ఏడిస్తే ఓట్లు రాలతాయా ?

By KTV Telugu On 12 May, 2024
image

KTV TELUGU :-

షర్మిల కంటతడి పెట్టారు. షర్మిల భావోద్వేగానికి లోనయ్యారు. షర్మిల ఏడ్చారు. షర్మిల  జగన్ పై  దుమ్మెత్తిపోశారు. షర్మిల తన అన్నను నిగ్గదీసి అడిగారు. ఫైనల్ గా షర్మిల ఏపీ సీఎంకు సవాలు విసిరారు. ఇవీ గత 24 గంటలుగా వినిపిస్తున్న మాటలు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్ సభ పోలింగ్ మరి కొద్ది గంటల్లోకి వస్తున్న తరుణంలో రాజకీయం హాట్ హాట్ గా మారింది. జగన్  పై కసిగా ఉన్న కడప సిస్టర్స్ అన్ని రకాలుగా ఆయన్ను ఇరుకునపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. పరిస్థితులు అందుకు అనుకూలించకపోవడమో, వేరే కారణమో గానీ.. షర్మిల టెన్షన్ పడిపోయి భావోద్వేగానికి లోనవుతున్నారు. అది సింపథీగా మారి నాలుగు ఓట్లు రాల్చితే మంచిదే గానీ, ఆ అవకాశం ఉందా లేదా అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న……

షర్మిల ఒక ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి… జగన్ కోసం తాను త్యాగం చేశానని బైబిల్ మీద ప్రమాణం  చేసి చెబుతానని షర్మిల ప్రకటించేశారు. తాను డబ్బు, పోస్టు అడిగినట్లు జగన్ ప్రమాణం  చేయగలరాని ఆమె ప్రశ్నించారు. రాజకీయ అవసరాలకు తనను నిలబెట్టిందే జగన్ అని ఆమె ప్రకటించారు.   మీకు ఎప్పుడు అవసరమైతే ఆ అవసరానికి.. సమైక్యాంధ్ర కోసం అయితేనేమి, తెలంగాణలో ఓదార్పు యాత్ర అయితేనేమి, బైబై బాబు క్యాంపెయిన్‌ అయితేనేమి.. ఇలా ఎప్పుడు అవసరమైతే అప్పుడు పనికొచ్చింది నేను కాదా? నిన్ను ముఖ్యమంత్రిని చేసే వరకు నేను చేసింది త్యాగం. వైఎస్సార్‌ సంక్షేమ పాలన తీసుకొస్తారని నేను త్యాగం చేసిన మాట వాస్తవం కాదా?..’ అని జగన్‌ను షర్మిల నిలదీశారు. ఈ క్రమంలో ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. దాదాపుగా  ఏడ్చేశారు. నట్టనడిసంద్రంలో తనను ముంచేశారని అర్థం వచ్చేలా ఆమె మాట్లాడారు. తన పోరాటం ఫలించదేమోనన్న అనుమానమూ, భయమూ ఆమెలో ఉన్నాయని కూడా తాజా వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది. నిజానికి  రాజకీయాల్లో భావోద్వేగాలకు చోటు ఉండదు. అవతలివారిని రాజకీయంగా పడగొట్టగలిగితేనే  విజయం సాధిస్తారు. ఒకరిద్దరు రాజకీయ నాయకులు మాత్రం కంటతడి పెట్టి సింపథీ పొందేందుకు ప్రయత్నిస్తారు. షర్మిల కూడా ఇప్పుడు ఆ రూటు తీసుకున్నారని చెప్పక తప్పదు.

