వారాహి -3 ఎలా గేమ్ ఛేంజర్

By KTV Telugu On 7 August, 2023
image

KTV Telugu ;-

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పవన్ కల్యాణ్ కూడా స్పీడ్ పెంచారు. వారాహి రెండు విడతలు గ్రాండ్ సక్సెస్ కావడంతో మూడో విడత కోసం ఆయన ఉత్తరాంధ్రను ఎన్నుకున్నారు. పది రోజుల పాటు సాగే యాత్ర జనసేన, వైసీపీ మధ్య తీవ్ర సంఘర్షణకు దారి తీసే అవకాశం ఉంది. జగన్ కూడా విశాఖపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పవన్ ను అడుగడుగునా అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు సిద్ధమవుతాయి.

పవన్ కల్యాణ్ ఓ డైలాగ్ కింగ్. పవర్ పంచ్ డైలాగులు ఆయన ప్రత్యేకత. పవన్ మాట్లాడుతుంటే ఆవేశం పొంగుకు వస్తుంది.అలాగని ఒకటి రెండు సార్లు మినహా పిచ్చిపిచ్చిగా మాట్లాడిన సందర్భమూ లేదు. ఆయన మాటల్లో రీజనింగ్ ఉంటుంది. ప్రజల సమస్యలను ప్రతిబింబించాలన్న కోరిక కనిపిస్తుంది. విశాఖలో జరిగే వారాహి యాత్రలో కూడా అదే జరగబోతోందనుకోవాలి. ఎందుకంటే విశాఖ ప్రజలు తెలివైన వారు , మార్పును కోరుకుంటున్నారు. పార్లీలు విశాఖపై పడి తింటున్నాయన్న ఆగ్రహమూ వారిలో ఉంది. పైగా విశాఖను అడ్డుపెట్టుకుని సంపాదించడం ఎక్కువైందన్న కోపమూ వారిలో ఉంది. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ అంటూ జగన్ చేస్తున్న మోసం కూడా వారికి తెలిసొచ్చినా ఇప్పటికిప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. అందుకే విశాఖ ప్రజలు పవన్ కల్యాణ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన ఏం చెబుతారో విందామన్న ఆత్రుత వారిలో కనిపిస్తోంది.

వారాహి యాత్ర రెండు విడతలు గోదావరి జిల్లాల్లో జరిగింది. కొంత విరామం తర్వాత జనసేనాని మూడో ట్రిప్పుకు రెడీ అవుతున్నారు. ఈ సారి సాగర నగరం విశాఖను ఆయన ఎంపిక చేసుకున్నారు. ఈనెల పది నుంచి 19 వరకు పది రోజులు పాటు యాత్ర కొనసాగనుంది. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాలుగు నియోజకవర్గాల్లో యాత్ర జరగనుంది. విశాఖలో పవన్ అభిమానులు ఎక్కువ. జనసేనకు గ్రాఫ్ ఉన్న జిల్లాల్లో ఉభయగోదావరి తర్వాత విశాఖదే అగ్రస్థానం. అందుకే అక్కడ వారాహి యాత్ర చేయడానికి పవన్ సిద్ధపడ్డారు. తొలుత రాయలసీమ జిల్లాల్లో అనుకున్నా.. చివరకు విశాఖ వైపు మొగ్గు చూపారు. ఇప్పటికే రెండు విడతల యాత్రలో సంచలనాలకు పవన్ వేదికగా మారారు. ఈసారి క్షేత్రస్థాయిలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను టార్గెట్ చేయనున్నారు. జగన్ తీరుపై ఓ రేంజ్ లో విరుచుకుపడటం ఖాయమని తేలిపోయింది.

విశాఖను ఎంచుకోవడానికి రెండు కారణాలున్నాయి. అక్కడ జనసేనకు ఎక్కువ బలం ఉండటం మొదటి కారణమైతే, విశాఖను మింగెయ్యాలన్న వైసీపీ దుర్మార్గాన్ని ఎండగట్టడం రెండో కారణం.ఉత్తరాంధ్రలో తూర్పు కాపు సామాజిక వర్గాలు ఎక్కువగానే ఉన్నాయి. వారంతా జనసేన వైపు మొగ్గు చూపుతారని గణాంకాలు చెబుతున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలవడం వెనుక జనసేన బలముందని కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో కూడా పవన్ ఓడిపోయినప్పటికీ ఈ సారి పరిస్థితులు మారాయి. పోయిసారి ఓడించి పొరపాటు చేశామని జనం చెంపలేసుకున్నారు. అందుకే పవన్ ఈ సారి ధైర్యంగా ఉన్నారు. విశాఖలో ల్యాండ్, మైన్, వైన్ మాఫియాలపై పవన్ ఓ రేంజ్ లో అటాక్ చేస్తున్నారు. విశాఖలో భూకబ్జాలు, రుషికొండలాంటి విధ్వంసాలను పవన్ కళ్ళకు జనసేన కార్యకర్తలు కట్టినట్టు చూపించే అవకాశం ఉంది. వాటిపై ఆయన సమరశంఖం పూరించే వీలు కూడా ఉంది. పది రోజుల పర్యటనలో ఆ నాలుగు నియోజకవర్గాల్లో అన్ని వర్గాలతో పవన్ భేటీ అవుతారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. విశాఖలో టీడీపీ కంటే జనసేన బలంగా ఉండాలన్నది కూడా పవన్ ఆలోచనగా కనిపిస్తోంది. దాన్ని అమలు చేసేందుకే ఆయన వారాహి యాత్ర ఎక్కువ రోజులు పెట్టుకున్నారు.

సెప్టెంబరు, అక్టోబరులో జగన్ విశాఖకు మారతారని, ఎగ్జిక్యూటివ్ కేపటల్ నుంచే పాలనను సాగిస్తారని వైసీపీ వర్గాలు పదే పదే చెబుతున్నాయి. ఈ లోపే జగన్ తప్పిదాలను ఎండగట్టి.. వైసీపీ వారి డెడ్ లైన్లన్నీ నిజం కాదని చెప్పేందుకే పవన్ కంకణం కట్టుకున్నారు. కేవలం విశాఖ సంపదను దోచుకునేందుకు జగన్ రంగంలోకి దిగారని జనసేన ప్రచారం చేస్తోంది. పవన్ కూడా తాను ఫుల్ టైమ్ రాజకీయ నాయకుడినని చెప్పేందుకు అమరావతికి మకాం మార్చారు. అక్కడ నుంచే అన్ని కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విశాఖ టూర్ కు ప్రాధాన్యం ఏర్పడింది. ఇక్కడ మరో కోణం కూడా ఉంది. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా ఉత్తరాంధ్రలో ఎక్కువ స్థానాలు అడగాలని జనసేన భావిస్తోంది. అదీ పవన్ కల్యాణ్ అసలు గేమ్ ప్లాన్…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి