యనమల సోదరుల వార్.. టిడిపి హైకమాండ్ బేజార్

By KTV Telugu On 2 March, 2023
image

కొందరికి వేరే శత్రువులు అవసరం లేదు. తమ నోరు తమ వ్యవహారశైలే వారికి శత్రువులను తెచ్చిపెడతాయి. ఈ ఆర్ట్ లో టిడిపి సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తిరుగులేని ఛాంపియనే అంటారు పొలిటికల్ సెటైరిస్టులు. తెలీని శత్రువులతో యుద్దం చేయడం ఎందుకు తెలిసిన శత్రువులతోనే తలపడదాం అనుకున్నారో ఏమో కానీ బయటి శత్రువులు చాలరన్నట్లు ఆయన తన ఇంట్లోనూ శత్రువును తయారు చేసుకుని యుద్ధం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో రాజకీయాల్లో అడుగు పెట్టిన యనమల రామకృష్ణుడు ఏపీ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు.
తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గం నుండి ఆరు సార్లు గెలిచిన యనమల 2009 ఎన్నికల్లో మొదటి సారి ఓడిపోయారు. ఆయన ఓటమికి ప్రధాన కారణం వరుసగా గెలిచిన దురహంకారంతో ప్రజలను పట్టించుకోకపోవడమే.

సమస్యలు చెప్పుకోడానికి ప్రజలు వస్తే వారికి అపాయింట్ మెంట్ కూడా ఇచ్చేవారు కాదు యనమల. ఆ కోపంతోనే నియోజకవర్గంలో యనమలపై తీవ్ర వ్యతిరేకత పెల్లుబికింది. అది ఎన్నికల్లో ప్రతిబింబించి యనమల ఓడారు.
ఆ ఓటమితో ఇక జనం తనను గెలిపించరన్న క్లారిటీకి వచ్చేశారు యనమల. దొడ్డిదోవ ఒకటి ఉండగా ప్రజాకోర్టులో ఎన్నికల బరిలో ఎందుకు దిగడం అనుకున్న యనమల 2014 ఎన్నికల్లో పోటీ చేయలేదు. బిజెపి-జనసేనల పుణ్యంతో టిడిపి అధికారంలోకి రావడంతో చంద్రబాబు నాయుడు యనమలను ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి కట్టబెట్టారు.
నిజానికి ఎన్టీయార్ పార్టీని పెట్టిన తర్వాత యనమల రామకృష్ణుణ్ని పిలిచి టికెట్ ఇవ్వగానే పోటీ చేయాలా వద్దా అన్న మీమాంసలో ఉన్నప్పుడు యనమల తమ్ముడు కృష్ణుడు నువ్వు పోటీ చేయాల్సిందే అన్నా నేను చూసుకుంటాను అని చెప్పి అన్నకు మద్దతుగా అహోరాత్రులూ కష్టపడి గెలిపించుకున్నాడు. అలా ఆరు సార్లు యనమల విజయం సాధించడంలో తమ్ముడు యనమల కృష్ణుడి కృషి జనాదరణే కారణమంటారు.

గెలిచిన తర్వాత నుంచి యనమల నియోజకవర్గాన్ని పట్టించుకోవడం మానేశారు. ప్రజలకూ దూరం అయ్యారు. అయితే ఎప్పుడూ జనంలో ఉండే తమ్ముడు కృష్ణుడి కారణంగానే ఆరు సార్లు గెలిచారు. 2009లో ఓడిన తర్వాత 2014 ఎన్నికల్లో యనమల పోటీ చేయకపోవడంతో ఆయన తమ్ముడు బరిలో నిలబడ్డారు. అయితే వైసీపీ అభ్యర్ధి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లోనూ పోటీచేసిన యనమల కృష్ణుడు మరోసారి వైసీపీ అభ్యర్ధి దాడిశెట్టి రాజా చేతుల్లోనే ఓడారు. అయితే ఆ రెండు సార్లూ జగన్ మోహన్ రెడ్డి ప్రభంజనంలోనే ఆయన ఓటమి చెందారు. ఇపుడు 2024 ఎన్నికల్లో అయినా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని యనమల కృష్ణుడు అనుకున్నారు. అయితే రెండు సార్లు వరసగా ఓడిన వారికి టికెట్లు ఇవ్వకూడదని మహానాడులో తీర్మానించడంతో తనకు ఇవ్వకపోతే కనీసం తన కుమారుడు శివరామకృష్ణకు అవకాశం ఇవ్వాలని కృష్ణుడు కోరారు.

దశాబ్ధాల తరబడి తమ్ముడి కష్టంతో గెలిచిన యనమల రామకృష్ణుడు చివరి నిముషంలో చక్రం తిప్పి తుని టికెట్ ను తన కుమార్తె దివ్వకు ఖరారు చేయించుకున్నారు. దీంతో యనమల కృష్ణుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీన్ని గమనించిన యనమల రామకృష్ణుడు తన తమ్ముడి సహకారం లేనిదే తన కూతురు గెలుపు సాధ్యం కాదని గమనించి తమ్ముడి సంగతిని చంద్రబాబు నాయుడి చెవిలో ఊదారు. దాంతో చంద్రబాబు నాయుడు కృష్ణుణ్ని పిలిపించుకుని వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధి దివ్య గెలుపుకోసం కృషి చేయాల్సిందిగా సూచించారు. ఎన్నికల తర్వాత ఏదో ఒక పదవి ఇస్తానని భరోసా కూడా ఇచ్చారట. అయితే కృష్ణుడు మాత్రం మౌనంగా ఉండిపోయారు. తన అన్నే తనకు వెన్నుపోటు పొడిచారని మండిపోతోన్న కృష్ణుడు వచ్చే ఎన్నికల్లో తాను కష్టపడి తన అన్న బిడ్డను గెలిపిస్తే ఇక ఆమె అక్కడ సెటిలైపోతారని రాజకీయంగా తానూ తన కొడుకూ సమాధి అయిపోవడం ఖాయమని భావిస్తున్నారట.

అందుకే వీలైతే మరో పార్టీకి మారిపోవడం లేదంటే వచ్చే ఎన్నికల్లో సహాయ నిరాకరణతో అన్న కూతురు దివ్యను ఓడించేసి రాజకీయంగా దెబ్బతీయడం లో ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనలో ఉన్నారట. యనమల సోదరుల మధ్య రగిలిన ఈ వివాదం తుని పరిసర నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్ధుల విజయావకాశాలను దెబ్బతీసే ప్రమాదం ఉందని అక్కడి నేతలు కంగారు పడుతున్నారట. ఎందుకంటే జిల్లాలో యాదవ ఓటర్లు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. యనమల రామకృష్ణుడి కన్నా కూడా తమ్ముడు కృష్ణుడికే యాదవుల్లో మంచి పట్టుందని అంటారు. టిడిపిలో తనకి న్యాయం జరగడం లేదని కృష్ణుడు భావిస్తే మాత్రం అది ఇరుగు పొరుగు నియోజకవర్గాల్లోనూ టిడిపిని దెబ్బతీయడం ఖాయమంటున్నారు రాజకీయ పండితులు. ఈ సమాచారంతో చంద్రబాబు నాయుడు కూడా కంగారు పడుతున్నారట. అంతిమంగా ఎన్నికలు దగ్గర పడే సమయానికి చంద్రబాబు తన నిర్ణయాన్ని మార్చుకుని యనమల కృష్ణుడికే టికెట్ ఇస్తారో లేక ఒకప్పటి తన మంత్రి వర్గ సహచరుడు యనమల బిడ్డకే టికెట్ ఇస్తారో వేచి చూడాలి.