షర్మిల భావోద్వేగానికి కారణం ఏమిటన్నదే ఇప్పుడు పెద్ద చర్చ. అనుకున్న వర్గాల నుంచి మద్దతు రాకపోవడం వల్లే ఆమె నిరాశ చెందుతున్నారన్నది ఒక పాయింట్ . కడప లెక్కలు కూడా తనకు అనుకూలంగా లేవని ఆమెకు అర్థమైపోయింది దానితో ఆమెకు దిక్కుతోచడం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి…

షర్మిల… కాంగ్రెస్ పార్టీ తరపున కడప లోక్ సభా స్థానానికి పోటీ చేస్తున్నారు. ఆమె బలమైన అవినాష్ రెడ్డిని  ఢీ కొంటున్నారు. టీడీపీ తరపున భూపేష్ రెడ్డి పోటీ చేస్తుండటంతో ముక్కోణ పోరు రసవత్తరంగా  మారింది. కుటుంబ కలహం తర్వాత  అవినాష్ గెలుపును జగన్ తన పరువు సమస్యగా తీసుకున్నారు. పైగా అవినాష్ ను చిన్నపిల్లోడని సంబోధిస్తూ షర్మిలను ఇంకా రెచ్చగొడుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ తనకు మద్దతిస్తే గెలుస్తానని ఇంతకాలం షర్మిల ఎదురుచూశారు. ఆ కోరిక కూడా నెరవేరే అవకాశం లభించలేదు. బాధితురాలిగా షర్మిల పట్ల తమకు సింపథీ ఉందని, రాజకీయంగా మద్దతిచ్చే అవకాశం మాత్రం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. తమ అభ్యర్థి భూపేష్ రెడ్డిని గెలిపించుకునేందుకు ప్రయత్నిస్తామని, సైకో పాలన పోవాలంటే కడపలో కూడా టీడీపీ గెలవాలని ఆయన అన్నారు. దానితో షర్మిల ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. గత ఎన్నికల గణాంకాలు కూడా ఆమెకు ఏ మాత్రం అనుకూలంగా లేవు. 2019లో  అవినాష్ రెడ్డికి 64 శాతం ఓట్లు వచ్చాయి.  2014తో పోల్చుకుంటే 8 శాతం పెరిగాయి. టీడీపీ  అభ్యర్థి ఆదినారాయణ రెడ్డికి 33 శాతం ఓట్లు వచ్చాయి. ఇప్పుడు టీడీపీ కూడా బరిలో ఉండటంతో అవినాష్ వ్యతిరేక ఓట్లు చీలే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. గత ఎన్నికల్లో అవినాష్ వైపు  వెళ్లిన 8 శాతం ఓట్లు వెనక్కి వచ్చినా కూడా విజయానికి చేరువగా ఉండలేమని షర్మిలకు అర్థమైపోయింది. దానితో హత్యకేసు నిందితుడు అవినాష్ లోక్ సభలోకి ఎంట్రీ ఇవ్వకుండా తాను ఆపలేనని ఆమెకు లేటుగా  వెలిగింది. అవినాష్ ఓడిపోతే టీడీపీ గెలుస్తుందే తప్ప తాను  గెలవలేనని కూడా ఆమెకు బోధపడింది. అందుకే ఆమె భావోద్వేగాలకు లోనవుతున్నాయి. అయితే ఆమె చర్యలు ఓట్ల బదలాయింపుకు పనికి రావని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు…

వైఎస్ సునీతను  వెంటబెట్టుకుని తిరగడం కూడా ప్రయోజనం కలిగించలేదని  షర్మిల గుర్తించారు. సునీత పనిగట్టుకుని  జగన్ కుటుంబంపై  ఆరోపణలు చేస్తున్న ఫీలింగ్ వచ్చేసింది. పైగా వివాదంలోకి  జగన్ సతీమణి భారతీని లాగేందుకు ఆమె తరచూ ప్రయత్నిస్తున్నారు. భారతీ ఎలాంటి సమాధానం  చెప్పకపోయినా సరే సునీత మాత్రం ఆరోపణలు కొనసాగిస్తున్నారు. అటువంటి  చర్యలు బూమరాంగ్ అయ్యే ప్రమాదం ఉందని షర్మిల భయపడుతున్నట్లు సమాచారం…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి