హామీలపై విశ్వాసం ఉందా..?

By KTV Telugu On 15 February, 2024
image

KTV TELUGU :-

శంఖారావంలో ఏం జరుగుతోంది. టీడీపీ యువనేత రోజుకు  మూడు సభల్లో చెబుతున్నదేమిటి. సహేతుకమైన హామీలనే ఇస్తున్నారా. ఎన్నికల్లో గెలిచేందుకు ఏదంటే అది మాట్లాడేస్తున్నారా.. టీడీపీ హామీలకు విశ్వసనీయత ఉందా. నేతల మాటలు కేవలం ఊకదంపుడు ఉపన్యాసాలుగా  మారాయా…..

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ ఇప్పుడు శంఖారావం పూరించారు. యువగళం పాదయాత్రలో భాగంగా  వెళ్లని ప్రదేశాలను సందర్శిస్తూ టీడీపీ కార్యకర్తలను ఉత్తేజ పరుస్తున్నారు. సామాన్య ప్రజల్లో టీడీపీ పట్ల విశ్వాసం పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన రోజుకు మూడు మీటింగులు మాట్లాడుతున్నారు. రోజు అదే మాటలు చెబుతున్నారని జనం  విశ్లేషించుకుంటున్నారు. ఈ క్రమంలో ఒకటి రెండు కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి. విశాఖ  ఉక్కు ప్రస్తావన కూడా చేశారు. విశాఖపట్టణానికి గుండెకాయ లాంటి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయకుండా కాపాడతామని చెప్పిన నారా లోకేష్, తమ ప్రభుత్వం ఏర్పడితే కొనుగోలు చేస్తామని ప్రకటించారు. వాస్తవానికి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని కొనేంత డబ్బు ప్రభుత్వాని వద్ద ఉంటుందా? అలా కొనుగోలు చేసి ప్రభుత్వం దానిని ఏం చేస్తుంది? నష్టాలు వస్తున్నాయని చెప్పే కదా కేంద్రం దాన్ని ప్రైవేటుపరం చేస్తోంది? అలాంటప్పుడు నారా లోకేష్ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ని కొనుగోలు చేస్తామని చెప్పడమేంటి? గతంలో ఇలాగే తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు సింగరేణి అధికారులను పంపి వైజాగ్ స్టీల్ కొనుగోలు చేస్తామని ప్రకటించారు. తీరా బిడ్లు ఓపెన్ చేసే సమయానికి పత్తాలేకుండా పోయారు. ప్రస్తుతం నారా లోకేష్ చేస్తున్న వ్యాఖ్యలు కూడా అలాంటి అనుమానాలకే తావిస్తున్నాయి. గెలిచిన తర్వాత మాట మార్చకుండా ఉంటేనే పది కాలాల పాటు జనం టీడీపీని విశ్వసిస్తారు. ఎందుకంటే ఏదోక రోజున కేంద్ర వైజాగ్ స్టీలును  ప్రైవేటుపరం చేయడం ఖాయమేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..

ఇప్పుడు ఏపీ ప్రజలంతా టీడీపీ హామీల మీదే దృష్టి  పెడుతున్నారు.వైసీపీ నేత  ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు పార్టీ వ్యవహారాలతో సతమతమవుతున్న నేపథ్యంలో ఆయన వైపు నుంచి ఎలాంటి హామీలు రావడం లేదు. టీడీపీ చాలా కాలం క్రితం ఇచ్చిన హామీల ఎంతవరకు అమలు చేస్తారో తెలుసుకునేందుకే జనం ఉత్సాహం చూపుతున్నారనుకోవాలి….

టీడీపీ – జనసేన ఉమ్మడి హామీలపై దాదాపు  నెలరోజులుగా కసరత్తు జరుగుతోంది. టీడీపీ ఎప్పుడో సూపర్ సిక్స్ పేరుతో ఆరు హామీలిచ్చింది. పవన్ కల్యాణ్ సూచన మేరకు మరో నాలుగు కలిపి పది హామీలు ప్రకటిస్తారని  కొంతకాలంగా అనుకుంటున్నారు. వాటికి తోడు ఉమ్మడి మేనిఫెస్టో  రూపకల్పన ఎంతవరకు వచ్చిందో తెలియడం లేదు. ప్రస్తుతానికి మాత్రం సూపర్ సిక్స్ హామీలను ఇంటింటింకి చేర్చేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. సూపర్ సిక్స్ హామీలు.. గ్యారెంటీ కార్డులతో కూడిన కిట్ ను ప్రతి ఇంటికి చేర్చాలని పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఈ కిట్ల పంపిణీకి టిడిపి శ్రేణులు శ్రీకారం చుట్టాయి. లోకేష్ శంఖారావం సభల్లో  లాంఛనంగా కొన్ని కిట్స్ ను విడుదల చేస్తున్నారు. టీడీపీ సోషల్  మీడియా విభాగం కూడా బాగా యాక్టివ్  కావడంతో ప్రచారం కార్యక్రమం వేగం పుంజుకుంది. కాకపోతే జనం ఎంతవరకు విశ్వసిస్తారన్నదే పెద్ద ప్రశ్న. మహిళలను ఉచిత బస్సు ప్రయాణం, మూడు గ్యాస్ సిలిండర్ల ఉచిత హామీలు ఆకట్టుకుంటున్నాయి. సామాన్యుల కష్టాలు తీర్చేలా పథకాలు ఉండడంతో ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.. అయితే పెద్దగా పథకాలు ప్రభావం చూపడం లేదని విపక్షాలు చెప్పుకొస్తున్నాయి.

టీడీపీ విషయంలో విస్తృతంగా జరుగుతున్న చర్చ ఒకటి ఉంది. అదీ సహేతుకమైన, బడ్జెట్ కూర్చుకోగల హామీలు ఇవ్వలేదని విశ్లేషణలు  వినిపిస్తున్నాయి. తెలంగాణలో గ్యారెంటీలకు మధ్యంతర బడ్జెట్లోనే 53 వేల కోట్లు కేటాయించాల్సి వచ్చింది. ఇక ఆంధ్రప్రదేశ్లో ఎంత ఖర్చు చేయాల్సి వస్తుందో… ఆలోచిస్తే టెన్షనే మరి…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి