తమిళనాడు పిలిచింది – Will Lokesh Bring Change – In – Tamilnadu

By KTV Telugu On 13 April, 2024
image

KTV TELUGU :-

నారా లోకేష్ తమిళనాడు పర్యటన సూపర్ సక్సెస్ అయ్యింది. చంద్రబాబు తనయుడిని చూసేందుకు  జనం భారీగా తరలి వచ్చారు. నిజానికి టీడీపీ  ఆంధ్రప్రదేశ్లో మినహా ఎక్కడా పోటీ చేయడం లేదు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు కూడా దూరంగా ఉంటున్నట్లు అనధికారికంగా సమాచారం అందించారు. ఇప్పుడు ఎన్డీయేలో టీడీపీ భాగస్వామిగా ఉన్నందున బీజేపీ అభ్యర్థి కోసం ప్రచారానికి లోకేష్ తమిళనాడులోని వాణిజ్య మహానగరం కోయంబత్తూరు వెళ్లారు.అక్కడ ప్రచారానికి వెళ్లడాన్ని ఒక లాంఛనం అనుకోవడానికి వీల్లేదు. ఏదో ఒక సారి అలా వెళ్లి వచ్చారని చెప్పడం కుదరదు. లోకేష్ ప్రచారానికి విస్తృతమైన ప్రయోజనాన్ని బీజేపీ ఆశిస్తోంది. తమిళనాడు తెలుగువారి ఓట్లు దండుకునేందుకు వేసిన ప్లాన్ గానూ  దాన్ని పరిగణించాల్సి ఉంటుంది.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  తమిళనాడు  ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కోయంబత్తూరు లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కుప్పుస్వామికి మద్దతుగా లోకేష్ ప్రచారం నిర్వహించారు. అన్నామలైతో కలిసి ర్యాలీలో లోకేష్ ప్రసంగించారు. పీలమేడు ప్రాంతంలో ప్రజలను ఉద్దేశించి లోకేష్ తెలుగులోనే మాట్లాడారు. సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణలకు ప్రతిరూపం ప్రధాని మోదీ అని అన్నారు. దేశాన్ని బలమైన ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు ప్రధాని మోదీ.. మేకిన్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా సంపద సృష్టిస్తున్నారని చెప్పారు. ప్రధాని మోదీ ప్రపంచం మెచ్చిన నాయకుడని అన్నారు. సింగంగా  అంటే సింహంగా  ముద్ర పడిన మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై కోయంబత్తూర్‌ను అభివృద్ధి చేయడానికి.. తమిళనాడు ప్రజలకు సేవ చేయడానికి సరైన వ్యక్తి అని అన్నారు. ప్రజలకు సేవ చేయడం కోసమే అన్నామలై ఐపీఎస్ ఉద్యోగాన్ని వదులుకొని రాజకీయాల్లోకివ చ్చారని అన్నారు. అన్నామలైకి ఓట్లు వేయాలని ప్రజలను కోరారు. అన్నామలై విజయం కోయంబత్తూరు పారిశ్రామికాభివృద్ధికి కీలకమని నారా లోకేష్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో కోయంబత్తూరులోని ఫౌండరీలు, చేనేత, పవర్‌లూమ్ పరిశ్రమలను ఆధునీకరించడంలో అన్నామలై పార్లమెంటులో తన గళం విప్పుతారని హామీ ఇచ్చారు. తమిళనాడు రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులను అర్థం  చేసుకున్న తర్వాతే లోకేష్ అక్కడ ప్రచారానికి వెళ్లారనుకోవాలి. కోయంబత్తూరు విశిష్టతను తెలుసుకున్న తర్వాతే ఆయన అక్కడ పర్యటనకు వెళ్లారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని కూడా లేదు..

లోకేష్ ప్రచారం  నిజంగానే బీజేపీకి ఉపయోగపడుతుందా అన్నది కూడా ఆలోచించాలి. ఆయన్ను ప్రచారానికి పిలవడం  ద్వారా బీజేపీ చేసిన ప్రయత్నంలో మాత్రం తప్పు లేదు. కోయంబత్తూరు సహా చుట్టుపక్కల నీలగిరి వరకు తెలుగు వారు  ఉంటారు. వారిలో ఎక్కువ మందికి ఆంధ్రప్రదేశ్ తో సంబంధాలు తెగిపోయినా అభిమానం మాత్రం తగ్గలేదు. మనవాళ్లు అన్న ఫీలింగ్ వారిలో  ఎప్పుడు ఉంటుంది. కొందరు ఇంకా కుటుంబ సంబంధాలను కొనసాగిస్తూనే ఉన్నారు…

కోయంబత్తూరు ప్రాంతంలో పది పన్నెండు తరాల క్రితం సెటిలైన కమ్మవారున్నారు. వారిని అక్కడ కమ్మవారి నాయుడు  అని పిలుస్తారు. తెలుగు మరిచిపోకుండా ఉండేందుకు వాళ్లు తెలుగు స్కూల్స్ కూడా నడుపుకుంటున్నారు.తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై వాళ్లు నిత్యం ఓ కన్నేసి ఉంచుతారు. కోయంబత్తూరు, చెన్నై ప్రాంతంలోని తెలుగువారికి, ఏపీలోని  వారికి వ్యాపార సంబంధాలు కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కొందరు అక్కడా, ఇక్కడ పెళ్లిళ్లు కూడా చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే వారిని ఆకట్టుకునేందుకు లోకేష్ ను బీజేపీ నేతలు ప్రచారానికి పిలిచారు. ఏపీ రాజకీయాలు ఎలా ఉన్నా… 1980ల్లో టీడీపీని ప్రారంభించినప్పటి నుంచి తమిళనాడు తెలుగు వారికి ఆ పార్టీ అంటే అమితమైన గౌరవాభిమానాలు ఉన్నాయి. సంక్షేమం, అభివృద్ధి రెండింటికీ ప్రాధాన్యమిచ్చే చంద్రబాబు నాయుడు అంటే మొదటి నుంచి గౌరవం ఉంది. చంద్రబాబు సీఎం అయిన తర్వాత తొలి నాళ్లలో ఎక్కువ పర్యటించనది కూడా తమిళనాడేనని   చెప్పాలి. విద్యాధికుడిగా లోకేష్ పట్ల కూడా తమిళనాడు తెలుగువారికి అభిమానం ఉంది పైగా లోకేష్ మామ అయిన బాలకృష్ణ ఫ్యాన్స్ తమిళనాడులో ఎక్కువేనని చెప్పాలి. అందుకే లోకేష్ ప్రచారం తమకు ఉపయోగపడుతుందని తమిళనాడు బీజేపీ నేతలు ఆయన్ను ఆహ్వానించారు. యువనేత కూడా చాలా సంయమనంగా, వ్యూహాత్మకంగానే వ్యవహించారు. ఎక్కడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా బీజేపీ అగ్రనేతల నాయకత్వ పటిమను మాత్రమే ప్రస్తావించారు. అన్నామలై సమర్థతను పొగిడారు. తమిళనాడులో బీజేపీకి ప్రస్తుతం బలం లేకపోయినా ఇలాంటి చర్యల ద్వారా పుంజుకుంటుందని నమ్ముతున్నారు. పైగా బీజేపీకి గెలిచే అవకాశాలున్న నియోజకవర్గాల్లో కోయంబత్తూరు ఒకటని చెబుతున్నారు.

ఈ సారి  ఎన్నికల్లో లోకేష్ ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. ఏపీ మొత్తం తిరిగి సమయం  వృథా చేసుకోకుండా తన మంగళగిరి నియోజకవర్గంపైనే ఎక్కువ ఏకాగ్రత చూపుతున్నారు.  అక్కడ మొత్తం  సమయాన్ని కేటాయిస్తూ ఇంటింటికి తిరుగుతున్నారు. అపార్టమెంట్ వాసులతో కూడా మీటింగులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే లోకేష్ మర్యాదపూర్వకంగా ఓ సారి తమిళనాడు ప్రచారానికి వెళ్లారనుకోవాలి….

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి