జగన్ మోహన్ రెడ్డి ఎత్తుకుని తన బిడ్డగా ప్రచారం చేసుకుంటున్నారని చంద్రబాబు సెటైర్ వేశారు. రాయలసీమకు సాగునీరు అందించిన ఘనత తనదేనని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఇంటికి పంపకపోతే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందని హెచ్చరించారు చంద్రబాబు నాయుడు.
రాయలసీమ పర్యటనలో భాగంగా వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజక వర్గం అయిన పులివెందుల వెళ్లారు చంద్రబాబు నాయుడు. వచ్చే ఎన్నికల్లో టిడిపి విజయాన్ని ఎవరూ ఆపలేరన్న చంద్రబాబు నాయుడు వై నాట్ పులివెందుల అన్న నినాదాన్ని చేశారు. వచ్చే ఎన్నికల్లో పులివెందులలో టిడిపి జెండా ఎగరేస్తామని జగన్ మోహన్ రెడ్డిని ఓడించి ఇంటికి పంపిస్తామని చంద్రబాబు హెచ్చరించారు. పులివెందులను కూడా విడిచి పెట్టం అని చెప్పడం ద్వారా టిడిపి విజయంపై తాము ఎంత ధీమాగా ఉన్నామో రాజకీయ ప్రత్యర్ధులకు తెలియ జెప్పాలన్నది చంద్రబాబు వ్యూహంగా చెబుతున్నారు.
వైనాట్ పులివెందుల నినాదానికి ఓ నేపథ్యం కూడా ఉంది. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడి సొంత జిల్లా కుప్పంపై దృష్టి సారించారు. వచ్చే ఎన్నికల్లో కుప్పం నియోజక వర్గంలో పార్టీని గెలిపించి తీరాలన్న పట్టుదలగా ఉన్నారాయన. స్థానికంగా ఓ బలమైన అభ్యర్ధిని ఎంపిక చేయడమే కాకుండా ఆయన్ను గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని భరోసా ఇచ్చారు జగన్ మోహన్ రెడ్డి.తన నియోజక వర్గంపై కన్నేసిన జగన్ మోహన్ రెడ్డిని దెబ్బకొట్టాలంటే పులివెందులపై తాను కన్నేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి …..