వైసీపీ వచ్చే ఎన్నికల్లో కూడా గెలవదా ? ఎందుకని !?

By KTV Telugu On 8 July, 2024
image

KTV TELUGU :-

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఘోరంగా తయారైంది.  చాలా మంది నేతలు ఆ పార్టీలో ఉండేందుకే ఇష్ట పడటం లేదు. ఎన్నికలకు   ముందే కొందరు నేతలు వెళ్లిపోతే, ఇప్పుడు మరికొందరు కొత్తదారులు వెదుక్కుంటున్నారు.పార్టీ అధినేత జగన్ పేరు  చెబితేనే నేతలు భయపడి పారిపోతున్నారు. జగన్ తీరుతో పాటు ఆయనకు సలహాలిచ్చేవారి వైఖరి  నచ్చకనే వెళ్లిపోతున్నారని తెలుస్తోంది. పైగా ఓడిపోయిన తర్వాత కూడా పరిస్థితులు మారకపోవడం, పార్టీ ఆలోచనా విధానాన్ని పాజిటివ్  గా ముందుకు తీసుకెళ్లలేకపోవడంతో నేతలకు చిర్రెత్తుకొస్తోందన్న వాదన వినిపిస్తోంది….

పార్టీలు ఎప్పటికప్పుడు తమను మార్చుకోవాలి. రోజువారీ చేపట్టిన కార్యక్రమాలను సమీక్షించుకుని ఎక్కడ తప్పు చేశాం, ఎక్కడ ప్రజలకు మంచి చేశామని అంచనా వేసుకోవాలి. దాని ఆధారంగా పార్టీని అప్ డేట్ చేసుకోవాలి. లేని పక్షంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీకి, వైసీపీకి తేడా ఉండదు. వరుసగా మూడు సార్లు ఓడిపోయిన కాంగ్రెస్ పూర్తిగా నేలకు దిగినట్లే, ఇప్పుడు వైసీపీ కూడా అదే పంథాలో నడుస్తుందని చెప్పుకోవాల్సి వస్తోంది. అధికారంలో  ఉన్నప్పుడు ప్రజలకు చేరువగా ఉండాల్సిన పార్టీ అరాచకాలకు, ఆశ్రిత  పక్షపాతానికి  తెరతీసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే గందరగోళంలోకి నెట్టింది. ఎమ్మెల్యేల నుంచి సాధారణ నేతల వరకు దందాలకు ప్రాధాన్యమిచ్చి జనంతో కనెక్షన్ పోగొట్టుకున్నారు.   దీని వల్ల పార్టీ విస్తరణకు అవకాశం లేకుండా పోయింది. దందాలు, రౌడీయిజం చేసే వారే తప్ప అంకిత భావంతో పనిచేసే వాళ్లు పార్టీలో లేకుండా పోయారు. ఇప్ప‌టి వ‌ర‌కు అనుస‌రించిన విధానాలు ఎలా ఉన్నా.. మున్ముందు మాత్రం ఆ పార్టీ వ్యూహాలు మారాల్సి ఉంది. మార్చుకోవాల్సి కూడా ఉంది. గ‌తంలో ఎన్టీఆర్ కూడా.. నిర్ణ‌యాల‌ను కేంద్రీకృతం చేశారు. ఫ‌లితంగా ఆయ‌న‌కు తొలిసారి ద‌క్కిన విజ‌యం రెండోసారి దోబూచులాడింది. దీంతో మండ‌ల‌స్థాయిలో పార్టీని ప‌టిష్టం చేసి.. నాయకుల‌కు కొన్ని స్వేచ్ఛ‌లు క‌ల్పించారు. ఫ‌లితంగానే మండ‌ల‌స్థాయిలో పార్టీ ముందుకు సాగింది. దీంతో టీడీపీకి బ‌ల‌మైన క్షేత్ర‌స్థాయి నాయ‌క‌త్వం ఏర్ప‌డింది. ఇప్ప‌టికీ చెక్కుచెద‌ర‌లేదు.ఇప్పుడు వైసీపీ కూడా కేంద్రీకృత‌మైన అధికార నిర్ణ‌యాల‌ను మండ‌లాలు.. న‌గ‌రాలు.. పంచాయ‌తీల స్థాయికి విస్త‌రించాలి. పార్టీ అంటే.. జ‌గ‌న్‌ది! అనే భావ‌న ను పోగొట్టి.. పార్టీ అంటే.. మ‌న‌ది అనుకునేలా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది. వైసీపీ ఇంఛార్జీలంటే జనంలో ఆగ్రహం పెరిగిపోయింది. అందుకే తక్షణమే ఇంచార్జీలను మార్చి కొత్త రక్తం పారించాలి..

పార్టీ  పట్ల పాజిటివ్  దృక్కోణాన్ని ప్రచారం చేయాలి. ప్రత్యర్థి పార్టీల వ్యతిరేక ప్రచారాన్ని  తిప్పుకొట్టే వ్యవస్థను పట్టుకు రావాలి. అప్పుడే జగన్ ఇమేజ్ కూడా పెరుగుతుంది. క్షేత్రస్థాయిలో పార్టీ నేతల మధ్య గౌరవ  భావాలు పెంపొందుతాయి..

జగన్ ఇటీవల నెల్లూరు జైలుకు వెళ్లి అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించారు. టీడీపీ మీడియా దాన్ని  బాగా విమర్శించింది. సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తుంటే, జైలు పక్షి జగన్ కారాగారం దగ్గరకు వెళ్లి రిమాండ్ ఖైదీలను పలుకరిస్తున్నారని యెల్లోమీడియా ఒక ఆటాడుకుంది. అలాంటి ప్రచారాన్ని తిప్పుకొట్టడంలో వైసీపీ ఫెయిలయ్యింది. గత ఐదేళ్లలో చాలా మంది టీడీపీ నేతలు జైలుకు వెళితే చంద్రబాబు వారిని మాటమాత్రమైనా పలుకరించలేదని,అదే జగన్ తన మనుషులను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వారికి సంఘీభావం చెబుతున్నారని ప్రచారం చేయాల్సిన బ్లూ మీడియా ఆ విషయంలో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. సంఘీభావంగా ధైర్యం చెప్పేందుకు జైలుకు వెళ్లడంలో తప్పేముందని ప్రశ్నించలేకపోయింది. దానితో జగన్ తప్పుచేస్తున్నారన్న భావన జనంలోకి వెళ్లిపోయే ప్రమాదం ఏర్పడింది. మరో పక్క వైసీపీని విస్తరించే ప్రయత్నాలు కూడా చేయాలి.  ప్రతీ ఒక్కరు మిగతా నాయకులను కలుపుకుపోవాలి. ప్ర‌స్తుతం ఉన్న నాయ‌కుల ప‌నితీరును అసెస్ చేయాల్సి ఉంది. త‌ర‌చుగావీడియో.. టెలిఫోన్ కాన్ఫ‌రెన్సులు నిర్వ‌హిస్తూ.. పార్టీ ప‌క్షాన కార్య‌క‌ర్త‌ల‌కు అండ‌గా ఉండేలా నిర్ణ‌యాలు తీసుకోవాలి. అప్పుడు పార్టీ బ‌ల‌ప‌డ‌తుంది. ఇక ఉత్సాహంగా పనిచేసే ఆశావహులను ప్రోత్సహించాల్సిన అనివార్యత పార్టీకి ఉందని గ్రహించాలి.

మనం మళ్లీ అధికారంలోకి రావాలి అన్న కోరికను వైసీపీ  నేతలు పెంపొందించుకోవాలి. జగన్ ఒక్కరు  తిరిగితే చాలదని ప్రతీ ఒక్కరూ ఆ పని చేయాల్సి ఉంటుందని గ్రహించాలి. శాంతియుత ప్రచారానికి ప్రాధాన్యమివ్వాలి. లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో కూడా పార్టీ ఓటమి ఖాయం..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి