రాజకీయంగా అంతగా పేరు లేని వ్యక్తి. ఎన్నికల్లో గెలిచినది కూడా లేదు. ఐనా అప్పుడప్పుడు ఆయన పేరు మీడియాలో వినిపిస్తూనే ఉంటుంది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ… వైసీపీలో చేరడం కారణంగా ఆయన కంటే అయన మీద పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డకే ఎక్కువ పబ్లిసిటీ వచ్చింది.బతిమలాడి, భంగపడి చివరకు వైసీపీ నుంచి బయటకు వచ్చిన యార్లగడ్డ.. ఇప్పుడు టీడీపీకి పెద్ద అసెట్ గా మారుతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కీలక నేతగా ఎదిగే అవకాశాన్ని పొందుతున్నారు…
ముద్దొచ్చినప్పుడే చంక ఎక్కాలంటారు. అవకాశం వచ్చినప్పుడే పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలంటారు. ఇంటా బయటా ఎక్కడైనా…. రాజకీయాల్లోనైనా ఇదే సూత్రం వర్తిస్తుంది. టీడీపీలో చేరిన గన్నవరం వైసీపీ లీడర్ యార్లగడ్డ వెంకట్రావు కూడా అదే పని చేస్తున్నారు. వచ్చిన ఛాన్స్ ను ఓ రేంజ్ లో ఉయోగిస్తున్నారు.
యార్లగడ్డ వెంకట్రావు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టీడీపీ. వచ్చిన రెండు మూడు రోజుల్లోనే యార్లగడ్డ యమ యాక్టివ్ అయ్యారు. ఇప్పటి వరకు క్రియాశీలంగా ఉన్న కార్యకర్తలను కూడా పక్కకు నెట్టి తాను దూసుకుపోయేంతగా వేగాన్ని ప్రదర్శించారు. ఇక వైసీపీ వద్దురా బాబు అని డిసైడ్ అయిన కొన్ని రోజుల్లోనే టీడీపీలోకి జంప్ చేసే అవకాశం రావడం ఆయన అదృష్టంగా భావించాలి. ఆ లక్కును యార్లగడ్డ బాగా ఉపయోగించుకుంటున్నారని చెప్పక తప్పదు. దశాబ్దాలుగా టీడీపీలో ఉన్న నాయకుడిలా అందరిలోనూ కలిసిపోయారు. చంద్రబాబును కలిసిన ఒక్క ఛాన్స్ లోనే ఆయన పార్టీ అధినాయకుడిని మెప్పించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను ఆకట్టుకోగలిగారు. వీడు మనవాడురా అని పార్టీ వారిచే అనిపించుకోగలిగారు.
యార్లగడ్డకు మంచి గేమ్ ప్లాన్ ఉంది. ఆయన ఒకప్పుడు అమెరికాలో కంపెనీ సీఈఓగా పనిచేశారు. ఆ అమెరికా అనుభవాన్ని కూడా వాడేశారు. చంద్రబాబు, లోకేష్ తో తాను తీయించుకున్న ఫోటోలను న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లో ప్రదర్శించేశారు. అంతే టీడీపీ కార్యకర్తల నుంచి చంద్రబాబు వరకూ ఆల్ హ్యాపీస్. గన్నవరం బహిరంగ సభలో కూడా తన స్పీచ్ ద్వారా యార్లగడ్డ ఆకట్టుకున్నారు. స్పీచ్ సింపుల్ గా అనిపించినా అందులో పెద్ద పెద్ద సందేశాలే ఉన్నాయి. స్టేజీ మీదున్న ప్రతి ఒక్కరి గొప్పదనాన్ని ఆయన టచ్ చేశారు. ప్రస్తుతం వైసీపీలో ఉన్న కొడాలి నాని, వల్లభనేని వంశీ టీడీపీకి ఎలా ద్రోహం చేశారో నేరుగానే చెప్పేశారు. ఈ క్రమంలో పార్టీకి, పార్టీ అధినేతకు ఎలాంటి మాటలు రుచిస్తాయో ఆయన అంచనా వేసినట్లయ్యింది. యార్లగడ్డ మంచి మాటకారి కూడా. ఎంతసేపు మాట్లాడినా ఇప్పుడే స్పీచ్ మొదలు పెట్టినట్లు ఉంటుందీ. భారీ పదజాలం కాకుండా మామూలు మాటలతో ఆయన ఆకట్టుకుంటారు. అదే ఆయన ప్లస్ పాయింట్ కావచ్చు.
యార్లగడ్డ ఇప్పుడు టీడీపీలోకి వచ్చేశారు. వైసీపీలో టికెట్ గ్యారెంటీ ఇస్తే ఆయన వచ్చేవారు కాదేమోనన్న చర్చ కూడా జరిగింది. పార్టీ అధినేత జగన్ ఎందుకనో వంశీ వైపు మొగ్గు చూపారు. వచ్చే ఎన్నికల్లో వంశీకే టికెట్ ఇస్తామన్న సందేశం ప్రతీసారీ బయటకు వచ్చింది. దానితో ఇక అక్కడ ఉండి లాభం లేదనుకుని యార్లగడ్డ రూటు మార్చేశారు. ఇప్పుడు ఆయన ముందున్న మొదటి సవాలు కూడా అదే.తనపై ఉన్న వైసీపీ ముద్రను పోగొట్టుకోవాలి. ఏ పరిస్థితుల్లో వైసీపీలో చేరాల్సి వచ్చింది. ఆ తప్పు ఎందుకు చేశానో వివరించి టీడీపీ కేడర్ ను కన్విన్స్ చేయాలి. అప్పుడే గన్నవరమైనా, గుడివాడ అయినా యార్లగడ్డ గెలిచే అవకాశం ఉంది. లేకపోతే అంతే…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…